Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2న ప్రగతి నివేదన బహిరంగసభ-ఒంటరిగానే ఎన్నికల బరిలోకి
- రాహుల్ పరిణితి పెంచుకో.. రాసిస్తే చదవడం మానుకో
- కుటుంబ పాలన గురించి మీరా మాట్లాడేదీ..?
- కాళేశ్వరానికి జాతీయహోదా ఇవ్వకున్నా.. రూ.20వేల కోట్లు ఇవ్వండి
- విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలి
- రాష్ట్రాలపై పెత్తనమొద్దు..స్వేచ్ఛనివ్వాలి
- ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే..
- రాష్ట్రంలో దగ్గర దగ్గర లక్ష ఉద్యోగాలిచ్చాం..
- మోడీవి మాటలే...చేతల్లేవు : సీఎం కేసీఆర్
- టీఆర్‌ఎస్ కార్గవర్గ సమావేశంలో 9 తీర్మానాలు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
వచ్చే ఎన్నికలకు సెప్టెంబరులోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. సెప్టెంబరు రెండున హైదరాబాద్‌లో ప్రగతి నివేదన బహిరంగ సభను నిర్వహిస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను ఇందులో ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విభజన హామీలపై పోరాటం చేసిందన్నారు. వెంటనే వాటిని నెరవేర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ నాలుగేండ్లుగా తియ్యటి మాటలు చెబుతున్నారేగాని, చేతల్లో హామీల అమలు లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగింది. కార్యవర్గంలో తీసుకున్న పలు నిర్ణయాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ముందస్తు ఎన్నికలకు పోతున్నారా అనే ప్రశ్నకు ఇప్పటికే ఎన్నికల ముగ్గులోకి వచ్చామని, ఇక ముందస్తు ప్రస్తావన ఎక్కడిదని ఎదురు ప్రశ్న వేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ పరిణితి పెంచుకోవాలి. రాసిస్తే చదవడం కాదు. కాంగ్రెస్ హయాంలో మిగులు ఆదాయం ఉందంటా.. ఇప్పుడు మైనస్‌లో ఉందంటా.! అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌లో అధికారం చేపట్టిందా..'' అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్ యువనేతకు చురకలంటించారు. రాహుల్‌గాంధీ కుటుంబపాలన గురించి మాట్లాడటం హాస్యాస్పదమనీ, ఢిల్లీ కుటుంబపాలన కంటే తమదే నయమని అన్నారు. రాహుల్‌గాంధీకి కేసీఆర్ భయపడడని స్పష్టం చేశారు. ఓయూలో సమావేశానికి వీసీ అనుమతించలేదనీ, తమకు సంబంధం లేదన్నారు. 'రాహుల్‌గాంధీ ఓయూ పోతే మాకేంటీ...జేయూకు పోతే మాకేంటి' అంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఏ పార్టీ నేతలైనా రాష్ట్రాల్లో పర్యటించడం మాములేనన్నారు. ఢిల్లీ నుంచి ఆదేశాలు రానిదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ నిర్ణయం తీసుకోలేరనీ, అయితే రాష్ట్ర ప్రజలు ఢిల్లీకి బానిసలుగా ఉండేందుకు ఒప్పుకోరని అన్నారు. 22లక్షల మందికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పారనీ, కానీ ఐదువేలే కట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారనీ, ఏనాడూ 22 లక్షలు కట్టిస్తామని చెప్పలేదన్నారు. కాంగ్రెస్ నేతలు వస్తే నిర్మాణం జరుగుతున్న ఇండ్లను చూపిస్తామన్నారు. లక్ష ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారనీ, కానీ ఆ సంఖ్యకు దగ్గరదగ్గర వరకూ ఇచ్చామని తెలిపారు.
కాళేశ్వరానికి రూ.20వేల కోట్లు ఇవ్వండి..
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకున్నా, కనీసం రూ.20వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని సీఎం కేసీఆర్ కోరారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి 9 తీర్మానాలను టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేసినట్టు చెప్పారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని, ఇంకా విభజనలో కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. వరి, మొక్కజోన్న పంటలకు రూ.రెండువేల మద్దతు ధర ఇవ్వాలని, ఉపాధి హామీ పథకాన్ని కార్యక్రమాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తీర్మానం చేసినట్టు చెప్పారు. ఒక రాష్ట్రానికి ఒక నీతి, మరో రాష్ట్రానికి , ఒక నీతి ఉండొద్దనీ, చట్టం అందరికీ ఒకేలా ఉండేలా చూడాలన్నారు. ఎస్సీ వర్గీకరణ న్యాయమైనదనీ, వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్ల పెంపునకు అనుమతించాలన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయాన్ని గతంలో మన్మోహన్‌సింగ్ దృష్టికి తీసుకుపోయాననీ, ప్రస్తుతం మోడీని కూడా కోరానని చెప్పారు. బీసీలు, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై గతంలో పలుమార్లు శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. దేశంలో 33 కోట్ల జనాభా ఉన్నప్పుడు పార్లమెంటు సీట్లను ఏర్పాటు చేశారనీ, కానీ 130కోట్ల జనాభా పెరిగినా ఎంపీ సీట్లు మాత్రం పెరగలేదనీ, వెంటనే పెంచాలని కోరారు. ఫెడరల్ స్ఫూర్తిని పెంపొంచేలా నీతిఅయోగ్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారనీ, కానీ కోఆపరేటీవ్ ఫెడరలిజం కనిపించడం లేదన్నారు. రాష్ట్రాలను మున్సిపాలిటీలుగా మారుస్తున్నారని విమర్శించారు. విద్యా, వైద్యం, వ్యవసాయం, రూరల్, అర్భన్ డెవలప్‌మెంట్ అంశాల్లో కేంద్రం జోక్యం తగ్గించుకోవాలని, రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వాలని కోరారు. కాంగ్రెస్ పాలన మొగల్ పాలనను తలపిస్తే, బీజేపీ పాలన మాటలు స్వీటుగా ఉన్నా, పనులేమీ జరగడం లేదన్నారు.వచ్చే ఎన్నికల్లో ఏపార్టీతో పొత్తుపెట్టుకోబోమనీ,ఒంటరిగానే బరిలోకి దిగుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. సీట్లు, పొత్తుల విషయంలో వస్తున్న అసత్య ప్రచారాన్ని ఆయన ఖండించారు. 40 సీట్లలో వేరే వారికి పెడతారనే దాంట్లో వాస్తవం లేదన్నారు. సెప్టెంబర్ 2న టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభలో ప్రభుత్వం చేస్తున్న, చేసిన ప్రగతి నివేదికను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. నగర శివారులో మూడుస్థలాలు చూశామనీ, త్వరలో సౌకర్యాలు ఉన్న స్థలాన్ని ఎంపిక చెస్తామని వివరించారు. పార్టీ నేత కే కేశవరావు నేతృత్వంలో కమిటీనీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, తాము సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే వేర్వేరు సంస్థలతో 6,7 సర్వేలు నిర్వహించామన్నారు. సర్వేల్లోనూ వందసీట్లకు పైగా టీఆర్‌ఎస్ సాధించబోతున్నదని వచ్చిందని తెలిపారు. తెలంగాణ గడ్డపై పుట్టిన వారంతా తెలంగాణ వాళ్లేనని స్పష్టం చేశారు. ఆంధ్రావాళ్లు పెట్టుబడులు పెడితే స్వాగతిస్తామని గతంలోనే చెప్పినట్టు గుర్తుచేశారు.
స్ట్రాంగ్‌గా ఫెడరల్ ఫ్రంట్ ..
దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌పార్టీలు దేశాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాయని కేసీఆర్ అన్నారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్టు మరోసారి స్పష్టం చేశారు. దేశంలో గూడ్స్ ట్రైన్ గంటకు 39 కిలోమీటర్లు పోతే, అంతర్జాతీయ సరాసరి సగటు 89 కిలోమీటర్లుగా ఉందని తెలిపారు. దేశంలో 70వేల టీఎంసీల నీళ్లున్నా, వీటిలో కేవలం 30వేల టీఎంసీలు కూడా ఉపయోగించుకోవడం లేదన్నారు. ఫెడరల్ ఫ్రంట్ స్ట్రాంగ్‌గానే ఉందనీ, త్వరలోనే నవీన్ పట్నాయక్‌ను కలవబోతున్నట్టు చెప్పారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నికల్లో నితీష్‌కుమార్ ఫోన్ చేసి మద్దతివ్వాలని కోరారనీ, కాంగ్రెస్ పార్టీ తమను మద్దతు కోరలేదన్నారు. ఒక ప్రాంతీయ పార్టీ అభ్యర్థి కాబట్టి జేడీయూకు తాము మద్దతిచ్చామనీ, భవిష్యత్‌లో తమకు సహకరిస్తామని నవీన్ పట్నాయక్ తెలిపినట్టు చెప్పారు.
ఆచరణ సాధ్యం కాని హామీలు..
కాంగ్రెస్ ఎన్నికల్లో లబ్ధికోసం ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటిస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ఏకకాలంలో రూ.రెండు లక్షల రుణమాఫీ అంటున్నారని కానీ అది పచ్చి అబద్ధమన్నారు. రాష్ట్రం నెలసరి ఆదాయం రూ.10,500కోట్లు వస్తుందన్నారు. పదినెలల పాటు ఈ ఆదాయాన్ని మొత్తం దానికే కేటాయించాల్సి ఉంటుందనీ, ఇది అమలు చేస్తే పింఛన్లు, ఫీజురీయింబర్స్‌మెంట్, రేషన్, జీతాలు ఏం ఆపేస్తారని ప్రశ్నించారు. కర్నాటక ముఖ్యమంత్రి అడిగితే విడతల వారిగా ఇవ్వాలని సూచించినట్టు చెప్పారు. '' నిరుద్యోగభృతి ఇస్తామని అంటున్నారు. మీ దగ్గర లెక్కలున్నాయా..? అసలు నిరుద్యోగి అంటే ఎవరో చెప్పండి.. ఎంతమంది ఉన్నారో ముందు చెప్పాలి..'' అని అన్నారు. కేంద్రప్రభుత్వ హామీలపై 16 రోజుల పాటు పార్లమెంట్‌లో ఆందోళనలు చేసినట్టు గుర్తుచేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా 20 సీట్లు సాధిస్తుందా.? అని ప్రశ్నించారు. అసెంబ్లీ రద్దు చేస్తే మంత్రివర్గ సహచరులకే చెప్పరని, మీకెలా చెబుతామని విలేకరులడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా సీఎం చెప్పారు. ''45 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. జైపాల్‌రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. విజ్ఞతతో వ్యవహరిస్తే కనీసం గౌరవమైనా ఉంటది. జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు విషయమై విలేకర్లు ప్రస్తావించగా, ఎవరికీ అన్యాయం చేయమని, కోర్టు మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని చెప్పారు. జర్నలిస్టు సంఘాలతో త్వరలో ఒక కమిటీ వేస్తామని ప్రకటించారు. కెమెరా, వీడియో జర్నలిస్టు అనే తేడా లేదని, అందరు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని వివరిం చారు. ఇప్పటికే హౌసింగ్ సోసైటీలకు స్థలాలు ఇవ్వడానికి ఆదేశాలు ఇచ్చినట్టు గుర్తు చేశారు. అవసరమైతే పార్టీ సీనియర్ సేత కే.కేశవరావుతో కమిటీ వేస్తామని ప్రకటించారు.
ముందస్తుకు కేసీఆర్ సై !
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం టీఆర్‌ఎస్ రాష్ట్రకార్యవర్గంలో చేసిన ప్రకటనే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నది. సెప్టెంబరులో అభ్యర్థులను ప్రకటిస్తామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధమేనని చెప్పడం వెనుక అసలు మర్మం ముందస్తు ఎన్నికలే తేలిపోయింది. జమిలి ఎన్నికలతో కారుకు కష్టాలు తప్పవని కేసీఆర్ భావించడం మూలానే ఈ మధ్య ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో ముందస్తు ఎన్నికల విషయం చర్చించినట్టు తెలిసింది. జమిలి ఎన్నికలు జరిగితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే వాతావరణం రాష్ట్రంలో కనిపిస్తే టీఆర్‌ఎస్‌కు ప్రయోజనం ఉండదు. దీంతోనే ముందస్తుకు కేసీఆర్ మొగ్గారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా గతవారం రోజుల నుంచి కొంత మంది ప్రముఖులతోనూ కేసీఆర్ సంప్రదింపులు చేశారని, ఆమేరకే ఒక నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. రానున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం తదితర రాష్ట్రాలతోపాటు తెలం గాణ అసెంబ్లీ ఎన్నికలు జరపాలని కోరినట్టు సమాచారం.