Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంద రోజుల విద్యా పోరాటయాత్ర
- రేపటినుంచి డిసెంబర్ 6 వరకు నిర్వహణ
- విద్యాపరిరక్షణ కమిటీ నేతల పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉన్నోళ్లకు... లేనోళ్లకు ఒకే బడి... ఒకే చదువు కోసం తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ పోరుబాటకు సన్నద్ధమవుతున్నది. వంద రోజులపాటు విద్యా పోరాట యాత్రను నిర్వహించనుంది. ఈనెల 14న హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపం వద్ద నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. డిసెంబర్ 6న ఖమ్మంలో ఈ యాత్ర ముగియనుంది. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విద్యా పోరాట యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి లక్ష్మినారాయణ మాట్లాడుతూ అందరికీ సమానమైన నాణ్యమైన అందాలని డిమాండ్ చేస్తూ వంద రోజులపాటు విద్యా పోరాట యాత్ర చేపడుతున్నామని చెప్పారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో విద్యారంగం ప్రధాన ఎజెండా చేసేందుకు, ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని చెప్పారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పి విద్యారంగాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. టీడీపీ 17 శాతం, కాంగ్రెస్ 13 శాతం విద్యారంగానికి నిధులు కేటాయిస్తే, టీఆర్‌ఎస్ 8 శాతానికి పరిమితం చేసిందని ఎద్దేవా చేశారు. బడిబయట 4 లక్షల పిల్లలున్నారని అన్నారు. వారిని బడుల్లో చేర్పిస్తే మరో 4 వేల పాఠశాలలు అవసరమవుతాయని చెప్పారు. ఇవేవీ చేయకుండా ప్రయివేటు, కార్పొరేట్ విద్యారంగాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం బలోపేతం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని క్రమంగా బలహీనపరిచిందని, నిధులు తగ్గించడం, మౌలిక వసతులు కల్పించకపోవడం, ఉపాధ్యాయులను నియమించకపోవడం ఇందులో భాగమేనని వివరించారు. విశ్వవిద్యాలయాల్లో సంఫ్‌ుపరివార్ శక్తులు సామాజిక శక్తులపై దాడిచేస్తున్నాయని విమర్శించారు. విద్యా కాషాయీకరణ, విద్యావ్యాపారీకరణ మోడీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా జరుగుతోందన్నారు. నూతన పద్ధతుల్లో మనుధర్మాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. పీడితులు, అణగారిన వర్గాలపై జరిగే దాడి జ్ఞానంపైనా జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన, సమానమైన విద్య అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షులు చక్రధర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భగవంత్‌రెడ్డి, విమలక్క, రవిచంద్ర, ఎం రఘుశంకర్‌రెడ్డి, ప్రదీప్, రాము, పరశురాం, జి సదానంద్ తదితరులు పాల్గొన్నారు.