Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సంక్షేమ పథకాల అమలుతోనే సామాజిక మార్పు, సామాజిక న్యాయం సాధ్యమని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. గురువారం సంక్షేమ భవన్‌లో ఎస్సీ అభివృద్ధి శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలు, అభివద్ధి పనులపై ఆయన సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ మైనార్టీ, దళితుల సాధికారత, వారి పురోగతికి ప్రాధాన్యతను ప్రజల్లోకి విస్తతంగా తీసుకెళ్లి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యావంతులైన నిరుద్యోగ యువతకు నూతన నైపుణ్యాలతో శిక్షణను ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీలను ప్రభుత్వ గ్యారంటీతో వేలాది మంది దళితులకు మోటారు కార్లను అందించి స్వయం ఉపాధి కల్పించామని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ విధంగా రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ఎస్సీ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లోనూ విద్యార్దులు, ఉపాధ్యాయులకు సంబంధించి బయోమెట్రిక్ విధానాన్ని పూర్తిచేయాలని సూచించారు. ఎస్సీలు చిన్న , మధ్య తరహా పరిశ్రమల స్ధాపన కోసం చేపట్టాల్సిన చర్యలపై త్వరలోనే ఆయా సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజరు మిశ్రా, ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.