Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మె న్యాయబద్ధం..
- ఆర్టీసీ కార్మికుల పోరాటం ప్రజారవాణా మెరుగు కోసమే
- 50 ప్రయివేటీకరిస్తే..నియంత్రణ కష్టమే..
- బంద్‌లో ప్రజలందరూ పాలుపంచుకోవాలి
- సత్వరమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలి
- లేకుంటే పోరాటం ఉధృతం చేస్తాం
- రాష్ట్ర ప్రభుత్వానికి కార్మిక సంఘాల నేతల హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'సమ్మె న్యాయబద్ధం. ప్రజాస్వామ్యయుతం. సీఎం చేసిన సెల్ఫ్‌డిస్మిస్ వ్యాఖ్యలు చట్టవిరుద్ధం. నోటీసు ఇచ్చి కండ్లల్లో కాయలు కాసేలా ఎదురుచూసినా...సర్కారు నుంచి పిలుపు రాక విధిలేని పరిస్థితుల్లోనే కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ప్రయివేటు ట్రావెల్స్‌పై నియంత్రణ లేకపోతే అడ్డూఅదుపూ ఉండదు. 50 శాతం ప్రయివేటీకరణ అంటే...ప్రజారవాణాపై ఆధిపత్యాన్ని కార్పొరేట్, ప్రయివేటు శక్తులకు కట్టబెట్టడమే. అదే జరిగితే సామాన్యుడు ప్రయాణం చేయాలంటే చార్జీలకు జంకాల్సిందే. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయివేటు బస్సు ఎక్కాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీని బతికిచ్చుకునేందుకు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటానికి ముక్తకంఠంగా మద్దతు తెలపాలి. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజానీకానికి ప్రజారవాణాను దూరం చేసే కుట్రను తిప్పికొట్టాలంటే 19న జరిగే సమ్మెలో, బంద్‌లో ప్రజలంతా పెద్ద ఎత్తున పాలుపంచుకోవాలి. ఆర్టీసీ కార్మికులసమస్యల పరిష్కారం కోసం సర్కారు దిగిరాకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తాం' అంటూ కార్మిక సంఘాల నేతలు ముక్తకంఠంతో అంటున్నారు. సమ్మె నేపథ్యంలో కార్మిక సంఘాల అభిప్రాయాలు నేతల మాటల్లోనే..
సమ్మె ప్రజాస్వామ్యబద్ధమైనది:ఎం.శ్రీనివాస్, ఐఎఫ్‌టీయూ, ప్రధాన కార్యదర్శి
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె న్యాయ, ప్రజాస్వామ్యబద్ధమైనది. ఆర్టీసీ నష్టాలకు రాష్ట్ర ప్రభుత్వానిదే కారణం. కార్మికులది ఎట్టిపరిస్థితుల్లోనూ కాదు. ఇది జీతాల కోసం చేస్తున్న సమ్మె కాదిది. తెలంగాణ ప్రజల భవిష్యత్ ప్రయోజనాల కోసం జరుగుతున్నది. 2014, 2019 ఎన్నికల సమయంలోనూ ఆర్టీసీ కార్మికులకు అనేక హామీలనిచ్చి సీఎం కేసీఆర్ మాటతప్పారు. ఇప్పుడు ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయన ఎత్తుగడల్ని తిప్పికొడతాం.
సీఎం భేషజాలకు పోకుండా సమస్యను పరిష్కరించాలి:బీ.వెంకటేశం, ఏఐటీయూసీ కార్యదర్శి
ఆర్టీసీ కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే తన పండ్లతోని పీకుతానని చెప్పిన సీఎం కేసీఆర్...ఇప్పుడు వాళ్ల ఉద్యోగాలనే పీకేసే కుట్రకు తెరలేపారు. ఆర్టీసీని బతికిచ్చుకునేందుకే కార్మికులు విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు దిగారు. కోర్టు కూడా కార్మికుల పక్షానే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. సీఎం కేసీఆర్ భేషజాలకు పోకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి వెంటనే సమ్మెను విరమించేలా చూడాలి. 19న జరిగే సమ్మెలో, బంద్‌లో పాల్గొంటాం.
చట్టపరిజ్ఞానం లేనోడు కేసీఆర్..సమ్మెకు మద్దతు:కె.సూర్యం, ఐఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి
చట్టపరిజ్ఞానం బొత్తిగా లేనోడు సీఎం కేసీఆర్. సెల్ఫ్ డిస్మిస్ అంట చట్టంలో ఎక్కడుంది? ప్రభుత్వమే మళ్లీ కార్మికులను డిస్మిస్ చేయలేదని హైకోర్టులో చెప్పింది. అంటే కేసీఆర్ బెదిరింపులకు దిగుతున్నడు. ఇక్కడ వాటికి భయపడే కార్మికులెవ్వరూ లేరు. 48 వేల మంది కార్మికులు సమ్మెలో ఉన్నారంటేనే ఐక్యత ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. చేసిన పనికి వేతనమివ్వకుంటే పదిరెట్లు ఎక్కువ పరిహారం ఇవ్వాలనే విషయం కేసీఆర్‌కు తెల్వనట్టున్నది? కార్మిక చట్టాల గురించి ఆయన తెలుసుకుంటే మంచిగుంటది. 19న జరిగే బంద్‌కు, సమ్మెకు కార్మిక లోకమంతా మద్దతు తెలపాలని కోరుతున్నాం.
హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం... 19న బంద్‌కు మద్దతిస్తాం..
:ఆర్‌డీ చంద్రశేఖర్, ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి
కార్మిక యూనియన్లతోని సమస్యల పరిష్కారం జరపాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించడాన్ని స్వాగతిస్తున్నాం. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ విధానాలతో ఆర్టీసీ కార్మికులే కాదు...మున్సిపల్, విద్యుత్, గ్రామపంచాయతీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, డిఫెన్స్...ఇలా అన్ని రంగాల కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రానున్నదంతా పోరాటాల కాలమే. కార్మిక లోకం ఐక్యంగా ముందుకు సాగాలి. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుంది. 19న ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌లో పాల్గొంటాం. ప్రజలంతా బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
సమ్మెకు సర్కారు తీరే కారణం :ఎమ్‌కే బోస్, టీఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి
సమ్మెకు సర్కారు నాన్చుడు ధోరణినే కారణం. సమ్మె నోటీసు ఇచ్చి 34 రోజుల పాటు పట్టిం చుకోకపోవడమంటేనే ఆర్టీసీ పట్ల సర్కారుకు ఎంత ప్రేమ ఉందో అర్ధమవుతుంది. వేతన ఒప్పందంపైనా దాటివేత ధోరణిని అనుసరించింది. సమ్మె నోటీసు ఇస్తే...ఆర్టీసీ ఎండీగానీ, ఈడీగానీ, చైర్మెన్‌గానీ, రవాణాశాఖ మంత్రిగానీ చర్చలకు పిలువకపోవడం, త్రిసభ్య కమిటీ చర్చల్లో పాల్గొనకపోవడం దారుణం. ఆర్టీసీ కార్మికుల 26 డిమాండ్లు న్యాయ సమ్మతమైనవే. వాటిని పరిష్కరించాల్సిందే. 19న జరిగే ధర్నాలో టీఎన్‌టీయూసీ అనుబంధ సంఘాలన్నీ పాల్గొంటాయి. సమ్మెకు పూర్తి మద్దతిస్తున్నాం.
ప్రజారవాణా బతికించే పోరులో కార్మికుల వెన్నంటే
ప్రజారవాణాను బతికించుకునేందుకు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటానికి వెన్నంటే ఉంటాం. ప్రతిపిలుపులోనూ భాగస్వామ్యమవుతాం. కార్మికులు పెట్టిన డిమాండ్లలో నూటికి 90 శాతం ప్రజారవాణా మెరుగుదల కోసమే. పెద్దపెద్ద యుద్ధాలే చర్చల ద్వారా పరిష్కారం అవుతున్నాయి...ఆర్టీసీ కార్మికులతో సమస్యలపై ఎందుకు చర్చించరు? అని హైకోర్టు మెట్టికాయలు వేసినా సర్కారుకు చీమకుట్టినట్టయినా లేకపోవడం దారుణం. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలవి ఒకేదారి. కేంద్ర ప్రభుత్వం రైల్వేలను ప్రయివేటీకరిస్తుంటే...రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని 50 శాతం ప్రయివేటీకరించే కుట్రకు తెరలేపింది. అలాగైతే రూట్లపై నియంత్రణ ఉండదు. ప్రయివేటు బస్సులు ఇష్టమొచ్చినట్టు చార్జీలు వసూలు చేస్తాయి. ప్రయాణికుల ప్రాణాలకూ భద్రత ఉండదు. ఇటీవల మోడీ సర్కారు తీసుకొచ్చిన మోటారు వాహనాల చట్టం సవరణల్లో అన్ని రాష్ట్రాల్లో 20 శాతం ప్రయివేటు బస్సులను నడపాలని పొందుపరిచిన విధంగానే రాష్ట్రంలో 20 శాతం ప్రయివేటు బస్సులను నడుపుతామని కేసీఆర్ ప్రకటించడం అంటే..పైకి విమర్శలు చేసుకుంటున్నప్పటికీ వారిద్దరూ కలిసేపోతున్నారని ఇట్టే అర్థమవుతుంది. సర్కారు ఎంతకూ స్పందించకపోవడంతోనే దిక్కులేని పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ప్రజలు దీన్ని గమనించాలి. ప్రజారవాణా బలోపేతం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటానికి ప్రజలంతా సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరుతున్నాం. 19న జరిగే సమ్మెలో, బంద్‌లో ప్రజలు పూర్తిగా పాల్గొనాలని సీఐటీయూగా పిలుపునిస్తున్నాం.
- ఎం.సాయిబాబు, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి