Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడారం కేంద్రంగా ఇసుక మాఫియా
- అనుమతులు పదింటికి.. తరలించేది వందల లారీలు
- ఓ మాజీ మంత్రి అండదండలు
మేడారం నుంచి పార్నంది వెంకటస్వామి
మేడారం కేంద్రంగా ఇసుక మాఫియా కోరలు చాస్తున్నది. రోజూ గోదావరి నుంచి ఏటూరునాగారం కేంద్రంగా వందలాది లారీల్లో ఇసుక తరలిస్తోంది. సాక్షాత్తూ మేడారంలోని జంపన్నవాగుపై ఇసుక మాఫియా కన్నేసింది. పదింటికి అనుమతి తీసుకొని వందల లారీల్లో ఇసుక తరలిస్తూ కోట్ల రూపాయలు పోగేస్తోంది. ఇసుక మాఫియాకు స్థానిక టీఆర్‌ఎస్ నాయకుల అండదండలు ఉండగా, ఈ దందా వెనుక ఓ మాజీ మంత్రి హస్తం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికారుల అండదండలూ పుష్కలంగా ఉన్నట్టు సమాచారం.
ఉమ్మడి వరంగల్ జిల్లా (ప్రస్తుత ములుగు)లో రెండేం డ్లకు ఒకసారి సమ్మక్క-సారలమ్మల జాతర జరుగుతుంది. గద్దెలకు కూతవేటు దూరంలోనే జంపన్న వాగు ఉంది. జాతరకు వచ్చిన వారు జంపన్న వాగులో స్నానం చేయడం ఆనవాయితీ. అందువల్ల వాగులోని కట్టె పుల్లను సైతం ఎవరూ ముట్టరు. స్థానికులు తమ ఇండ్ల నిర్మాణాలకూ ఈ ఇసుకను వాడటానికి భయపడతారు. కానీ ఇసుక మాఫియా మాత్రం వాగునే మాయం చేసే పనిలో ఉంది. జంపన్నవాగులోని ఇసుకను అడ్డగోలుగా తోడేస్తున్నారు. రోజుకు 50 నుంచి 100 లారీల ఇసుకను తరలిస్తున్నారు. ఈ క్రమంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొన్నింటికే అనుమతి..
ములుగు జిల్లా కేంద్రంలో ఇండ్లు, మరుగుదొడ్లతో పాటు ప్రభుత్వ భవన నిర్మాణాల కోసం జంపన్నవాగు నుంచి ఇసుక తోడేందుకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు. దాంతో ఊరట్టం సమీపంలో ఇసుక తీసేందుకు స్థానిక రెవెన్యూ అధికారులు రోజుకు 10 నుంచి 20 లారీలకు అనుమతి ఇస్తున్నారు. ఒక్కొక్క లారీ ఇసుకకు 2,400 రూపాయలు ఫీజుగా వసూలు చేస్తున్నారు. లారీలో 12 క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలిస్తున్నారు. అయితే, అనుమతి కొన్నింటికే ఉంటే వందల లారీల్లో ఇసుక తరలిస్తున్న పరిస్థితి. వారం రోజుల కింద తహసీల్దార్ పాలకుర్తి భిక్షం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనుమతి లేకుండా ఇసుక నింపిన 27 లారీలను సీజ్ చేశారు. ఒక్కొక్క లారీకి రూ.50వేల చొప్పున జరిమానా విధించినా.. పై నుంచి ఒత్తిడి రావడంతో కొన్నింటిని వదిలేసినట్టు తెలుస్తోంది. జంపన్నవాగు కేంద్రంగా ఊరట్ట గ్రామాన్ని ఆనుకొని అధికారుల కండ్లు కప్పి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు స్థానికులు వాపోతున్నారు.
టీఆర్‌ఎస్ నాయకుల అండదండలు !
మేడారం, ఊరట్టం, రెడ్డిగూడెం, నార్లాపూర్ గ్రామాలకు చెందిన కొందరు టీఆర్‌ఎస్ నాయకుల అండదండలతో ఇసుక మాఫియా జంపన్న వాగును తోడేస్తున్నట్టు తెలుస్తోంది. వారికి ఓ మాజీ మంత్రి సహాయం అందిస్తున్నట్టు సమాచారం. జంపన్నవాగు నుంచి లారీల్లో ఇసుకను ములుగుకు తరలించి అక్కడ డంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రికి రాత్రి హన్మకొండ, హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. లారీ ఇసుకను 40వేల నుంచి 60వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. వీరికి స్థానిక పోలీస్, రెవెన్యూ అధికారుల అండదండలు కూడా పూర్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.
జంపన్న వాగునే మాయం చేస్తుండ్రు:రైతు జంగా వెంకట్రాంరెడ్డి
జంపన్న వాగు నుంచి ఇసుకను తాసుకెళ్లడానికి మేము భయపడతాం. ఇసుక మాఫియా మాత్రం అడ్డూ అదుపు లేకుండా వాగును తోడేస్తోంది. భూగర్భ జలాలు పడిపోయే ప్రమాదం ఉంది. రాత్రి వేల లారీలు వస్తుండటంతో జనం భయపడుతున్నారు. అధికారుల అండదండలతోనే ఇదంతా జరుగుతోంది. జాతర సందర్భంగా పంట నష్టపోయినా రైతులకు ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వడం లేదు.
అనుమతి లేకుంటే సీజ్ చేస్తున్నాం:పాలకుర్తి భిక్షం- తాడ్వాయి తహసీల్దార్
స్థానిక అవసరాల కోసం మాత్రమే అనుమతి ఇచ్చాం. అనుమతి లేకుండా లారీల్లో ఇసుక నింపితే సీజ్ చేస్తున్నాం. తాను ఆకస్మికంగా తనిఖీ చేసి 27 లారీలు సీజ్ చేశాం. పర్మిట్ లేకుండా తరలిస్తున్న విషయం వాస్తమే. ఇక నుంచి రోజూ తనిఖీలు చేస్తాం. స్థానికంగా వీఆర్‌ఓను ఏర్పాటు చేస్తాం.