Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెలాఖరువరకు ప్రభుత్వ వైఖరి చూస్తాం
- ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
- సెల్ఫ్‌డిస్మిస్ అన్నదీ ఎక్కడా లేదు:ఉద్యోగ జేఏసీ చైర్మెన్ రవీందర్‌రెడ్డి
- సీఎస్‌కు వినతి.. కలిసేందుకు రెండు గంటలు నిరీక్షణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే అవసరమైతే సమ్మెకు పూనుకుంటామని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మెన్ కారం రవీందర్‌రెడ్డి హెచ్చరించారు. ఈనెల 19న ఆర్టీసీ జేఏసీ రాష్ట్రబంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలనీ, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలనీ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని గురువారం హైదరాబాద్‌లోని బీఆర్‌కేఆర్ భవన్‌లో కారం రవీందర్‌రెడ్డితోపాటు వి మమతల నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. అయితే గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎస్‌ను కలుస్తున్నామని మీడియాకు సమాచారం అందించారు. కానీ ఆరు గంటలకు సీఎస్‌ను కలిసేందుకు అవకాశం రాలేదు. దీంతో రెండు గంటలపాటు సీఎస్‌ను కలవకుండా నిరీక్షించారు. సీఎస్‌ను కలిసిన అనంతరం మీడియాతో రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 19న భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సెల్ఫ్ డిస్మిస్ అన్నదీ ఎక్కడా లేదన్నారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారమయ్యాక కార్మికులు విధుల్లో చేరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 13 రోజులుగా సమ్మె జరగడం వల్ల ఇటు కార్మికులు, అటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల స్థానంలో ఉద్యోగులను నియమించిన ఆదేశాలను వెనక్కి తీసుకో వాలని కోరారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటిం చాలని సూచించారు. వెంటనే పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెండు డీఏలు అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల ను తేవాలని సూచించారు. రెవెన్యూ శాఖలో పనిఒత్తిడి పెరిగిందని చెప్పారు. ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనీ, ఔట్‌సోర్సిం గ్ సంస్థలను రద్దు చేయాలనీ, ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలనీ డిమాండ్ చేశారు. సీఎస్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈనెల 24న ఎన్నికల కోడ్ ముగుస్తుందని, సమస్యలపై సీఎం దృష్టిసారిస్తారన్న నమ్మకముందని అన్నారు. సెక్రెటరీ జనరల్ వి మమత మాట్లాడుతూ అతిత్వరలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. సీఎస్‌ను కలిసిన వారిలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు జ్ఞానేశ్వర్, ఎం రాజేందర్, ఉపేందర్‌రెడ్డి, సత్యనారాయణ, మణిపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ఎంబి కృష్ణయాదవ్, ముజీబ్, రామినేని శ్రీనివాసరావు, కృష్ణకుమార్, లక్ష్మణ్‌రావు, టి విజయసాగర్ తదితరులు పాల్గొన్నారు.