Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితులను పట్టుకున్న పోలీసులు
నవతెలంగాణ- సిటీబ్యూరో
హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఆటో డ్రైవర్ హత్యకు గురయ్యాడు. అయితే, కొన్ని గంటల్లోనే పోలీసులు నిందితులను పట్టుకున్నారు. హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా ముగ్గురు నిందితులను పోలీసులు చాంద్రాయణగుట్టలో అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మీడియాకు వివరించారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గత జూన్‌లో ఆటోడ్రైవర్ మహ్మద్ అన్వర్ హత్యకు గురయ్యాడు. ఆ కేసులో ప్రస్తుతం మరో ఆటో డ్రైవర్ రియాసత్‌అలీ ప్రధాన నిందితుడు. అతను జైలు నుంచి తొమ్మిది రోజుల కిందట బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ క్రమంలో మహ్మద్ అన్వర్ స్నేహితులు ఐదుగురు పంజాగుట్టలోని నాగార్జున సర్కిల్‌లో ఆదివారం ఉదయం నడిరోడ్డుపై రియాసత్ అలీని కత్తులతో పొడిచి హత్య చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పంజాగుట్ట ఏసీపీ తిరుపతయ్య, డీఐ నాగయ్య, ఎస్‌ఐ.నాగరాజు నిందితుల కోసం గాలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను కొన్ని గంటల్లోనే చాంద్రాయణగుట్ట ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు అబ్దుల్ రహమాన్‌తో పాటు అతని స్నేహితులు మహమ్మద్ అజహర్, అబ్దుల్ అలీంను అరెస్టు చేశారు. అజ్మద్, హసన్ పరారీలో ఉన్నారు. హత్యకు ఉపయోగించిన 5 కొబ్బరి బొండాల కత్తులు, మారుతి ఓమ్నీ వాహనం, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో 3.20 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయని, జరగబోయే నేరాలను ముందుగానే పసిగట్టేలా సాంకేతికతను అభివద్ధి చేస్తున్నామని సీపీ తెలిపారు.