Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తడిసిన ధాన్యం, మొక్కజొన్న
- నేలకొరిగిన పైర్లు
నవతెలంగాణ- యంత్రాంగం
మూడు రోజులుగా కురుస్తున్న వర్షం వల్ల చేతికందొచ్చిన పంటలకు నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబెట్టిన, మార్కెట్‌కు తెచ్చిన వరి, మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి. కొన్ని చోట్ల వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, గన్నేరువరం, ఇల్లందకుంట మండలాల్లో శనివారం రాత్రి కురిసిన వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. జమ్మికుంట మండలంలో దాదాపుగా 1150 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లిలో ఇండ్లలోకి వర్షం నీరు నిలిచింది. గన్నేరువరం మండలంలో అరిగల అంజనేయులుకు చెందిన ఆవు పిడుగుపాటుకు మృత్యువాత పడింది. మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్, లక్షెట్టిపేట, కాసిపేట మండలాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. చేతికొచ్చిన వరి పైరు నీళ్లలో ఒరిగిపోయింది. లక్షెట్టిపేట మండలంలో సుమారు 70 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వ్యవసాయాధికారులు పంట పొలాలను పరిశీలించి తీవ్రతను నమోదు చేశారు.
ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. మేడారం సమీప ప్రాంతాల పంట పొలాలు జలమయమయ్యాయి. చిన్నగూడురు మండల కేంద్రంలోని ఆకేరు వాగు డ్యాం నిండి అలుగు పోస్తోంది. గోవిందరావుపేట మండలంలో 200 ఎకరాల వరి పైరు నేలవాలింది.