Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15న తహసీల్దార్ కార్యాలయాల ముందు వంటావార్పు
- 16నుంచి భూ సంబంధిత విధుల బహిష్కరణ
- ప్రభుత్వం దిగి రాకుంటే త్వరలో 'రెవెన్యూ సింహగర్జన'
- సర్కార్‌కు రెవెన్యూ జేఏసీ అల్టిమేటం
- ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్దతు : ఉద్యోగ, ఉపాధ్యాయ,కార్మిక సంఘాల తీర్మానం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా నవంబర్ 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు 'పెన్‌డౌన్' నిర్వహించనున్నట్టు తెలంగాణ రెవెన్యూ జేఏసీ ప్రకటించింది ఆత్మాహుతి దాడులు జరుగుతుంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తున్నది... ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగాలు చేయలేము.. ప్రభుత్వం తమ భద్రతకు హామి ఇచ్చేవరకు పోరాటం తప్పదని హెచ్చరించింది. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక, పెన్షనర్లు, సీపీఎస్ ఉద్యోగులు, రెవెన్యూ జేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం-తదుపరి పరిణామాలు అంశంపై రౌండ్ టేబుల్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి భవిష్యత్ పోరాట కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 13 నుంచి పెన్‌డౌన్ సమ్మెతో పాటు ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందజేయాలనీ, 15న తహసీల్దార్ కార్యాలయాల ముందు వంటావార్పు చేపట్టాలనీ, ప్రభుత్వం అప్పటికీ స్పందించకపోతే 16 నుంచి భూ సంబంధిత. విధులను నిరవధికంగా బహిష్కరిస్తామని ప్రకటించారు. అలాగే 16, 19, 22 తేదీల్లో రాష్ట్రంలో మూడు ప్రాంతీయ సదస్సుల నిర్వహణతోపాటు త్వరలో హైదారబాద్‌లో' రెవెన్యూ సింహగర్జన' నిర్వహించనున్నట్టు వివరించారు. 38 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో పాటు అవసరమయితే ఉద్యమంలో భాగస్వాములమవుతామన్నారు. 'ఈరోజు కేవలం రెవెన్యూ శాఖకే జరిగింది అనుకోవడానికి వీల్లేదు... రేపు అన్ని శాఖలకు ఇదే పరిస్థితి రావచ్చు... ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు... ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మిక సంఘాలన్ని కలిసి రావాలి' అని ఆయన పిలుపు నిచ్చారు. రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదనీ. ఒక కుక్కను చంపేముందు, అది పిచ్చి కుక్క అని ప్రచారం చేసి చంపుతున్నట్టు రాష్ట్ర సర్కార్ తీరు ఉన్నదని విమర్శించారు. తమను అవినీతి పరులుగా, దొంగలుగా చిత్రీకరించి ప్రజలకు తమను శత్రువులుగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ విజయారెడ్డి పాశవిక హత్యకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వీఆర్‌ఏల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు మాట్లాడుతూ విజయారెడ్డి సజీవదహనం తర్వాత రాష్ట్రంలో రెవెన్యూ సిబ్బంది ఉద్యోగాలకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొన్నదన్నారు. రైతులు కానివారు కూడా మా మీద దాడులు చేస్తున్నారు. మా ప్రాణాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి. భూ సంభందిత విధుల నుంచి మినహాయింపు ఇచ్చి,సాధారణ పరిపాలన శాఖగానే కొనసాగించాలి అని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్‌వోల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి. ఉపేందర్‌రావు మాట్లాడుతూ 70 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను మూడు నెలల్లో చేయాలని ఆదేశించిన ప్రభుత్వం అందుకు తగ్గట్టు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించక పోవడం వల్లనే భూరికార్డుల్లో తప్పులు దొర్లాయని తెలిపారు. భూరికార్డుల గందరగోళానికి ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్. రాములు, చావ రవి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యోగుల ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు. గత ముఖ్యమంత్రులు ఉద్యోగులు సమ్మె చేస్తే పిలిచి మాట్లాడి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునేవారనీ, కేసీఆర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ జేఏసీ నేతలు థామస్‌రెడ్డి, రాజిరెడ్డి మాట్లాడుతూ 60 ఏండ్ల సమైక్య పాలనలోనూ పడనన్ని కష్టాలు ఆరేండ్ల తెలంగాణ రాష్ట్రంలో పడుతున్నామని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఇతర ఉద్యోగ సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. తమ శాఖల డ్యూటీలు ఇతర శాఖల వారు చేయొద్దని కోరారు. ఈ రౌండ్ టేబుల్లో ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల జేఏసీ నేత మేడి రమేష్, జాక్టో నేత జి.సదానంద గౌడ్, ఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పోచయ్య, టీఎస్‌పీటీఏ ప్రధాన కార్యదర్శి చిన్న రాములు, టీజీసీటీఏ ప్రధాన కార్యదర్శి విజరు కుమార్, ఈ. రఘునందన్, టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.పర్వతరెడ్డి, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.