Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సర్కారు తొండాటకు దిగింది. హైకోర్టులో తప్పుడు వాదనల్ని వినిపిస్తున్నది. ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారం కోసం హైకోర్టు న్యాయమూర్తులు చేస్తున్న అన్ని సూచనలనూ ప్రభుత్వం తిరస్కరిస్తూనే ఉంది. ముగ్గురు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు డివిజన్ బెంచ్ చేసిన సూచనను కూడా తిరస్కరించింది. పైగా...సమ్మె చట్టవిరుద్ధమని ఆదేశాలివ్వాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్ధించింది. మధ్యవర్తిని నియమించే అవకాశం చట్టంలో లేదంటూ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. పారిశ్రామిక వివాదాల చట్టం సెక్షన్ 10ఏ ప్రకారం గుర్తింపు కార్మికసంఘం, యాజమాన్యం పరస్పరం అంగీకరిస్తే మధ్యవర్తిని నియమించవచ్చని సీఐటీయూ నేతలు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు హైకోర్టుకు తప్పుడు నివేదికలు ఇచ్చి, అక్షింతలు వేయించుకున్న ప్రభుత్వం...ఇప్పుడు తప్పుడు వాదనల్ని వినిపిస్తూ.. సమస్య పరిష్కారానికి ఒక్కమెట్టు కూడా దిగట్లేదు. పైపెచ్చు ప్రజోపయోగ సేవలన్నీ ఎస్మా చట్టం కిందకే వస్తాయనే ప్రమాదకరవాదనను ప్రభుత్వం వినిపిస్తున్నది. ఇది సమ్మె హక్కును హరించడమేనని కార్మికసంఘాల నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎటు తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎజెండా ప్రకారం ఆర్టీసీని నిర్వీర్యం చేయడం...తాను అనుకున్న ప్రయివేటీకరణను అమల్లోకి తేవడం అనే లక్ష్యాలే ఈ వాదనల వెనుక కనిపిస్తున్నాయి. ఈ చర్యల్ని అడ్డుకొనేందుకు ఆర్టీసీ కార్మికులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. సమ్మె 40వ రోజుకు చేరింది. ఆర్టీసీ చరిత్రలోనే ఇది సుదీర్ఘ సమ్మె. ఈ ఒత్తిడిలో ఇప్పటి వరకు 27 మంది కార్మికులు మరణించారు. తాజాగా మహబూబాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్ ఒకరు తన మరణానికి ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని పేర్కొంటూ మరణవాంగ్మూలం రాసి, ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద కార్మికుల ఆందోళనలు కొనసాగాయి. ఆర్టీసీ రూట్ల ప్రయివేటీకరణ కేసు విచారణ గురువారం కూడా కొనసాగనుంది. సమ్మె కేసు ఈనెల 18కి వాయిదా పడింది.
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారానికి హైకోర్టు డివిజన్ బెంచ్ సూచించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల ఉన్నతస్థాయి కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. కార్మికులు, యాజమాన్యం మధ్య వివాద పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీ వేయాలని పారిశ్రామిక వివాదాల చట్టం 1947లో లేదని, అందువల్ల ఈ కమిటీకి ప్రభుత్వం అంగీకరించడంలేదని అడ్వకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్‌కు బుధవారం నివేదించారు. ఈ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం దీనిపై లేబర్ కమిషనర్ నిర్ణయం తీసుకోవచ్చంటూ సమ్మెపై దాఖలైన వ్యాజ్యాల్లో కోర్టు విచారణ జరుపుతున్నందున ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనిపై చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి ఇచ్చిన అఫిడవిట్‌ను కోర్టు పరిశీలనకు అందజేశారు. సమ్మె విరమింపజేయాలని, ఆర్టీసీ రూట్ల ప్రయివేటీకరణ తగదని దాఖలైన కేసులపై బుధవారం డివిజన్ బెంచ్ విచారించింది. పిటిషనర్ల తరపు న్యాయవాదుల్లో ఒకరైన ఆర్.భాస్కర్‌ను వాదనలు కొనసాగించాలని కోర్టు సూచించింది. 'శివారావ్ శాంతారావ్ మరికొందరు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన కోర్టు దష్టికి తెచ్చారు. దీని ప్రకారం సమస్య పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీ వేసే అధికారాలు ఈ న్యాయస్థానానికి ఉంటాయన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఈరోజు ఒక ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని, సమ్మె వల్ల మరణించిన కార్మికుల సంఖ్య 20కి చేరిందని తెలిపారు. సమ్మెపై ముఖాముఖి చర్చలకు కమిటీ వేయాలని కోరారు. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని ఏజీ వాదిస్తూ ఎస్మా కింద చర్యలు తీసుకోవచ్చన్నారు. ఆర్టీసీని ఎస్మా కిందకు చేరుస్తూ ప్రభుత్వం ఏమైనా ఉత్తర్వులు జారీ చేసిందా అని బెంచ్ ప్రశ్నించింది. దీనిపై జీవో ఉందని ఏజీ సమాధానమిచ్చారు. ఆర్టీసీ సేవలు 'పబ్లిక్ యుటిలిటీ సర్వీసులు' కిందకు వస్తాయంటూ వాటిని ఉల్లంఘించిన వారిపై ఎస్మా కింద చర్చలు తీసుకోవచ్చన్నారు. కార్మిక సంఘాల తరపు సీనియర్ న్యాయవాది డి.ప్రకాష్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎస్మా కిందకు రాదనగా ఆ చట్టంలోని పలు సెక్షన్లను ఏజీ వివరించారు. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ కింద, ఆర్టీసీ యాక్టు 1950 కింద టీఎస్ ఆర్టీసీని ఏర్పాటు చేశామన్నారు. ఏపీ పునర్విభజన చట్టాన్ని పార్లమెంటు ఆమోదించినందుకు ఇదే సుప్రీం యాక్టు అవుతుందన్నారు. ఈ వాదనలను డివిజన్ బెంచ్ తొలుత తోసిపుచ్చింది. ఆర్టీసీకి ప్రత్యేక చట్టం ఉంది.. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఏపీఎస్‌ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 33శాతం వాటా ఉందని, టీఎస్ ఆర్టీసీని కేంద్రం గుర్తించడంలేదని గతంలో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ చెప్పారంది. ఆర్టీసీని విభజించాలంటే ఆర్టీసీ చట్టంలోని సెక్షన్ 47(ఎ) కింద కేంద్రం నుంచి అనుమతి పొందాలని తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టాన్ని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయని, ఈ చట్టం ప్రకారమే ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థలను రెండు రాష్ట్రాల మధ్య విభజన చేయవచ్చని ఏజీ పునరుద్ఘాటించారు. సాంకేతికంగా వేరుపడనప్పటికీ చట్ట ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య బస్సుల పంపకం జరిగిందంటూ టీఎస్‌ఆర్టీసి ఏర్పాటుకు కేంద్రం అనుమతి అవసరం లేదన్నారు. ఏజీ వాదనలతో డివిజన్ బెంచ్ తన అభిప్రాయాన్ని మార్చుకుంది. ఆర్టీసీ తరపున అదనపు ఏజీ జె.రామచంద్రరావు వాదిస్తూ 1994లో సిండికేట్ బ్యాంక్ వర్సెస్ అదర్స్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట వ్యతిరేకమా కాదా అని తేల్చే అధికారం లేదని, అది తేల్చాల్సింది కార్మిక న్యాయస్థానమేనని అన్నారు. ఈ సమస్యను కార్మిక న్యాయస్థానానికి పంపితే నిర్ణీత కాలంలో సమస్యకు పరిష్కారం చూపగలదా అని ఏజీని బెంచ్ ప్రశ్నించింది. ఇది ముఖ్యమైన సమస్య అయినందున ఆ కోర్టు ఎక్కువ సమయం తీసుకోదన్నారు. దీనిపై వివరణ తీసుకుని తర్వాతి విచారణకు చెప్పాలని అదనపు ఏజీకి సూచించింది. ఈలోగా కోర్టు సమయం ముగియడంతో వీటిపై విచారణను బెంచ్ గురువారానికి వాయిదా వేసింది. అయితే తన సోదరుని కుమార్తె వివాహం ఉన్నందున గురువాంనాటి విచారణకు తాను హాజరు కాలేనని, విచారణను ఈనెల 18కి వాయిదా వేయాలని కార్మిక సంఘాల తరపు న్యాయవాది ప్రకాష్‌రెడ్డి కోరగా అందుకు డివిజన్ బెంచ్ అంగీకరించింది. ఆర్టీసీ రూట్ల ప్రయివేటీకరణ వ్యాజ్యాలపై గురువారం విచారణ చేపట్టనుంది.
సీఎంతో ఏజీ బేటి
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ బుధవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో బేటి అయ్యారు. ఈసందర్భంగా హైకోర్టులో చోటుచేసుకున్న పరిణామాలను వివరించారు. ఆర్టీసీ ప్రయివేటు పర్మిట్లపై గురువారం విచారణ జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం తరపున వినిపించే వాదనలపై ఇరువురూ చర్చించారు.