Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరాచకాలకు అడ్డుకట్ట వేయండి...
- ప్రియాంకారెడ్డి హత్యోదంతంపై సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు
- లైంగికదాడిని ఖండిస్తూ మానవహారం
- పౌర సమాజం స్పందించిన తీరు హర్షణీయం : తమ్మినేని
- ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రియాంకారెడ్డిపై జరిగిన అఘాయిత్యం.. ఆ తర్వాత ఆమెను హతమార్చిన తీరును సీపీఐ (ఎం) తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ఘటనలు పౌర సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు వ్యాఖ్యానించారు. మహిళలపై దారుణాలు జరిగినప్పుడు దోషులను కఠినంగా శిక్షించటం లేదనీ, అందుకునుగుణంగా ప్రభుత్వాలు చూపాల్సినంత చొరవ చూపటం లేదని ఆయన విమర్శించారు. వీటిని నిరోధించటానికి వీలుగా తక్షణం మహిళా సంఘాలతో చర్చించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయటం ద్వారా ప్రియాంకారెడ్డి కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరారు. ఈ ఘటనను నిరసిస్తూ సీపీఐ (ఎం) ఆధ్వర్యాన ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద పెద్ద ఎత్తున మానవహారం చేపట్టారు. రాఘవులుతోపాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య, డిజి నర్సింహారావు, టి.జ్యోతి, ఐద్వా సీనియర్ నేత హైమావతి, రాష్ట్ర అధ్యక్షులు ఆశాలత, సీపీఐ (ఎం) సిటీ సెంట్రల్ కార్యదర్శి ఎమ్.శ్రీనివాస్‌రెడ్డి, వివిధ ప్రజా సంఘాల నాయకులు, జిల్లాల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాఘవులు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణలో మహిళలు, బాలికలు, యువతులు భయంతో బతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయోననే ఆందోళనలో వారున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి ముఖ్యమంత్రి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. తమ్మినేని మాట్లాడుతూ... అక్కడ కేంద్రంలోనూ, ఇక్కడ రాష్ట్రంలోనూ ఉన్న పాలక పార్టీల భావజాలం కూడా మహిళలను కించపరిచే విధంగా ఉందన్నారు. అమ్మాయిలు, యువతులు వేసుకునే దుస్తుల కారణంగానే వారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయంటూ అధికార పార్టీలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడటాన్ని బట్టి వారికి మహిళలపై ఎలాంటి గౌరవం ఉందనే విషయం తేటతెల్లమవుతున్నదని విమర్శించారు. ఇలాంటి భావజాలం కారణంగానే ఈ ఘోరాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇదే సమయంలో ప్రియాంకారెడ్డిపై జరిగిన అమానవీయ దాడిని ఖండిస్తూ, నిరసిస్తూ పౌర సమాజం స్పందించిన తీరు నిజంగా హర్షణీయమని అన్నారు.
ఈ రకమైన చైతన్యాన్ని మున్ముందు కూడా ప్రదర్శించాలని కోరారు. హైమావతి మాట్లాడుతూ... మహిళలకు సంబంధించిన అంశాలపై వినతిపత్రాన్ని స్వీకరిం చేందుకు కూడా ఇష్టపడని ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో మనం జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రక్షణకు హెల్ప్‌లైన్లను, యాప్‌లను అందుబాటులోకి ఉంచా మంటూ చెబుతున్న ప్రభుత్వాలు.. వాటికి సంబంధించిన హోర్డింగులు, వాల్ పోస్టర్లను ఎందుకు అందుబాటులోకి తేవటం లేదని ప్రశ్నించారు. ఎంతమంది మహిళలు అధునాతన సాంకేతిక పరి జ్ఞానాన్ని వాడగలరు? వారిలో ఎంతమందికి డయల్ 100 నెంబరు ఉందన్న సంగతి తెలు సని ప్రశ్నించారు. ఇప్పటికైనా వాటిపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని డిమాండ్ చేశారు.