Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ కార్మికుల నుంచి లేఖలు తీసుకుంటున్న ప్రభుత్వం
- సంతకం పెట్టని వారి జాబితా విడిగా ఇవ్వాలని మౌఖిక ఆదేశాలు..
- ప్రగతిభవన్ నుంచే లేఖల డ్రాఫ్టింగ్!
- చట్టాలను కాలరాయడమే : కార్మికసంఘాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వెల్ఫేర్ కౌన్సిళ్ల పేరుతో కార్మిక చట్టాలను కాలరాచే చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. రెండేండ్ల పాటు ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించేది లేదని తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్ దానికి అనుగుణంగా ఆర్టీసీ కార్మికులనే పావులుగా ఉపయోగించి, వారి వేలితో వారి కండ్లను పొడిచే చర్యకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచీ రెండేండ్లపాటు కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని లేబర్ కమిషనర్‌ను కోరుతూ కార్మికులతోనే లేఖలు ఇప్పిస్తున్నారు. ఆర్టీసీలోని 49వేల మంది కార్మికులు తప్పనిసరిగా ఈ లేఖలు ఇవ్వాల్సిం దేనంటూ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈమేరకు డిపో మేనేజర్లు విధులకు హాజరయ్యే కార్మికులతో అప్పటికే ప్రిపేర్ చేసిన లేఖలపై సంతకాలు పెట్టించుకుంటున్నారని కార్మికులు చెప్తున్నారు. ప్రగతిభవన్‌లో డ్రాఫ్టింగ్ చేసిన లేఖనే అన్ని డిపోలకూ ఫార్మాట్ రూపంలో పంపినట్టు సమాచారం.
పోరాటం చేస్తాం : వీఎస్‌రావు, ప్రధాన కార్యదర్శి టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్
రెండేండ్లు ఆర్టీసీలో ఎన్నికలు జరపొద్దంటూ ప్రభుత్వం డ్రాఫ్ట్ చేసిన లేఖల్ని డిపోలకు పంపడం దారుణం. వాటిపై కార్మికులతో బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారు. కాదన్న వారిపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారు. ఈ చర్యల్ని ఎస్‌డబ్ల్యుఎఫ్ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రభుత్వం కార్మిక చట్టాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నది. దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించం. తప్పకుండా ఈ చర్యల్ని నిరసిస్తూ పోరాటం చేస్తాం.
రాజకీయాల కోసమే..: కె రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి,టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్
అన్నదమ్ములుగా ఐక్యంగా ఉన్న ఆర్టీసీ కార్మికులను కౌన్సిళ్ల పేరుతో విడ గొట్టి, ప్రత్యక్ష రాజకీయాలు చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదే సందర్భంలో కౌన్సిళ్లు వద్దని కోరుతూ మేం కూడా కార్మికుల నుంచి సంతకాలు సేకరించి, లేబర్ కమిషనర్‌కు పంపుతాం.
ఐక్యత విచ్ఛిన్నం కోసమే: థామస్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, టీఎమ్‌యూ
ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఇతర శాఖలు, విభాగాలకు ఆదర్శంగా నిలుస్తుందనే భయంతో ప్రభుత్వం ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నది. ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేయడం కోసమే ఎన్నికల వాయిదా లేఖల డ్రామా ఆడుతున్నది. సమ్మెవల్లే ఆర్టీసీ కార్మికులకు ప్రగతిభవన్ ద్వారాలు తెరుచుకున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.
ఎన్నికలు నిర్వహించాలి: కె హన్మంతు, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్
ఆర్టీసీలో తక్షణం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు వద్దు అనే హక్కు ప్రభుత్వానికి లేదు. కార్మికులతో బలవంతంగా లేఖలు ఇప్పించినా, కార్మిక శాఖ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందనే భావిస్తున్నాం. సమ్మె డిమాండ్ల కేసు ఎలాగూ ట్రిబ్యునల్ వద్దే ఉంది. దానికీ, ఎన్నికలకు సంబంధం లేదు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఆర్టీసీ కార్మికులు ఐక్యంగానే ఉంటారు. ప్రభుత్వ బెదిరింపులకు జడిసేదిలేదు.
లేఖ పూర్తి సారాంశం..
''మేము.. డిపోలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నాము. ఇందుమూలముగా మీకు తెలియచేయునది ఏమనగా మేము మా సమస్యల సామరస్య పరిష్కారం కోసం వెల్ఫేర్ కౌన్సిల్‌ని ఏర్పాటు చేసుకుంటున్నాము. మేము కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్న వేల్ఫేర్ కౌన్సిల్స్ ద్వారా మా సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని మాకు నమ్మకం ఉంది. కనుక కార్మిక సంఘాల గుర్తింపు కోసం జరిగే ఎన్నికలు కనీసం రెండు సంవత్సరాలపాటు నిర్వహించవద్దని కోరుకుంటున్నాము''. ఈ లేఖ క్రింద ఉద్యోగి పేరు, స్టాఫ్ నెంబరు, హోదా, సంతకం కాలమ్స్ కూడా ఉన్నాయి. డిపోల్లో ఈ కాగితంపై కార్మికులు తమ వివరాలు నింపి సంతకం చేస్తే సరిపోతుంది. సంతకం చేయని కార్మికుల జాబితాను విడిగా ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు ఉన్నట్టు ఓ డిపో మేనేజర్ తెలిపారు. ఈ చర్యను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.