Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక సంఘాలతో కలిసి జనవరి 8న దేశవ్యాప్త సమ్మె :
ఏఐటీయూసీ కార్యదర్శి అమర్‌జిత్‌కౌర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కార్మికుల హక్కులను కేంద్రంలోని మోడీ సర్కార్ హరిస్తున్నదని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి అమర్‌జిత్‌కౌర్ విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జనవరి 8న దేశవ్యాప్తంగా అన్ని కార్మికసంఘాల ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరూ ఈ ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం యాజమాన్యాలకు, పెట్టుబడిదార్లకు మేలు చేసే విధానాలను అవలంబిస్తున్నదని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కోడ్‌లుగా విభజించి కార్మికులకు ద్రోహం చేసిందని విమర్శించారు. కేంద్రం చేసిన సవరణల వల్ల పనిగంటలు పెరగడం, ఉద్యోగ భద్రత తదితర అనేక హక్కులు కార్మికులు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు వల్ల దేశంలోని ఐదు కోట్లమంది నిరుద్యోగులు కాగా, జీఎస్‌టీ వల్ల దేశంలో (ఎంఎస్‌ఈ) రంగం దివాలా తీసిందన్నారు. మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న పెట్టుబడిదారి అనుకూల విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలంఅయిందని విమర్శించారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 8శాతంగా ఉన్న జీడీపీ నేడు జీరో శాతానికి పడిపోయిందని గుర్తు చేశారు. లాభాల బాటలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను కావాలని నష్టాల్లోకి నెట్టి తమకు అనుకూలంగా ఉన్న కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు చేసిన పోరాటాల వల్లనే తమ హక్కులను సాధించుకున్నారే తప్ప ఎవరి దయాదాక్షిణ్యాలతో రాలేదని అన్నారు. ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు నరసింహన్, రాష్ట్ర అధ్యక్షులు బాలరాజ్, ప్రధాన కార్యదర్శి బిఎస్.బోస్, నాయకులు కరుణకుమారి, చంద్రయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.