Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి 2 నుంచి కోల్‌కతాలో నిర్మాణ మహాసభ : నారాయణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో జరగనున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా సహా కార్యవర్గ సభ్యులు హాజరవుతారని చెప్పారు. ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో కలకత్తాలో సీపీఐ నిర్మాణ మహాసభ జరుగుతుందన్నారు. ఆ మహాసభలో ప్రవేశపెట్టే నివేదికపై జాతీయ సమావేశాల్లో ప్రధానంగా చర్చిస్తామని వివరించారు. పార్టీ బలోపేతం, నిర్మాణపరంగా పటిష్టం చేయడంపై దృష్టి సారిస్తామని చెప్పారు. మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాలు, చత్తీస్‌ఘడ్‌లో జరిగే ఎన్నికలపై చర్చ ఉంటుందన్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభం ఉందని చెప్పారు. జీడీపీ 4.6 శాతానికి పడిపోయిందని వివరించారు. దిగుమతులు పెరిగాయని, ఎగుమతులు తగ్గాయని చెప్పారు. ఉత్పత్తి తగ్గిందనడానికి ఇది నిదర్శనమని అన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందన్నారు. అయినా బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు రాయితీలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. విదేశీ పెట్టుబడిని ఆహ్వానిస్తున్నదని చెప్పారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను అమ్మేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తున్నదని అన్నారు. 2008లో అమెరికాలో వచ్చినట్టుగానే భారత్‌లో ఆర్థిక సంక్షోభం వచ్చే ప్రమాదముందన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు వచ్చేనెల 8న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేస్తున్నాయని వివరించారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అయోధ్య కేసు, ఇతర అంశాలను ముందుకు తెస్తున్నదని చెప్పారు.