Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌లో కిలో ఉల్లి ధర రూ.180
- బెంగళూరులో కిలో రూ.200
- ఉత్పత్తి అంచనా..ధరల అదుపు ప్రభుత్వాల వైఫల్యం
- ఎందుకీ దుస్థితి..?
సగటు భారతీయ కుటుంబాలు తమ వంటకాల్లో తప్పనిసరిగా వినియోగించే వస్తువు ఉల్లిగడ్డలు. ఏ కూరలోనైనా ఉల్లిగడ్డ ఉండాల్సిందే. వంటకంలో వేయడానికి ఉల్లిగడ్డను పాయలుగా కోసేటపుడు కంట నీరు రావడం ఎవరికైనా సహజంగా ఎదురయ్యే అనుభవం. ఇప్పుడు ఉల్లిని కొనేటపుడే కంటనీరు తెప్పిస్తున్నది.మార్కెట్‌కు వెళ్లి ఉల్లి ధర అడిగితే కంటనీరు రావడం ఖాయం అన్న దుస్థితి. ఇది ఏదో ఒక రాష్ట్రానికే పరిమితం కాలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఆదివారం దేశంలోని పలు నగరాల్లో ఉల్లి ధర కిలో రూ.200 పలికింది. కొన్ని నగరాల్లో రూ.160కి పైనే చేరింది. ఇది వినియోగదారుల మంత్రిత్వశాఖ అధికారికంగా చెప్పిన లెక్క...
హైదరాబాద్ : ఆదివారం హైదరాబాద్ లోని రైతు బజారుల్లో కిలో ఉల్లి ధర రూ.160 నుంచి రూ.170 వరకు పలికింది. కాస్త నాణ్యమైన ఉల్లి కిలో రూ.180 చొప్పున అమ్ముతున్నారు. ఇది రైతు బజారుల్లో పరిస్థితి. మారుమూల దుకాణాల్లో ఈ ధర రూ.180 నుంచి రూ.200 వరకూ ఉంటోంది. ఇది మన తెలంగాణకే పరిమితం కాలేదు. బెంగళూరుసహా పలు నగరాల్లో కిలో ధర రూ.200కు చేరింది. ఉల్లి దిగుబడుల్ని అంచనా వేయడంలో, ధరల్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయన్నది పరిస్థితుల్ని మదింపు చేస్తే అర్థమవుతోంది.
ఈ ఏడాది వర్షాలు కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దాంతో, ఉల్లి విత్తడం ఆలస్యమైంది. ఇది మొదటి కారణం. వర్షాలు రావడం ఆలస్యమైనా ఎడతెరిపి లేకుండా కురిశాయి. పలు చోట్ల వరదలొచ్చాయి. దాంతో, వేసిన ఉల్లి చాలా చోట్ల మొలకెత్తకుండానే కుళ్లిపోయింది. దాంతో, ఉల్లిని మరోసారి విత్తాల్సి వచ్చింది. ఇది రెండో కారణం. ఈ రెండు కారణాల వల్ల ఖరీఫ్‌లో ఉల్లి పంట చేతికి రావడం ఆలస్యమైంది. సాధారణంగా ప్రతి ఏటా అక్టోబర్‌లో చేతికి రావాల్సిన పంట ఆలస్యమైంది. అంతేగాక అనావృష్టి, అతివృష్టి వల్ల పంట దిగుబడి తగ్గనున్నది. ఈ ఖరీఫ్‌లో అంచనాకన్నా 26శాతం దిగుబడి తగ్గనున్నట్టు వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తెలిపారు.
ఉల్లి ధరలు రోజురోజుకూ పెరుగుతూ పోవడం దేశ ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. పంట దిగుబడులపై సరైన అంచనా వేయలేకపోయిన కేంద్రం ఉల్లి ఎగుమతులకు అడ్డుకట్ట వేయడంలో ఆలస్యం చేసింది. సెప్టెంబర్ చివరి వారంలో నిషేధంపై నిర్ణయం తీసుకున్నది. అప్పటికే రూ.3000 కోట్లకుపైగా విలువైన ఉల్లి విదేశాలకు తరలిపోయింది. గతేడాది నవంబర్ 15న దేశంలో ఉల్లి సగటు ధర కిలో రూ.22.84పైసలు కాగా, ఈ ఏడాది అదే రోజున రూ.60.38పైసలు.
దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం కావడంతో కంటి తుడుపు చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. ప్రభుత్వ వాణిజ్య సంస్థ ఎంఎంటీసీ ద్వారా లక్షా 20వేల టన్నుల ఉల్లిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నట్టు తెలిపింది. ఇప్పటికే 17090 టన్నుల(6090 టన్నులు ఈజిప్టు నుంచి, 11000 టన్నులు టర్కీ నుంచి) ఉల్లి దిగుమతికి ఒప్పందం కుదిరినట్టు తెలిపింది. మరో 4000 టన్నులు టర్కీ నుంచి దిగుమతికి ఆర్డర్ పెట్టినట్టు తెలిపింది. అయితే, ఈ దిగుమతులన్నీ రావడానికి సమయం పడుతుంది. 2020 జనవరి 20 వరకల్లా దిగుమతులు దేశానికి చేరుకుంటాయని వినియోగదారులశాఖ సహాయమంత్రి రావూసాహెబ్ దన్వే రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. అయితే, ఆ దిగుమతులు రిటైల్ మార్కెట్‌కు చేరడానికి మరికొంత సమయం పడుతుంది. ఈలోగా ఉల్లి ధరల్ని అరికట్టడమెలా..? ప్రభుత్వం దగ్గర ఉన్న బఫర్ స్టాక్ ఎంత..? దేశీయంగా మన రైతులు పండించే ఉల్లి మార్కెట్‌కు దశలవారీగా వచ్చేది ఎంత..? అనేవాటిపై స్పష్టత ఉంటేనే రానున్న కాలంలో ఉల్లి ధరలు ఏవిధంగా ఉంటాయన్నది అంచనా వేయగలం. ఈ మధ్యలో రైతులను,వినియోగదారులనూ దళారులు దండిగా దోచేస్తున్నారు.
ఏడాదికి దేశ ప్రజలు వినియోగించే ఉల్లి దాదాపు కోటీ 50 లక్షల టన్నులు. ఈ ఖరీఫ్‌లో దేశీయ ఉత్పత్తి అంచనా 52 లక్షల టన్నులు. సకాలంలో మోడీ సర్కా ర్ స్పందించకపోవటం వల్లే ఉల్లి కన్నీరు పెట్టిస్తున్నది. మహిళాలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.