Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్ ధర రూ.30 లక్షల నుంచి రూ. కోటి ప్రభుత్వం చెల్లిస్తున్నది
- రూ.8 లక్షల నుంచి 12 లక్షలే
- వన్‌టైంసెటిల్‌మెంట్ పేరుతో నామ మాత్ర పరిహారం
- లావోని పట్టాలకు సగం భూములకే పరిహారం
- ఆందోళనలో ముచ్చర్ల ఫార్మా భూనిర్వాసితులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'మీకుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తది... మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది...అని ఒకవైపు నచ్చ చెబుతూనే.... మీరివ్వకుంటే నిబంధనల ప్రకారం తీసేసుకుంటాము.. ఇచ్చిన పరిహారం తీసుకుని సంతకం పెట్టండి అంటూ...' బెదిరిస్తూ ముచ్చర్ల ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తున్నది. ఈ ప్రాజెక్టు కోసం 2015 నుంచి రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఇప్పటివరకు దాదాపు ఐదు వేల ఎకరాల భూమిని వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో నామ మాత్రపు ధర చెల్లించి తెలంగాణ సర్కార్ సేకరించింది. ఈ మండలంలో మరో ఐదు వేల ఎకరాలను సేకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. యాచారం మండలంలో మార్కెట్ ధర రూ.30లక్షల నుంచి కోటి రూపాయలు పలుకుతుంటే ప్రభుత్వం మాత్రం లావోని పట్టాదారులకు రూ.8లక్షలు, పట్టాదారులకు రూ.12.5లక్షలు చెల్లిస్తూ భూములను లాక్కుంటున్నదని రైతులు ఆరోపిస్తున్నారు. ముచ్చర్ల ఫార్మాసిటీ కోసం భూసేకరణ పూర్తయితే కనుమరుగవుతాయని చెబుతున్న మేడిపల్లి, నానక్‌నగర్, తాడిపత్రి గ్రామ ప్రజలు ప్రభుత్వ తీరుతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్ నగర శివార్లను ఆనుకుని రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దుల్లో కడ్తాల్, యాచారం, కందుకూర్ మండలాల్లో ఫార్మాసిటీని రాష్ట్ర ప్రభుత్వం 2014లో చేపట్టింది. ఇందు కోసం నిర్దేశించిన 19,333 ఎకరాలకుగాను ఐదేండ్ల కాలంలో 8,400 ఎకరాలను తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐఐసీ) సేకరించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాడిపత్రిలలో ఐదువేల ఎకరాలు, కందుకూరు మండలంలోని ముచ్చర్ల, ఊట్లపల్లి తదితర గ్రామాల్లో 3వేల ఎకరాల భూమిని వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో 2018 జూన్ వరకు సేకరించారు. మిగిలిన 10 వేల ఎకరాలకు గాను ఆరు వేల ఎకరాలను యాచారం మండలం నుంచి, నాలుగు వేల ఎకరాలను కందుకూర్ మండలం నుంచి సేకరించాలని భావించినప్పటికీ రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. మార్కెట్ ధర చెల్లిస్తేనే భూములిస్తామంటూ కొంతమంది రైతులు చెబుతుండగా, ఫార్మాసిటీ వస్తే కాలుష్యంతో ఈ ప్రాంతం శ్మశానంగా మారుతుందనీ, తాము ఎట్టి పరిస్థితుల్లోనూ భూములివ్వబోమనీ మరి కొంత మంది తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారం తమకు ఆమోదయోగ్యం కాదని రైతులు చెబుతున్నారు. వన్‌టైం సెటిల్‌మెంట్ ప్రకారం నోటిఫై చేసిన భూముల పరిహారాన్ని గతంలోనే తిరస్కరించిన వారి ఇండ్ల చుట్టు అధికారులు చక్కర్లు కొడుతున్నారు. ఇంతకంటే ఎక్కువ పరిహారం సాధ్యం కాదనీ, 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వ ధరల ప్రకారం చెల్లిస్తే తక్కువ వస్తుందని భయపెడుతున్నారని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. లావోని పట్టారైతులకు ఉన్న భూమిని సైతం నోటిఫై చేయడం లేదని ఆరోపిస్తున్నారు. నాలుగెకరాలున్న రైతుకు సంబంధించి ఎకరం నుంచి రెండెకరాల వరకే నోటిఫై చేస్తుండటంతో కొంతమంది రైతులు పరిహారాన్ని తీసుకోగా మరికొంత మంది పరిహారాన్ని తిరస్కరించారు. పార్మాసిటీకి కోసం నిర్దేశించిన మొత్తం భూమిని వెంటనే సేకరించాలని మంత్రి కేటీఆర్ తాజాగా అధికారులకు సూచించారు. దీంతో గతంలో ప్రారంభించిన భూసేకరణ ప్రక్రియను అధికారులు తిరిగి మొదలు పెట్టారు. దాంతో యాచారం మండలంలో భూములు కోల్పోనున్న రైతుల్లో ఆందోళన మొదలైంది.
నిబంధనల ప్రకారమే సేకరిస్తున్నాం:
అమరేందర్, ఆర్డీవో, ఇబ్రహీంపట్నం
ముచ్చర్ల ఫార్మా కోసం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే భూములను సేకరిస్తున్నాం. బెదిరించి సేకరిన్నామనే ఆరోపణలు సరికాదు. యాచారం మండలంలో 2013కు ముందు స్థిరీకరించిన.భూముల ధరల ప్రకారం రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు మాత్రమే ఉన్నది. ప్రభుత్వం మాత్రం లావణి పట్టాలకు రూ. 7.5 లక్షలు, పట్టా భూములకు రూ.12.5 లక్షలు చెల్లిస్తున్నది. మార్కెట్ రేట్ ప్రకారం ధరలు చెల్లించడం సాధ్యం కాదు. ఎవరైనా భూములు ఇవ్వకుంటే వారికి చెల్లించాల్సిన నష్ట పరిహారాన్ని కోర్టులో జమ చేసి చట్ట ప్రకారమే సేకరిస్తాం. ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదు.
పరిహారం పెంపు కోసం తమ్మినేని పాదయాత్ర
ముచ్చర్ల ఫార్మాసిటీ వల్ల నష్ట పోనున్న రైతులకు పరిహారం పెంచాలని 2016లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో ముచ్చర్ల నుంచి హైదరాబాద్‌కు, ముచ్చర్ల నుంచి యాచారం మండలం మేడిపల్లికి రెండు సార్లు పాదయాత్ర నిర్వహించారు. రైతులనుంచి బలవంతంగా భూసేకరణ చేయద్దనీ, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారాన్ని పెంచాలనీ, పునరావాసం, ఉపాధి కల్పించాలనే పలు డిమాండ్లతో ఈ పాదయాత్రను నిర్వహించారు.
అందరిస్తున్నారని తీసుకున్నరు:
గడ్డం యాదమ్మ, మేడిపల్లి, యాచారం మండలం
మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూములు అందరిస్తున్నారని చెప్పి తీసుకున్నారు. మొదట్లో నేనివ్వనంటే మీ భూమి మధ్యలో ఉంది అందరు అమ్ముకుంటే మీరెలా వ్యవసాయం చేస్తారని అనడంతో భయంతో ఇచ్చాం. మాకు 2.5 ఎకరాల భూమి ఉంది. అయితే పరిహారం మాత్రం ఎకరం భూమికి మాత్రమే చెల్లించారు.
మొత్తం భూమిని పరిహారం ఇవ్వలేదు:
మంద జంగయ్య, నానక్‌నగర్, యాచారం మండలం
యాచారం మండలం నానక్‌నగర్‌లో నాకు రెండున్నర ఎకరాల లావోని పట్టా భూమి ఉంది. మొత్తం భూమిని తీసుకున్న అధికారులు కేవలం ఎకరన్నరా మాత్రమే నోటిఫై చేసి రూ. 8లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. మిగతా భూమి పరిహారం గురించి అడిగితే అధికారులు ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. 70 ఏండ్లుగా అనుభవదారుగా, లావణి పట్టాదారుగా కొనసాగుతున్నాను. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి.
భూమికి తగిన భూమి ఇవ్వాలి: ఉడుత మల్లయ్య, మేడిపల్లి, యాచారం మండలం
ఫార్మాసిటీ కోసం భూమి ఇవ్వాలని ప్రభుత్వం నాలుగేండ్ల నుంచి మమ్ముల్ని వేధిస్తూనే ఉంది. ఐతే సర్కార్ ఇచ్చే పరిహారం మాకు ఆమోదయోగ్యంగా లేదు. మార్కెట్ రేటు ప్రకారం మాభూమికి రూ.40 లక్షల నుంచి రూ.50లక్షలు పలుకుతుంటే కేవలం రూ.12.5 లక్షలు మాత్రమే ఇస్తామని అంటున్నారు. మాకు పరిహారం అక్కర్లేదు, ప్రభుత్వం ఎంత తీసుకుంటుంతో అంతే భూమిని ఈ మండలంలో ఇస్తేనే ఇవ్వడానికి సిద్దం. ఈ గ్రామాన్ని పూర్తిగా తరలిస్తారంటున్నారు. ఇప్పుడున్న దానికంటే మెరుగైన పునరావాసం, ఉపాధి కల్పించాలి.