Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపటి క్యాబినెట్‌లో చర్చించే అవకాశం
- అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలపైనా నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా పేర్కొంటున్న రైతుబంధు పథకంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నారా? అంటే అవుననే అంటున్నాయి సీఎంవో వర్గాలు. బుధవారం నిర్వహించబోయే రాష్ట్ర క్యాబినెట్‌లో ఈ మేరకు తీర్మానించే అవకాశముందని తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం... రాష్ట్ర ఖజానా గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి విదితమే. కేంద్ర నిర్ణయాల వల్ల తెలంగాణ పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని ఆయన ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆర్థిక నియంత్రణ పాటించాలి, అన్ని శాఖలూ విధిగా ఖర్చుల్లో కోతలు విధించుకోవాలి, కఠిన నిర్ణయాలకు సిద్ధంగా ఉండాలంటూ.. సీఎం ఉన్నతాధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో మొదటి నిర్ణయం రైతుబంధుపైన్నే వెలువడే అవకాశముంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఈ పథకానికి 'పదెకరాల' నిబంధన విధించనున్నారు. ఇప్పటిదాకా ఎకరం ఉన్న రైతు నుంచి వందల ఎకరాలున్న వారి వరకూ దీన్ని వర్తింపజేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ వెసులుబాటును తీసేస్తూ పదెకరాల భూమి వరకే రైతుబంధును వర్తింపజేయనున్నారు. అంతకు మించి భూమి ఉంటే.. సదరు భూమికి (పదెకరాలకు మించి ఉన్న భూమికి) ఈ పథకాన్ని వర్తింపజేయకూడదనే నిబంధనను విధించనున్నట్టు తెలిసింది. ఈ అంశంపై క్యాబినెట్‌లో చర్చించి.. ఓ కీలక నిర్ణయాన్ని వెలువరించనున్నారని సమాచారం.
దీంతోపాటు ఆర్టీసీ సమ్మె సందర్భంగా మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలిచ్చే అంశం కూడా క్యాబినెట్ ముందుకు రానుంది. అదే విధంగా ఆ సంస్థలోని కార్మికులకు ముఖ్యమంత్రి ఇటీవల ఇచ్చిన హామీలపైనా సుదీర్ఘంగా చర్చించే అవకాశముంది. ఖజానాపై ఆర్థికభారం మోపే అంశాల జోలికెళ్లకుండా మిగతా వాటి గురించి చర్చించి ఆమోదముద్ర వేయాలని సీఎం భావిస్తున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలను కూడా క్యాబినెట్‌లో ఖరారు చేయనున్నారని ఓ అధికారి తెలిపారు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పన, వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు, ప్రాధాన్యతలు తదితరాంశాలపై కూడా క్యాబినెట్‌లో చర్చించనున్నారని తెలిసింది. మరోవైపు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మంత్రివర్గ సహచరులకు సీఎం కేసీఆర్ ఆ అంశంపై వివరణిచ్చే అవకాశాల్లేకపోలేదని సమాచారం.