Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు రుణ విమోచన కమిషన్‌కు రైతు సంఘం వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల నివారణ కోసం సమర్ధవంతమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. రైతులను రుణ విముక్తులను చేసి ఆత్మహత్యలు ఆపేందుకు కృషి చేయాలని కోరింది. ఈమేరకు మంగళవారం రైతు రుణ విమోచన కమిషన్ చైర్మెన్ నాగేళ్ల వెంకటేశ్వర్లుకు ఏఐకెేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు పి జంగారెడ్డి, టి సాగర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదినేని లక్ష్మి, మూడ్ శోభన్‌ల బందం వినతిపత్రం సమర్పించింది. రైతు రుణ విమోచన కమిషన్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తు న్నట్టు పేర్కొన్నారు. కేరళ రాష్ట్రంలో ఈ రకమైన కమిషన్ వేసి చిత్తశుద్ధితో పని చేయడం ద్వారా రైతులను రుణ విముక్తులను చేసి, ఆత్మహత్యలను ఆపగలిగారని గుర్తు చేశారు. ఎప్పటికప్పుడు మేధావులు, రైతు సంఘాల ప్రతినిధుల సూచనలు, సలహాలు తీసుకొని రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతు సంఘం చేసిన సూచనలు
- ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించకున్నా రుణమాఫీ చేయాలి.
- చీడపీడల తాకిడికి దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం చెల్లించాలి.
- విత్తన వైఫల్యంతో రైతు నష్టపోతే ఆయా కంపెనీలు పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి.
- వడ్డీ అసలుకు సమానంగా చెల్లించినప్పుడు రుణాన్ని పూర్తిగా రద్దు చేయాలి.
- ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు అమలు కానప్పుడు ధరల వ్యత్యాసాన్ని చెల్లించాలి
- క్రిమి సంహారక మందుల వల్ల పంట నష్టం జరిగినప్పుడు నష్ట పరిహారం చెల్లించాలి.
- వడ్డీ వ్యాపారులు లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినప్పుడు వారు ఇచ్చిన అప్పులను రద్దు చేయాలి
- కౌలుదారు హక్కులను లైసెన్స్ సాగుదారుల చట్టం-2011 ప్రకారం అమలు జరపాలి.
- కల్తీవిత్తనాలు, నాణ్యతలేని విత్తనాలు, వ్యాపారులు అమ్మినప్పుడు కఠిన చర్యలు తీసుకొని రైతులకు పరిహారం ఇప్పించాలి.
- స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకులు మొత్తం రైతులకు రుణాలు ఇవ్వాలి. అప్పుడు ప్రయివేటు అప్పుల జోలికి వెళ్ళకుండా ఉంటారు
- వాస్తవ సాగుదారులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు (పంటలబీమా,ప్రభుత్వ రాయితీలు ప్రకృతి వైఫరీత్యాల పరిహారం ప్రభుత్వ పథకాలు) అమలు జరపాలి.
కమిషన్ గమనించాల్సిన అంశాలు
- రెవెన్యూ చట్టాల అమలుకు కమిషన్ చొరవ తీసుకొని సూచనలు చేయాలి. వాస్తవ సాగుదారు పేర్లను నమోదు చేయాలి.
- ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వాస్తవ సాగుదారులకు అందించాలి.
- ప్రస్తుత మార్కెట్ నిబంధనల్లో మార్పు తేవాలి. మార్కెట్‌లోకి వచ్చిన సరుకు రక్షణ బాధ్యతను మార్కెట్ కమిటీలు తీసుకోవాలి. శాస్త్రీయంగా నాణ్యతా ప్రమాణాలను అవసరమైనప్పుడు సడలించి రైతుల ఉత్పత్తులను కొనిపించాలి. తూకాలలో మోసం లేకుండా చూడాలి. మార్కెట్ నుంచి రవాణా ఏర్పాట్లు కొనుగోలు దారులే చేసుకోవాలి.
రైతుకు భరోసా కల్పిస్తాం: రైతు రుణ విముక్తి కమిషన్ వెల్లడి
రైతులను రుణ విముక్తులు చేయడంలో వారికి పూర్తి భరోసా కల్పిస్తామని రైతు రుణ విముక్తి కమిషన్ చైర్మెన్ నాగేళ్ల వెంకటేశ్వర్లు తెలిపారు. రైతు ఆత్మహత్యల నివారణ, కౌలు రైతు సమస్యలు, మద్దతు ధర, మార్కెట్‌లో దళారీ వ్యవస్థ నియంత్రణ, రుణమాఫీ, బ్యాంకు రుణాల మంజూరు, బీమా వంటి సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు. మంగళవారం మాసబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర కార్యాలయంలో రైతు, రైతు కూలీ, చేతివృత్తిదారుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కవ్వా లక్ష్మారెడ్డి, కార్యదర్శి శారదాదేవి తదితరులు ఉన్నారు.