Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: జాయింట్ లేబర్ కమిషనర్‌కు కార్మిక సంఘాల వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్టీసీ సంస్థలో రెండేండ్ల పాటు కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలను నిర్వహించకూడదనీ, వర్కర్స్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏర్పాటుకు సంసిద్ధంగా ఉన్నామని కార్మికులతో యాజమాన్యం బలవంతంగా సంతకాలు పెట్టించుకోవడాన్ని అడ్డుకోవాలని కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లో కార్మిక శాఖ కార్యాలయంలో జాయింట్ లేబర్ కమిషనర్ శ్రీనివాస్‌కు కార్మిక సంఘాల ప్రతినిధుల బృందం మంగళవారం వినతిపత్రాన్ని అందజేసింది. యాజమాన్యం సంతకాలు పెట్టించుకోవడం కార్మిక వ్యతిరేక చర్య అనీ, ఏ సంస్థలోనైనా ఎన్నిక ఉండాలా? వద్దా? అనేది కార్మికులు తీసుకోవాల్సిన నిర్ణయమని జాయింట్ లేబర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ఆర్టీసీ యాజమాన్యానికి వెంటనే నోటీసులు జారీ చేయాలని కోరారు. సంతకాలు తీసుకోవడాన్ని వెంటనే ఆపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన బృందంలో బోస్(ఏఐటీయూసీ), జె.వెంకటేశ్(సీఐటీయూ), విజయ్ కుమార్ యాదవ్(ఐఎన్‌టీయూసీ), శ్రీనివాస్(ఐఎఫ్ టీయూ), ఎమ్‌కే బోస్(టీఎన్‌టీయూసీ), తదితరులు పాల్గొన్నారు.