Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిహారం చెల్లించలేదని ఆర్డీవో కార్యాలయం సీజ్
- కూల్చిన ఆస్పత్రి భవనం కోసం పోరాడిన వైద్యుడు
నవతెలంగాణ-జగిత్యాల టౌన్
ఓ వైద్యుడికి చెందిన ఆస్పత్రి భవనాన్ని కూల్చిన కేసులో 22 ఏండ్లకు న్యాయం జరిగింది. ఆ వైద్యుడికి నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. రెవెన్యూ అధి కారులు నామమాత్రపు డిపాజిట్‌తో కాలం గడపటం తో జగిత్యాల రెండో ఆదనపు న్యాయమూర్తి ఆదేశాలతో మంగళవారం ఆర్డీవో కార్యాలయ సామగ్రిని జప్తు చేశారు. జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ సుధాకర్‌రెడ్డి 1997లో అశోక్‌నగర్‌లో స్థలం కొని ఆస్పత్రి నిర్మాణాన్ని చేపట్టాడు. అది ప్రభుత్వ స్థలమని రెవెన్యూ అధికారులు ఆ ఆస్పత్రి నిర్మాణాన్ని కూల్చి వేశారు. దీనిపై ఆ వైద్యుడు 2007, ఏప్రిల్ 4న నష్టపరిహారాన్ని కోరుతూ జగిత్యాల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాదోపవాదాలు జరిగి పూర్తిస్థాయి ధృవీకరణ పత్రాలను పరిశీలించిన న్యాయస్థానం వాస్తవానికి ఆ స్థలం వైద్యుడిదేనని ధృవీకరించింది. నష్టపరిహారంగా రూ.16 లక్షలా 82 వేలా 125 చెల్లించాలనీ, బాధితుడు కోర్టును ఆశ్రయించిన తేదీ నుంచి తీర్పు వెలువడిన తేదీ వరకు ఆరుశాతం వడ్డీని కలిపి ఇవ్వాలని తీర్పునిచ్చింది. అయినా రెవెన్యూ అధికారుల్లో స్పందన రాలేదు. తిరిగి 2008లో నష్టపరిహారం ఇప్పించాలంటూ కోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయస్థానం ఆనాటి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరీతోపాటు అప్పటి కలెక్టర్, జగిత్యాల ఆర్డీవో, తహశీల్దార్లకు నోటీసులు జారీ చేసింది. ఆ సమయంలో రూ.5లక్షలు కోర్టులో డిపాజిట్ చేసిన రెవెన్యూ అధికారులు తిరిగి ఎలాంటి చెల్లింపులూ చేయలేదు. ఆనాటి నుంచి కోర్టునే నమ్ముకొన్న వైద్యుడు సుధాకర్‌రెడ్డికి అనుకూలంగా 22 ఏండ్ల తరువాత గత నెల 28న ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తునకు జగిత్యాల రెండో ఆదనపు న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆ ప్రకారంగా నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం మంగళవారం కోర్టు సిబ్బంది, ఆ వైద్యుడి న్యాయవాది పవన్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయంలోని కంప్యూటర్లు, బీరువాలు, టేబుల్లతో పాటు ఇతర సామగ్రిని జప్తు చేసి కోర్టులో జమ చేశారు. ఆర్డీవో కార్యాలయ సామగ్రి జప్తు చేశారన్న అంశం జగిత్యాలలో చర్చనీయాంశమైంది.