Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని
- ఖమ్మంలో భారీ ప్రదర్శన, ధర్నా
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్లే వ్యవసాయరంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేయాలనీ, గిట్టుబాటు ధరలకు పంటలు కొనుగోలు చేయాలనీ, రైతుబంధు నిధులు విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తూ మంగళవారం ఖమ్మంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రైతులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పోతినేని మాట్లాడుతూ.. మోడీ, కేసీఆర్‌కు రైతులంటే చాలా చిన్నచూపనీ, వ్యవసాయం పట్ల వీరిద్దరిదీ ఒకే దారనీ విమర్శించారు. ఐదేండ్ల కాలంలో దేశవ్యాప్తంగా లక్షా పదిహేను వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని కార్పొరేట్ సంస్థలు ఇంతకు ముందు రూ.250కోట్ల టర్నోవర్ చేస్తే వచ్చిన ఆదాయంలో 35శాతం పన్ను కట్టాలనే నిబంధన ఉండేదని తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.250 కోట్ల టర్నోవర్‌ను రూ.400 కోట్లకు పెంచారనీ, 35శాతం ఉన్న పన్నును 20శాతానికి కుదించారని విమర్శించారు. ఈ లెక్కన ఇరవై ముప్పై కార్పొరేట్ సంస్థల కుటుంబాలకే రూ.2లక్షల కోట్ల ఆదాయం వచ్చేలా చేశారన్నారు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన సమయంలో రూ.లక్ష కోట్ల ఆస్తులున్న ముఖేష్ అంబానీ నేడు రూ.19లక్షల కోట్లకు చేరుకున్నారని చెప్పారు. మరో వైపు రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు.
సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన పాపానికి రైతులు, అధికారులు తన్నులాడుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం తన తప్పులను అధికారులపైకి నెట్టి చోద్యం చూస్తోందన్నారు. ఇప్పటికైనా రైతాంగ సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరారు. ప్రదర్శన అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బత్తుల లెనిన్, భూక్యా వీరభద్రం, మాచర్ల భారతి, బండిరమేష్, కల్యాణం వెంకేటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పోడుభూములకు హక్కుపత్రాలివ్వాలి:వ్యకాస ఆధ్వర్యంలో నిరసన దీక్ష
పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం జేసీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జాటోత్ కృష్ణ, మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పేదలందరికీ ఎవరి స్థలంలో వారికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తామనీ, పోడు సాగుదారులకు హక్కు పత్రాలిస్తామన్న ప్రభుత్వ హామీలను అమలు చేయాలని కోరారు. చౌకధరల దుకాణాల్లో 14 రకాల వస్తువులు ఇస్తామని చెప్పి బియ్యం మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. దళిత, గిరిజనులకు మూడెకరాల సాగు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య, సహాయ కార్యదర్శులు రేపాకుల శ్రీనివాస్, బత్తుల వెంకటేశ్వర్లు, ఎస్.వినోద్ తదితరులు పాల్గొన్నారు.