Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ సర్కారు కొలువుదీరి ఎల్లుండికి యేడాది
- నిరుద్యోగభృతి జాడేది.. రైతు రుణమాఫీ ఊసేది
- డబుల్ బెడ్ రూంలు, దళితులకు మూడెకరాలు అంతే సంగతులు
- ఒక్క కొలువూ లేదు
తెలంగాణ ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖరరావు రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి ఎల్లుండికి (శుక్రవారం) సరిగ్గా యేడాది పూర్తవుతుంది. గతేడాది డిసెంబరు 13న రాజ్‌భవన్‌లో ఆయనతోపాటు హోం మంత్రి మహమూద్ అలీ కూడా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అంతకు ఒకరోజు ముందు మీడియాతో మాట్లాడిన కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అనేక వరాలు కురిపించారు. తమ మీద నమ్మకముంచి రెండోసారి అధికారాన్ని కట్టబెట్టినందుకు ప్రజలకు కృతజ్ఞతగా ఉంటామనీ, ఈ క్రమంలో మరిన్ని కొత్త పథకాలను అమలు చేస్తామంటూ హామీనిచ్చారు. ఆసరా పెన్షన్ల పెంపు, రైతుబంధు కింద ఇచ్చే సాయం పెంపు, నిరుద్యోగ భృతి, దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు, ఇందుకోసం కడియం శ్రీహరి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు తదితరాంశాలు ఆయన వాగ్దానాల్లో ముఖ్యమైనవి.
బి.వి.యన్.పద్మరాజు
వీటిలో ఆసరా పెన్షన్లను రూ.వెయ్యి నుంచి రూ.2,016కు పెంచారు. దీంతోపాటు రైతుబంధు సాయాన్ని ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచారు. ఇవిగాకుండా ఈ యేడాది కాలంలో సీఎం ఇచ్చిన హామీల్లో అత్యంత ప్రధానమైన అంశాలు మాత్రం అమలుకు నోచుకోలేదు. ముఖ్యంగా నిరుద్యోగ భృతికి ఇప్పటి వరకూ నియమ నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించకపోవటం గమనార్హం. దీనిపై ముఖ్యమంత్రిగానీ, ఉన్నతాధికారులుగానీ నోరు మెదపటం లేదు. అప్పట్లో సీఎం నిరుద్యోగ భృతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులున్నారు..? వారు విద్యార్హతలేమిటి..? వారు ఏయే పనులు చేస్తున్నారు..? అనే వివరాలను వయసుల వారీగా సేకరిస్తామని ఆయన ఆ సందర్భంగా చెప్పారు. తద్వారా ఒక జాబితా రూపొందించి.. ఉన్నతాధికారులతో మాట్లాడి మార్గదర్శకాలు రూపొందిస్తామంటూ తెలిపారు. కానీ అందుకనుగుణంగా ఇప్పటి వరకూ ఎలాంటి కార్యాచరణ రూపొందించలేదు. దీంతోపాటు అతి ముఖ్యమైన రైతు రుణమాఫీ విషయంలోనూ సర్కారు వైపు నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. కొద్ది నెలల క్రితం ఇదే విషయంపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ... 'రైతులు బ్యాంకుల్లో ఉన్న అప్పులు పూర్తిగా చెల్లించి ఖాతాలు రెన్యూవల్ చేయించుకోవాలి. వారి డబ్బుల్ని మేం అణా పైసాతో సహా చెల్లిస్తాం. కాకపోతే కొంత సమయం పడుతుంది...' అని ప్రకటించారు. ఇది జరిగి దాదాపు ఆరేడు నెలలు గడిచినా రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవటం గమనార్హం. దీంతో రైతులకు వడ్డీ భారం పెరిగిపోతుంది. బ్యాంకులు కొత్తగా అప్పులివ్వకపోవటంతో వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ యేడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కొలువునూ భర్తీ చేయలేకపోయింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఒక్క నోటిఫికేషన్ వెలువడలేదు. టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) నియామకాలు చేపట్టాలంటూ వికలాంగ అభ్యర్థులు మంగళవారం ప్రగతి భవన్‌ను ముట్టడించారంటే రాష్ట్రంలో
నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరిస్తామంటూ ఆ సందర్భంగా సీఎం హామీనిచ్చినప్పటికీ అది ఆచరణకు నోచుకోలేకపో యింది. దీంతోపాటు 2018 ఏప్రిల్ చివరి నాటికి మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా నీరు అందిస్తామంటూ సీఎం చెప్పారు. కానీ వాస్తవంలో మాత్రం ఆ పథకం పనులు ఇంకా కొనసాగుతుండటం గమనార్హం. టీఆర్‌ఎస్ సర్కారు 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన ప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాలు, కేజీ టూ పీజీ ఉచిత విద్య తదితర పథకాలను ప్రతిష్టా త్మకంగా ప్రకటిం చింది. దాదాపు నాలుగున్నరేండ్లపాటు వీటి కోసం ఎదు రు చూసిన లబ్ది దారులు.. కనీసం కేసీఆర్ రెండోసారి సీఎం అయిన తర్వాతైనా ఆయా పథకాలను అమలు చేస్తారని భావించారు. కానీ గత యేడాది కాలంలో ప్రభుత్వ పెద్దలు ఒక్కసారి కూడా వీటి గురించి ప్రస్తావించలేదు. దీన్ని బట్టి ఆయా స్కీములు అటకెక్కినట్టేననే వాదనలు వినబడుతున్నాయి.