Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు కుషాయిగూడలో బహిరంగ సభ
- హాజరుకానున్న అఖిలభారత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.హేమలత, తపన్‌సేన్
నవతెలంగాణ -రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
సీఐటీయూ రాష్ట్ర 3వ మహాసభకు సర్వం సిద్ధమైంది. శనివారం బహిరంగ సభతో ప్రారంభం కానున్న మహాసభకు జాతీయ నాయకులు, రాష్ట్ర ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇప్పటికే జిల్లాల్లో సభలు, సమావేశాలు, వాల్‌పోస్టర్లు, జీపు జాతరలతో విస్తృతంగా ప్రచారం చేశారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో నిర్వహించనున్న బహిరంగ సభ ప్రాంగణం మొత్తం ఎర్రజెండాలు, అలంకరణ తోరణాలతో ఆ ప్రాంతమంతా ఎరుపెక్కింది. ఈ మహాసభ 14 నుంచి 17వరకు మేడ్చల్ జిల్లా మల్లపూర్ ప్రాంతంలోని వీఎన్‌ఆర్ గార్డెన్‌లో జరగనున్నాయి.
ఏర్పాట్లు పూర్తి..
మహాసభ నిర్వహణకు సంబంధించి 6 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా సభ, సమావేశాలు, సెమినర్లు నిర్వహించి కార్మికుల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ మహాసభ నిర్వహణ ఖర్చులకు కార్మిక లోకం స్వచ్ఛందంగా ఒక రోజు వేతనం కింద రూ.100 నుంచి రూ.1000 వరకు విరాళాలు ఇచ్చింది. నాలుగు రోజులపాటు జరిగే రాష్ట్ర మహాసభకు రాష్ట్ర నలుమూల నుంచి 580 ప్రతి నిధులు హాజరుకానున్నారు. ఇందులో మహిళాప్రతినిధులు 167మంది ఉన్నారు.
నేడు బహిరంగ సభ, ర్యాలీ
మహాసభ సందర్భంగా శనివారం కుషాయిగుడ మున్సిపల్ మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ ప్రారంభానికి ముందు ఏఎస్‌రావు నగర్ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ నుంచి కార్మికులు, కళాకారుల సాంస్కృతిక కళారూపాలతో ప్రదర్శనగా మున్సిపల్ మైదానం వరకు వెళ్తారు. బహిరంగ సభకు సీఐటీయూ అఖిలభారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.హేమలత, ఉపాధ్యక్షులు సుధాభాస్కర్, ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.సాయిబాబు, చుక్క రాములు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్.రమ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎ.అశోక్, జె.చంద్రశేఖర్ పాల్గొనున్నారు. బహిరంగ సభను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ కార్మికులకు పిలుపునిచ్చారు.