Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుపేద దళిత కుటుంబంపై దాడి
- కర్రలతో కొట్టిన టీఆర్‌ఎస్ సర్పంచ్ కుటుంబం
- బాధితులకు మద్దతు తెలపొద్దని గ్రామంలో బెదిరింపు
- కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌లో ఆలస్యంగా వెలుగులోకి..
నవతెలంగాణ-నిజామాబాద్
గతంలో కల్తీ కల్లు విషయం, గ్రామ స్థలాలపై ఆరా తీసినందుకు ఓ దళిత కుటుంబంపై టీఆర్‌ఎస్ సర్పంచ్ కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. ప్రభుత్వ స్థలంలో పశువులు కట్టేస్తున్నారని నోటీసు జారీ చేయించారు. వివాదం అధికారుల సమక్షంలో పరిష్కరిం చాల్సిందిపోయి వారిపై టీఆర్‌ఎస్ సర్పంచ్, కుటుంబ సభ్యులు దాడికి తెగబడ్డారు. కర్రలతో కొట్టడంతో వృద్ధుడి తల భాగం పగిలింది. వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. పది రోజులు గడిచినా ఈ విషయం బయటకు పొక్కనీయకుండా టీఆర్‌ఎస్ నాయకులు గ్రామస్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం కంషెట్‌పల్లిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
బాధితుల వివరాల ప్రకారం... దళిత కుటుంబానికి చెందిన సైదులు, మల్లమ్మ, వారి కుమారుడు సాయిబాబా గత ముప్పై ఏండ్లుగా కంషెట్‌పల్లిలో ఉంటున్నారు. భూములు లేకపోవడంతో మూడు గేదెల ద్వారా వచ్చే ఆదాయంతో బతుకుతున్నారు. గతే పదిహేనేండ్లుగా ఇంటి ముందు ఖాళీ స్థలంలో బర్లను కట్టేసుకుంటుండగా.. కొంతకాలంగా ప్రభుత్వ స్థలమంటూ వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రామంలో కల్తీ కల్లు విచ్చలవిడిగా సరఫరా అవుతోందనీ, పలువురు ప్రమాదాలకు గురవుతున్నారనీ సాయిబాబ ఆరా తీశాడు. రెండు దుకాణాలు ప్రస్తుత సర్పంచ్ భర్త సాయగౌడ్‌కు చెందినవి కావడంతో అతనిపై ఆగ్రహం పెంచుకున్నాడు. పశువులు కట్టేస్తున్న స్థలం ప్రభుత్వానిదని పంచాయతీ కార్యదర్శి నుంచి రాతపూర్వక నోటీసు వచ్చింది. అనంతరం గ్రామంలో ఎన్ని కబ్జా భూములున్నాయో తెలుసుకునేందుకు ఆర్‌టీఐకి సాయిబాబ దరఖాస్తు పెట్టాడు. అప్పటికే ఎన్నికల్లో మరో సర్పంచ్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారని కక్ష పెంచుకోవడం, కల్తీ కల్లు, స్థలంపై ఆరాతీయడంతో సర్పంచ్ భర్త ఆగ్రహంతో రగిలిపోయాడు. డిసెంబర్ 5న రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఉద్దేశపూర్వకంగానే సాయిబాబ, అతని తల్లిదండ్రులపై దాడికి దిగారు. కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. సైదులు తల పగిలింది. మల్లమ్మపై పిడిగుద్దులు గుద్ది కాళ్లతో తన్నారు. వాళ్ల కుమారుడు వెంటనే బాన్సువాడ ఆస్పత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. శనివారమే వారు డిశ్చార్జి అయి కూతురి ఇంటికి వెళ్లినట్టు తెలిసింది. గొడవ జరుగుతుందని ముందే ఫిర్యాదు వెళ్లినా కిలోమీటరు దూరంలో ఉన్న పోలీసులు చేరుకోకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు సర్పంచ్ విజయలక్ష్మి, ఆమె భర్త సాయగౌడ్, ఆయన తమ్ముడు అరవింద్‌గౌడ్, గ్రామస్థుడు బాబుపై కేసు నమోదైనా ఇప్పటిదాకా వాళ్లపై న్యాయపరమైన చర్యలేవీ తీసుకోలేదు. బాధిత కుటుంబానికి ఎవరు మద్దతు తెలిపినా, పరామర్శించినా వాళ్లను కూడా వదలబోమని సదరు టీఆర్‌ఎస్ నాయకులు గ్రామస్థులను బెదిరించినట్టు తెలిసింది. అప్పటికే స్థల వివాదంపై అధికార పార్టీ ముఖ్య నాయకులు కొందరు రాజీకి యత్నించినా.. దాడి అనంతరం బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించకపోవడం గమనార్హం.