Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత సామరస్యానికి ప్రతీకగా రాష్ట్రం ఉండాలి: సీఎంకు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతప్రాతిపదికన మెజార్టీని దుర్వినియోగం చేస్తూ, ప్రజాస్వామ్య, లౌకిక విలువలను మంట కలిపే విధంగా ఇటీవల పార్లమెంట్‌లో పౌరసత్వ సవరణ బిల్లు-2019ని ఆమోదించిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయొద్దని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. ఈ చట్టం రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా ఉన్నదని విమర్శించారు. పౌరసత్వానికి - మతానికి ముడిపెడుతూ, లౌకికతత్వానికి ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నందున దేశవ్యాప్తంగా నిరసన ఆగ్రహజ్వాలలు పెల్లుబికుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలతోపాటు, మైనార్టీలు ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, కళాకారులు, రచయితలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఈ చట్టం వల్ల అన్యాయం జరుగుతుందని ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయని తెలిపారు.
దేశ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా తెచ్చిన ఈ చట్టాన్ని అమలు చేయబోమని కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటించారని గుర్తు చేశారు. మత కోణంలో తెస్తున్న ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. దేశ ప్రజాస్వామ్య, లౌకిక విలువలు కాపాడే విధంగా కృషి చేసారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల సీఎంల తరహాలో ఈ రాష్ట్రంలోనూ ఈ చట్టాన్ని అమలు చేయబోమని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, లౌకిక విలువలు కాపాడి, మత సామరస్యానికి ప్రభుత్వం ప్రతీకగా ఉండాలని ఆశిస్తున్నామని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని కోరారు.