Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30న రాష్ట్రస్థాయి సాధనా సర్వే
-9 8,9 తరగతుల పిల్లలకు పరీక్ష
- 5,449 బడుల్లోని 4.84 లక్షల మంది రాసే అవకాశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యార్థుల సామర్థ్యాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈనెల 30న రాష్ట్రస్థాయి సాధనా సర్వే (స్లాస్) నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రంలోని 5,449 ప్రభుత్వ, పంచాయతీరాజ్, కేజీబీవీ, మోడల్ పాఠశాలల్లోని 8,9 తరగతుల విద్యార్థులకు పరీక్ష నిర్వహించనుంది. రాష్ట్రంలో 8,9 తరగతులు చదువుతున్న 4,84,601 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. ఇందులో ఎనిమిదో తరగతి విద్యార్థులు 2,41,158 మంది, తొమ్మిదో తరగతి పిల్లలు 2,43,443 మంది ఉన్నారు. రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్‌సీఈఆర్టీ) నిర్వహణలో ఈ పరీక్ష జరగనున్నది. వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో కూడిన ఓఎంఆర్ ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ప్రభుత్వ బడుల్లోని విద్యార్థుల విద్యా అభ్యసన సామర్థ్యాలను పరిశీలించడమే స్లాస్ లక్ష్యంగా ఉన్నది. తెలుగు/ఉర్దూ, ఇంగ్లీష్, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి ఎస్‌సీఈఆర్టీ వంద మార్కులకు ప్రశ్నాపత్రాన్ని తయారు చేస్తుంది. ప్రభుత్వ పరీక్షల విభాగం (డీజీఈ) ఈ ప్రశ్నాపత్రాలను ముద్రిస్తుంది. 8,9 తరగతుల పిల్లలు ఈనెల 30న పరీక్ష రాసిన తర్వాత ఆ ఓఎంఆర్ పత్రాలను పాఠశాలల నుంచి ఎస్‌సీఈఆర్టీ తెప్పించుకుని మూల్యాంకనం చేపట్టనుంది. ఉపాధ్యాయులు కేవలం పరీక్ష నిర్వహణలో ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అసర్, ఎస్‌సీఈఆర్టీ, జాతీయ సాధనా సర్వే (న్యాస్) వంటి సర్వేల ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకుంటారు. అయినా విద్యార్థుల సామర్థ్యం సరిగ్గా అంచనా వేయడానికి కుదరడం లేదని అధికారులు భావిస్తున్నారు. అందుకే శాస్త్రీయంగా విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకే ఎస్‌ఎల్‌ఏఎస్ నిర్వహిస్తున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏడో తరగతి విద్యార్థులకూ కలిపి ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ దిశగా విద్యాశాఖ అధికారులు సమాలోచన చేస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రయివేటు పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యం తెలుసుకునేందుకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థుల సామర్థ్యం మెరుగ్గా ఉన్న పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది.ఈనెల 30న ఎస్‌ఎల్‌ఏఎస్ రాతపరీక్ష నిర్వహించిన 15 రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి విజరుకుమార్ తనను కలిసిన విలేకర్లతో చెప్పారు.