Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21 ఏండ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూపులు
- 50 మందికి పైగా గుండెపోటుతో మృతి
- 9 మందికే పోస్టింగులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్:
ప్రభుత్వ ఉద్యోగం అంటే జీవితం పణంగా పెట్టి చదువుతారు. ఉద్యోగం వచ్చినట్టే వచ్చి చేతిలోంచి జారిపోతే ఆ వ్యథ ఎలా ఉంటుంది? ప్రభుత్వాలు ఇవ్వాళ, రేపూ అంటూ కాలం వెళ్లదీస్తుంటే... ఒకటి కాదు రెండు కాదు 21 ఏండ్ల జీవనపోరాటంలో ఎంత వేదన? ఎదురుచూపులోనే పదవీవిరమణ వయసుకు చేరువవ్వడం ఎంతటి నిస్సహాయ స్థితి!? ప్రభుత్వాల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం... వెరసి 50 మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వందల కుటుంబాలకు తీరని శోకం మిగిలింది. ముగ్గురు ముఖ్యమంత్రులు హామీ ఇచ్చినా ముందుకెళ్లని.. 1998 డీఎస్సీ అభ్యర్థుల గుండె గోస ఇది.
అసలేం జరిగింది..?
1998 డీఎస్సీని ప్రభుత్వం గందరగోళం చేసింది. వెంటవెంటనే రెండు జీవోలు తీసుకొచ్చి అభ్యర్థుల భవితవ్యాన్ని చీకట్లోకి నెట్టేసింది. ప్రతిభ కనబరిచిన అభ్యర్థులు రోడ్డున పడితే, మార్కులు తక్కువ వచ్చినవారికి ఉద్యోగాలు వచ్చాయి. దీంతో అర్హత సాధించిన నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన 400 మంది అభ్యర్థులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని ట్రిబ్యునల్ ఆదేశాలిచ్చింది. ఆ తీర్పును హైకోర్టు కూడా సమరర్ధించింది. హైకోర్టు తీర్పు కూడా అమలు కాకపోవడంతో అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని సుప్రీం తేల్చిచెప్పింది. సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించైనా ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు గత ఏడాది సెప్టెంబర్‌లో ఆదేశాలు జారీచేసింది. కానీ నల్లగొండ జిల్లాలో ఐదుగురు, కరీంనగర్‌లో నలుగురు... మొత్తం తొమ్మిదిమందికి మాత్రమే ఉద్యోగాలిచ్చి అధికారులు చేతులు దులుపు కున్నారు. తప్పు టీడీపీ హయాంలో జరిగింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. 2016 జనవరి 3న అభ్యర్థులు కలిసినప్పుడు ఉద్యోగాల కల్పనకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయినా ఇప్పటివరకూ బాధితులకు న్యాయం జరగలేదు.
ఆశతో బతుకు పోరు...
ప్రభుత్వం మారినప్పుడల్లా ఓ ఆశ. ఈ ప్రభుత్వమైనా ఉద్యోగాలిస్తుందేమోనని? కోర్టు తీర్పు వచ్చినప్పుడల్లా ఓ ఊరట. ఉద్యోగంలో చేర తామేమోనని. కానీ వాళ్ల ఆశలు అడియాశలైపోతున్నాయి. ఆ బాధతో 50 మందికి పైగా అభ్యర్థులు గుండెపోటుతో చనిపోయారు. ఇక మిగిలిన వాళ్ల పరిస్థితి మరీ ఘోరం. డీఎస్సీ అర్హత సాధించిన టీచర్లు వాళ్లు... ప్రయివేటులో చేరదామంటే ఏ క్షణాన ప్రభుత్వం పిలిచి ఉద్యోగ మిస్తుందోనని చాలా మందిని ప్రయివేటు స్కూళ్లు చేర్చు కోలేదు. ఫలితం... ఉన్నత చదువులు చది వినవాళ్లు, తరగతి గదులను ప్రయోగశాలలు చేసి, విద్యార్థులను మనకు అందించాల్సిన వాళ్లు... ఉపాధి కూలీలుగా మారారు. గత్యంతరం లేని స్థితిలో పశువుల కాపర్లుగా బతుకీడుస్తున్నారు. సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. కిరాణాషాపుల్లో గుమస్తాలుగా ఉన్నారు.
ఆశయం కోసం పోరు...
ఆశయసాధనలో యవ్వనమంతా కరిగి పోయింది. కొందరు ఉద్యోగాలు రాకుండానే... పదవీ విరమణ వయసుకు చేరువయ్యారు. వృథా అయి పోయిన వాళ్ల మేథకు, ఆశలో ఆవిరైపోతున్న వాళ్ల జీవితాలకు ప్రభుత్వాలు ఏ పరిహారం ఇస్తాయి? ఒక పోరాటం చేయలంటే ఎంతో స్ఫూర్తి కావాలి. ఇంతటి నిస్సహాయ పరిస్థితుల్లో 21 ఏండ్లపాటు పోరాటాన్ని కొనసాగిం చడానికి ఎంతో ఆత్మస్థైర్యం ఉండాలి? బతుకు పట్ల, భవిష్యత్ మీద అమితమైన ఆశ ఉండాలి?. ఆ ఆశతోనే పోరాటం చేస్తున్నారు వాళ్లు. ఎన్నికల సభల్లో హామీ ఇచ్చి, 2016లో ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మరీ... సమస్య పరిష్కారం చేస్తానని చెప్పిన సీఏం కేసీఆర్ తమ గుండెగోస వినాలనీ, హైకోర్టు ఆదేశాలననుసరించి మానవతా దృక్పథంతో ఇప్పటికైనా తమకు ఉద్యోగాలివ్వాలని కోరుతున్నారు.
మొర ఆలకించాలి : శ్రీధర్, ఖమ్మం
క్వాలిఫై అయినా కోర్టుల చుట్టూ తిరగడానికే సమయ మంతా వృథా అయ్యింది. న్యాయ స్థానాలు చెప్పినా ప్రభుత్వాలు వినడం లేదు. చాలా విలువైన సమయాన్ని కోల్పోయాం. భార్యాభర్తలిద్దరం పనిచేసినా... ఇల్లు గడవడమే కష్ట మవుతున్నది. పిల్లల చదువులు భార మయ్యాయి. ఆందోళనలు చేసి చేసి అలసిపోయాం. ఇప్పటికైనా ప్రభుత్వం మా మొర ఆలకించాలి.
ఈచ్‌వన్-టీచ్‌వన్ అయినా ఇవ్వండి: కళాధర్‌రెడ్డి, నిజామాబాద్,
మా ప్రాంతంలో ఎవ్వరూ బీఈడీ చేయని రోజుల్లో చేశాను. కానీ ఏం లాభం. అవినీతి అధికారుల వల్ల మేం నష్టపోయాం. స్కూల్ పెడితే నడవలేదు. మధ్యలో వెళ్లిపోతరని వేరే స్కూల్‌వాళ్లు కూడా ఉద్యోగంలోకి తీసుకోలేదు. ఇన్నేండ్లుగా దొరికిన పని చేసి బతుకుతున్నం. ఇప్పుడు ప్రభుత్వం ఈచ్‌వన్-టీచ్‌వన్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఆ బాధ్యతలనైనా మాకు అప్పగిస్తే బాగుంటుంది.