Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెత్తగా నిర్వహణ.. కనీస వసతులు కరువు
- రూ.3500 నుంచి రూ.పదివేలు వసూలు చేస్తున్న నిర్వాహకులు
- పట్టించుకోని అధికారులు
హైదరాబాద్ మినీ భారతం. ఇతర జిల్లాలతోపాటు రాష్ట్రాల ప్రజలూ విద్య, ఉద్యోగం, ఇతరత్ర అవసరాల నిమిత్తం నగరానికి వస్తుంటారు. వీరిలో చాలా మంది ప్రయివేటు వ్యక్తులు, సంస్థలు నిర్వహించే హాస్టళ్లలో ఉంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వేల సంఖ్యలో ఈ తరహా హాస్టళ్లుండగా లక్షలాది మంది వాటిల్లో వసతి పొందుతున్నారు. ప్రాంతం, సౌకర్యాలను బట్టి ఒక్కో హాస్టల్‌లో ఒక్కో రకమైన ఫీజులు వసూలు చేస్తున్నారు. కానీ కనీస వసతులు మాత్రం కల్పించడం లేదు. దీంతో వినియోగదారులు, విద్యార్థులు, చిరుద్యోగులు, నిరుద్యోగులు నష్టపోతున్నారు.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపుగా ఐదు వేలకుపైగా ప్రయివేటు హాస్టళ్లు ఉన్నాయి. సాధారణ సదుపాయాలు కల్పించే హాస్టల్ నిర్వాహకులు రూ.3,500 నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తుండగా, ఐటీ కారిడార్, డీలక్స్ హాస్టళ్లలో రూ.ఆరు నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. కానీ నాణ్యమైన ఆహారంతోపాటు, కనీస సౌకర్యాలు కల్పించడం లేదని వసతి పొందుతున్న వారు చెబుతున్నారు. పుచ్చులున్న, పాడైన కూరగాయలు, రేషన్ బియ్యంతో వడ్డిస్తున్నారు. దీంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్నతున్నది. 20 మందికి కలిపి ఒకే బాత్‌రూం, శుభ్రత పాటించకపోవడం, నలుగురు ఉండే గదుల్లో పది మందిని నింపేస్తున్నారు. దీంతో ఏదైనా ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి వీల్లేకుండా ఉంటున్నది. ఇలాంటి హాస్టళ్లు నగరంతోపాటు ఆయా జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్కువగా కనిపిస్తాయి. లైబ్రరీ దగ్గరగా ఉండటంతో ఇక్కడ ఉంటున్నామని కొంతమంది బాధితులు చెబుతుండగా, ఆయా సంస్థలకు దగ్గరగా ఉందని మరికొందరు చెబుతున్నారు. ఫైర్ సేప్టీ లేకపోవడం, గదులు, కిచెన్ శుభ్రంగా లేకపోవడం, వాడిపోయిన దొండకాయ, ముదిరిన బెండకాయలతో కూరలు, రాత్రి మిగిలిన అన్నంతో పులిహోర, జీరా రైస్ చేస్తున్నారు. ఇలాంటి హాస్టళ్లు నారాయణగూడ, చిక్కడపల్లిలో చాలానే ఉన్నాయి. దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట, కూకట్‌పల్లి రద్దీ ప్రాంతాలు కావడంతో హాస్టళ్ల వద్ద సెక్యూరిటీ గార్డులు, సీసీ కెమెరాలు లేక లోపలికి ఎవరు వెళ్తున్నారు.. ఎవరు వస్తున్నారనే విషయం కూడా తెలియడం లేదు. వాహనాలు ఉంచడానికి సైతం స్థలం లేక బయట పార్కు చేయడంతో ఎవరైనా దొంగతనాలు చేసే అవకాశాలు ఉన్నాయని వసతి పొందుతున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లేడీస్ హాస్టళ్ల వద్ద సెక్యూరిటీ గార్డులు లేకపోవడంతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు.సొంత గృహాల్లో నిర్వహణ ఉండటంతో మెజార్టీ నిర్వాహకులు అనుమతులు తీసుకోకపోవడంతోపాటు, కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, వారికి సంబంధించిన వ్యక్తుల హాస్టళ్లు కావడంతో ఎలాంటి అనుమతులు పొందడం లేదు. ఓ మాజీ ఎమ్మెల్యేకు ఏకంగా గ్రేటర్‌లో 50కిపైగా హాస్టళ్లు ఉన్నట్టు సమాచారం. గతేడాది అక్టోబర్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులు దాడులు నిర్వహించి ఏడు హాస్టళ్లను సీజ్ చేశారు. కొద్ది రోజుల తర్వాత స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మొత్తం ఎన్ని హాస్టళ్లు ఉన్నాయి? ఎన్నింటికి అనుమతులు ఉన్నాయి? అనే లెక్కలు తేలుస్తామన్న అధికారులు అటువైపే చూడటం లేదు. దీంతో నిర్వాహకులు తాము వడ్డించేదే అన్నం, పెట్టిందే తినాలి అన్నట్టుగా మారింది పరిస్థితి.హాస్టళ్ల నిర్వహణకు జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకోకుండానే సొంత ఇండ్లల్లో యధేచ్ఛగా నడిపిస్తున్నారు. దీంతో కమర్షియల్ ట్యాక్స్ చెల్లించకుండా కేవలం రెసిడెన్సియల్ ట్యాక్స్ మాత్రమే చెల్లిస్తుండటంతో ప్రభుత్వం భారీగా ఆదాయం కోల్పోతున్నది.
నలుగురు ఉండే గదుల్లో ఏడుగురిని ఉంచుతున్నారు
సౌమ్య, విద్యార్థిని
నేను పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి హైదరాబాద్‌కు వచ్చాను. మా హాస్టల్‌లో కనీస సౌకర్యాలు లేవు. ఇరవై మందికి కలిపి ఒకే బాత్రూం ఉంది. ఉదయం సమయంలో అందరూ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లాల్సి ఉండటంతో క్యూ కట్టాల్సి వస్తున్నది. నలుగురు ఉండాల్సిన గదిలో ఏడుగురిని కుక్కడంతో నడవడానికి రాక ఇబ్బందులు పడుతున్నాం.
శుభ్రత లేదు..
సత్యనారాయణరెడ్డి, చిరు ఉద్యోగి
నేను ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. ఆఫీసుకు ఆర్టీసీ క్రాస్‌రోడ్డు దగ్గర కావడంతో ఇక్కడే హాస్టల్‌లో ఉంటున్నా. నిర్వాహకులు శుభ్రత పాటించకపోవడంతో ఆహారంపై దోమలు, ఈగలు వాలుతున్నాయి. దీంతో అనారోగ్యాల బారినపడుతున్నాం.