Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్, బీజేపీకి అభ్యర్థులు దొరకటం లేదు : రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మున్సిపాల్టీలను ఒక్కరోజులో అభివృద్ధి చేయటం సాధ్యం కాదని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. వాటిని దశల వారీగా అభివృద్ధి చేసుకుంటూ పోవాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలకు అత్యధికంగా నిధులు కేటాయించింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆయన చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీలు శ్రీనివాసరెడ్డి, నవీన్ కుమార్ తదితరులతో కలిసి పల్లా మాట్లాడారు. ఇప్పటి వరకూ 36 వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ పార్టీపై అవాకులు, చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఆ రెండు పార్టీలకు అభ్యర్థులే దొరకటం లేదని అన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు అభివృద్ధిని గమనించకపోవటం దుర దృష్టకరమని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ నేతలు తెలంగాణను ఏదో ఉద్ధరించినట్టుగా మాట్లాడుతున్నారని.. వాస్తవానికి మన రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో ఏడాదికి సాలీనా రూ.65 వేల కోట్లు కేంద్రానికి వెళుతున్నాయని తెలిపారు. వాటిలోంచి రూ.25 వేల కోట్లు కూడా తిరిగి తెలంగాణకు రావటం లేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై తమ పార్టీ వైఖరిని పార్లమెంటు ఉభయ సభల్లో స్పష్టం చేశామని పల్లా ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
వి.ప్రకాశ్‌కు బసవ కృషి అవార్డు...
టీఆర్‌ఎస్ నేత వి.ప్రకాశ్.. బసవ కృషి జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. మంగళవారం ఆల్మట్టి డ్యాం సమీపంలోని కూడలి సంగంలో అవార్డును ఆయనకు అందజేయ నున్నారు. కర్నాటకలోని అఖిల భారత లింగాయత్ పంచమశాలి మహాపీఠం ఈ అవార్డును ఏర్పాటు చేసింది.
వెంకట్రామయ్య మరణంపట్ల సంతాపం...
ప్రముఖ నవలా రచయిత, ప్రయోక్త, రేడియో రాంబాబుగా ప్రసిద్ధి చెందిన ఆకాశవాణి మాజీ న్యూస్ రీడర్ డి.వెంకట్రామయ్య మరణంపట్ల సీఎం తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. హైదరాబాద్ రేడియో కేంద్రంలో వివిధ విభాగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. వెంకట్రామయ్య కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు.