Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఎన్‌యూ ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలి: టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శివర్గం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) పేరుతో విద్యాకాషాయీకరణ, ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 25న మార్చ్ టూ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శివర్గం ప్రకటించింది. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో ముసుగులు వేసుకుని విద్యార్థులు, ప్రొఫెసర్లపై పాశవికంగా చేసిన దాడిని తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం సంఘం అధ్యక్షులు కె జంగయ్య అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లోని చెన్నుపాటి భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ జేఎన్‌యూ విద్యార్థులు, ప్రొఫెసర్లను లక్ష్యంగా చేసుకుని గాయపరచడమే కాకుండా వారే దాడులకు పూనుకున్నారని పోలీసులు, వీసీ కుమ్మక్కై బాధితులపైనే కేసులు పెట్టడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు. జేఎన్‌యూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడిని దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం రావడమంటే అది ఎంత హేయమైందో సూచిస్తున్నదని అన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ, లౌకిక విలువల పరిరక్షణకు మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో విశాల వేదిక ఏర్పాటు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ జాతీయోద్యమంలో కీలక భూమిక పోషించిన నేతాజీ జయంతి, గాంధీ వర్ధంతులను టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించాలని అన్నారు. ఈనెల 26న రాజ్యాంగ పరిరక్షణ కోసం పాఠశాలల్లో రాజ్యాంగ పీఠికను చదివించాలని సెమినార్లు జరపాలని కోరారు. 19 నెలలైనా పీఆర్సీ అమలు చేయకపోవడం ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్నదని చెప్పారు. పీఆర్సీని వెంటనే ప్రకటించకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లను ఐక్యం చేసి ఉద్యమ కార్యాచరణకు పూనుకుంటామని హెచ్చరించారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడంలో ఐదేండ్లుగా జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని కోరారు. యాజమాన్యాల వారీగా వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.