Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు మీద దౌర్జన్యం చేయడంపై గ్రామస్తుల ఆగ్రహం
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రాజెక్టు వద్ద ధర్నా
- రైతుకు క్షమాపణ చెప్పిన కాంట్రాక్టు సంస్థ ఇన్‌చార్జి
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నిర్వాసిత రైతును దుర్భాషలాడి తన గన్‌మెన్‌తో దాడి చేయించిన బస్వాపురం రిజర్వాయర్ ప్రాజెక్టు కాంట్రాక్టరైన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డిపై కేసు నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుపై దాడిని సీపీఐ(ఎం), తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ, తెలంగాణ ప్రజాఫ్రంట్ తీవ్రంగా ఖండించాయి. సోమవారం యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం రిజర్వాయర్ ప్రాజెక్టు వద్ద కాంట్రాక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బాధిత రైతు ఉడుత రవి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ధర్నా చేశారు. దాడికి కారకుడైన మంత్రిపై కేసు నమోదు చేయాలని సుమారు 3 గంటలకు పైగా బైటాయించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కలెక్టర్ వచ్చి బాధిత రైతుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించబోమని నేతలు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న భువనగిరి తహసీల్దార్ అక్కడికి చేరుకొని ఆందోళన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహాతో చర్చించారు. బాధిత రైతుకు చెందిన సర్వే నెంబర్ 179లోని 7 ఎకరాలను భూసేకరణ పేరిట తీసుకొని అందులో 21 గుంటల భూమికి ఏడాదిన్నరగా పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రీసర్వే చేయించి పరిహారం అందని రైతులకు వెంటనే డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేయగా, తహసీల్దార్ అంగీకరించారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా బ్లాస్టింగ్‌లు చేయడం వల్ల ఇండ్లు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై 'కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి మూడు నెలలు కావొస్తోంది. ఇప్పటి వరకు దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించేందుకు అధికారులు ఎవరూ రాలేదు' అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 17న గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో డోర్ టూ డోర్ విచారణ చేయించి నివేదిక రూపొందించి తగు నష్టపరిహరం ఇప్పిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. రైతుపై దాడి చేసినందుకు మంత్రి క్షమాపణ చెప్పాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దాంతో కాంట్రాక్టు సంస్థ ఇన్‌చార్జి కిరణ్‌రెడ్డి బాధిత రైతు ఉడిత రవి చేతులు పట్టుకొని.. తమ సంస్థ అధినేత చేసిన పొరపాటుకు తాను క్షమాపణ చెబుతున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ మాట్లాడుతూ.. న్యాయం చేయాలన్న రైతుపై మంత్రి దాడి చేయించి.. ఆ రైతు చిన్నాన్న మృతికి కారణమయ్యారన్నారు. అభివృద్ధి పేరిట రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుంటున్న ప్రభుత్వం మార్కెట్ ప్రకారంగా పరిహారం చెల్లించిన తర్వాత పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇంకా పరాయి పాలన కొనసాగుతున్నదన్న విషయాన్ని బస్వాపురం రైతుపై జరిగిన దాడి రుజువు చేస్తోందని తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీ కన్వీనర్ పాశం యాదగిరి అన్నారు. తెలంగాణ రైతుపై ఆంధ్రామంత్రి దాడి చేసి 24గంటలు గడిచినా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఖండించకపోవడం దురదృష్టకరమన్నారు. ధర్నా అనంతరం భువనగిరి ఆర్డీవో భూపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నర్సింహా తదితరులు పాల్గొన్నారు.