Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందనిద్రాక్షలా నాణ్యమైన చదువు
- సర్కారు బడుల్లో మౌలిక వసతుల కొరత
- వెక్కిరిస్తున్న ఉపాధ్యాయ ఖాళీలు
- 6.76 శాతం నిధులు కేటాయించిన టీఆర్‌ఎస్ సర్కారు
- మోడల్ విద్యను అందిస్తున్న ఢిల్లీ ప్రభుత్వం
- విద్యారంగానికి ఏకంగా 26 శాతం ఖర్చు
- వైద్యరంగానికీ పెద్దపీట వేస్తున్న ఆప్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఢిల్లీలో విద్యా,వైద్య రంగాలకు ఆప్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. మౌలిక సదుపాయాలు కల్పించడం, అవసరమైన నిధులు కేటాయించడం, పర్యవేక్షణ మెరుగుపర్చడం, ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయడం వల్ల ఢిల్లీలో విద్యాభివృద్ధి దేశానికే తలమానికంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.60 వేల కోట్లతో ఢిల్లీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో విద్యారంగానికి రూ.15,601 (26 శాతం) కోట్లు కేటాయించింది. ఇక వైద్యరంగానికి రూ.7,485 (12.47 శాతం) నిధులు ప్రతిపాదించింది. విద్యావైద్య రంగాలకే బడ్జెట్‌లో 38.47 శాతం నిధులు కేటాయించారు. అంటే మాటల్లో కాకుండా చేతల్లో అభివృద్ధి చేసి చూపడంలో ఆప్ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది. అందుకే అక్కడి ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లను తలపిస్తున్నాయి. ఇక సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆక్స్‌ఫర్డ్‌లో విద్యనభ్యసించిన ఆతిషి మారలెనాను విద్యారంగ సలహాదారుగా నియమించింది. హ్యాపినెస్ అంశాల బోధనను ప్రవేశపెట్టింది. 8 వేల తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీలు, ఆప్ ప్రతినిధులు విద్యాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. దీంతో ఢిల్లీలో విద్యారంగంలో మార్పులు చోటుచేసుకున్నాయి. సర్కారు బడుల్లో సీబీఎస్‌ఈ ఫలితాల్లో ఉత్తీర్ణత 91 శాతం ఉంటే, ప్రయివేటు పాఠశాలల్లో 83 శాతమే నమోదు కావడం గమనార్హం. ఇది ఢిల్లీ ప్రజలపై బలమైన ముద్ర వేసింది. అందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ హ్యాట్రిక్ విజయం సాధించడానికి దోహదపడింది.
ఏటా తగ్గుతున్న విద్యారంగ కేటాయింపులు
తెలంగాణలో ప్రభుత్వ విద్యారంగం పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. విద్యారంగానికి కేటాయిం పులు ఏటా తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఇంకోవైపు సర్కారు బడుల్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉన్నది. ఇక ఉపాధ్యాయ ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. 20 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుస్తున్నది. నాణ్యమైన విద్య అందడం లేదని అనేక సర్వేలు, స్వచ్చంధ సంస్థల నివేదికలు బహిర్గతం చేస్తున్నాయి. అన్ని రంగాల్లో ముందున్న తెలంగాణ, అక్షరాస్యతలో మాత్రం వెనుకంజలో ఉన్నామనీ సాక్షాత్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అక్షరాస్యత పెంపు, విద్యాప్రగతికి సరిపోయినన్ని నిధులు మాత్రం కేటాయిం చడం లేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చి ఆరేండ్లయినా విద్యావిధానం ప్రకటించకపోవడం గమనార్హం. కేజీ టు పీజీ ఉచిత విద్య అని ప్రకటించినా అది గురుకుల విద్యాలయాలకే పరిమితమైంది. ప్రస్తుత బడ్జెట్‌లో విద్యారంగానికి 6.76 శాతం నిధులు మాత్రమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేటాయించింది. మొత్తం రూ.1,46,492 కోట్ల బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం రూ.9,899.79 (6.76 శాతం) కోట్లే ప్రతిపాదించింది. ఇక 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.1,74,453 కోట్ల బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.13,278 (7.61 శాతం) కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాదిలో రూ.2,923.72 కోట్లు తగ్గించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో రూ.1,00,637 కోట్లకుగాను విద్యారంగానికి రూ.10,956 (10.88 శాతం) కోట్లు కేటాయించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత బడ్జెట్‌లో 4.12 శాతం నిధులకు కోత విధించింది. ఇలాగైతే విద్యాప్రగతి తెలంగాణలో ఎలా సాధ్యమవుతుం దన్న ప్రశ్న తలెత్తుతున్నది. విద్యాభివృద్ధి, నిధుల కేటాయింపు, అక్షరాస్యతలో దేశానికే కేరళ ఆదర్శంగా ఉన్నది. అటు ఢిల్లీ, ఇటు కేరళ ప్రభుత్వాలను ఆదర్శంగా తీసుకొని అధిక నిధులు కేటాయించి విద్యారంగాన్ని ప్రగతిబాట పట్టించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
వైద్యరంగంపై నిర్లక్ష్యం
వైద్యరంగం అభివృద్ధి పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. ప్రస్తుత బడ్జెట్‌లో వైద్యరంగానికి అరకొర నిధులు కేటాయించింది. 2019-20 బడ్జెట్‌లో వైద్యరంగానికి రూ.5,694.17 (3.89 శాతం) కోట్లు ప్రతిపాదించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.7,357 (4.21 శాతం) కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఇప్పుడు రూ.1,663 కోట్లు తగ్గించింది. 2014-15 బడ్జెట్‌లో వైద్యరంగానికి రూ.4,062 (4.04 శాతం) కోట్లు ప్రతిపాదించింది. బడ్జెట్ కేటాయింపుల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏటా నిధులు తగ్గిస్తున్నది. ఇంకోవైపు జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులను సూపర్‌స్పెషాలిటీ స్థాయికి ఆధునీకరిస్తామని ఇచ్చిన హామీ ఇంకా పట్టాలెక్కలేదు. అదే ఢిల్లీలో మొహల్లా క్లినిక్‌ల పేరుతో పేదలకు ఆధునిక వైద్యాన్ని అందించేందుకు ఆప్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్యరంగంలో మెరుగైన వసతులు కల్పించడం వల్లే ఆప్ ప్రభుత్వానికి ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తున్నది. అదే తరహాలో తెలంగాణలో వైద్యరంగానికి నిధులు పెంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతువులు మెరుగుపర్చాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.