Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పల్లె ప్రగతి విజయవంతం చేసే బాధ్యత పూర్తిగా జిల్లాల అదనపు కలెక్టర్లుపైనే ఉందనీ, సర్పంచ్, గ్రామకార్యదర్శి, ఎంపీవో, డీఎల్‌పీవో, డీపీవోలు కీలకంగా వ్యవహరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. శ్మశానవాటికల నిర్మాణం, డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతలు, నర్సరీలు, హరితహారం, ఉపాధిహామీ పథకంలో నిధుల వినియోగంపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. దాతల నుంచి విరాళాల సేకరణ, డ్రయినేజీ నిర్వహణ, వాల్టా చట్టం అమలు, జరిమానాలు విధింపు, నిధుల సమీకరణపై కేంద్రీకరించి పనిచేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 'తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం'పై అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లకు అవగాహన సదస్సు హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలో గురువారం జరిగింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ... దేశ చరిత్రలోగానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోగానీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఇంత ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడా లేదన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. కలెక్టర్లు, సర్పంచ్‌లు, గ్రామకార్యదర్శులు, ఎంపీవోలు, డీఎల్‌పీవోలు, డీపీవోలు బాగా శ్రద్ధతో పని చేసిన చోట పల్లె ప్రగతిలో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. శాఖను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అన్ని ఖాళీలను వేగంగా భర్తీ చేస్తున్నదనీ, 32 జిల్లా పంచాయతీ అధికారుల కార్యాలయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతీ రెవెన్యూ డివిజన్‌కు ఒక డీఎల్‌పీవో, ఎంపీవో పోస్టులను పెంచామన్నారు. రాష్ట్రంలోని 36 వేల మంది సఫాయి కర్మచారుల వేతనాలను రూ.8,500 రూపాయలకు పెంచామన్నారు. పంచాయతీలకు ప్రతీ నెల రూ.339 కోట్ల రూపాయలను ఇస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీలకు 2,714 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించిందనీ, నిధులకు ఢోకా లేదని అన్నారు. దేశానికే తలమానికంగా మిషన్ భగీరథ పథకాన్ని రూ.45 వేల కోట్ల రూపాయలతో పూర్తి చేసి అన్ని గ్రామాలకు శుద్ధమైన తాగునీటిని అందిస్తున్నామన్నారు. ఈ సదస్సులో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ అడిషనల్ డైరెక్టర్ బెనహార్ దత్ ఎక్కా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.రఘునందన్ రావు, స్పెషల్ కమిషనర్ సైదులు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొన్నారు.