Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బడ్జెట్‌లో కేటాయించిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. ఈ నిధులను ప్రత్యేక నోడల్ అధికారి ద్వారా ఖర్చు చేయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఎస్సీ, ఎస్టీ బడ్జెట్ మానిటరింగ్ తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో గురు వారం 'ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధికి నిధుల కేటాయింపు -ఖర్చులపై రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం' నిర్వహించా రు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు కేటా యించిన నిధులు ఖర్చు చేసి ఉంటే 50శాతం మంది దారిద్య్రరేఖ నుంచి ఎగువకు వెళ్లేవారన్నారు. రూ.1.80 లక్షల కోట్లు ఉన్న బడ్జెట్‌ను కేసీఆర్ ఆర్థిక మాంద్యం పేరుతో రూ.1.43 లక్షల కోట్లకు తగ్గించారనీ, మాంద్యం 2008 నుంచి వస్తున్నదనీ, ఇది సీఎంకు తెలియదా? అని ప్రశ్నించారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎస్సీ, ఎస్టీలకు 15శాతం వైద్యం ఉచితంగా అందించాలని ఉన్నా అలా జరగడం లేదన్నారు. అందు బాటులో ఉన్న భూమిని చూపిస్తాం దళితులకు పంపిణీ చేస్తావా అని ప్రశ్నించారు. 2.5 లక్షల డబుల్ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 60వేల ఇండ్లు మాత్రమే నిర్మాణానికి నోచుకున్నాయని గుర్తు చేశారు.
చట్టం అమలు కావడం లేదు :
విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాల్‌రావు
చట్టం వస్తే ప్రభుత్వాలకు బాధ్యత పెరుగుతుందనీ, ఆ చట్టాన్ని అమలు చేస్తాయనుకుంటే అదీ జరగడం లేదని విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాల్‌రావు అన్నారు. బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధుల్లో 40-50శాతం కూడా ఖర్చు చేయడం లేదన్నారు. ప్రజా ఉద్యమం, న్యాయ పోరా టాల ద్వారానే చట్టాలు అమలవుతాయని చెప్పారు. బడ్జెట్ కంటే ముందే చలో అసెంబ్లీ చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం నిర్వీర్యమైందనీ, అసెంబ్లీలో ప్రశ్నించేవారే కరువయ్యారని తెలిపారు. సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపుపై హైకోర్టులో పిల్ చేయాలని సూచించారు.
హిమాన్షు సీఎం అయినా మూడెకరాల
భూ పంపిణీ కాదు : స్కైలాబ్ బాబు
మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు సీఎం అయినా దళితులకు మూడెకరాల భూపంపిణీ జరగదని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు అన్నారు. దళితుడే సీఎం, మూడెకరాల భూమి పంపిణీ, సంక్షేమం కోసం ఏటా రూ.10వేల కోట్లు కేటాయిస్తాం లాంటి హామీలివ్వడంతో దళితులు కేసీఆర్ వైపు మొగ్గు చూపారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే దళితుడే సీఎం, నేను కాపలా కుక్కలా ఉంటా అన్న కేసీఆర్ నేడు సీఎం సీటులో కూర్చుంటే దళితులు కాపలాదార్లుగా మారారని విమర్శించారు. భూ పంపిణీ కోసం పోరాటం తప్పదనీ, ముందుగా ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడించాలని పిలుపునిచ్చారు.
సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయడం లేదు : భాస్కర్
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను వారి కోసం ఖర్చు చేయడం లేదని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కె.భాస్కర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తు న్నారని విమర్శించారు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో భూ పంపిణీ చేయడం లేదన్నారు. అధికారులందరూ కేసీఆర్ జీతగాళ్లని, అందుకే ఎవరూ ఎదిరించడం లేదన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై సర్కార్ నిర్లక్ష్యం : నాగేశ్వరరావు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై టీఆర్‌ఎస్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తున్నదని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు అన్నారు. ఊకడదంపుడు ఉపస్యాసాలే తప్ప కేసీఆర్ వీరికి చేసిందేమీ లేదని గుర్తు చేశారు. సంక్షేమ హాస్టళ్ల పరిస్థతి దారుణంగా తయారైందన్నారు.
చట్టాల అమలు కోసం పోరాటం చేయాలి : ఝాన్సీ
చట్టాల అమలు కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు ఝాన్నీ అన్నారు. చట్టం అమలులో టీఆర్‌ఎస్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తున్నదన్నారు. బడ్జెట్ కేటాయింపులో 50శాతం నిధులను భూముల కొనుగోలుకు ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.