Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు
- రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ- కొత్తగూడెం
కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికుల శ్రమను దోచుకోవాలని చూస్తే ఊరుకోబోమని, పాలనను స్తంభింపచేసి చట్టాలను పరిరక్షించుకుంటామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబా, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్, ఇఫ్ట్టూ సంఘాల ఖమ్మం జిల్లా నాయకులు పి.సంజీవ్, ఎల్.విశ్వనాధం, హెచ్‌ఎంఎస్ నాయకులు బివి.రమణారావు అన్నారు. కార్మిక చట్టాల రద్దు, పనిగంటల పెంపును నిరసిస్తూ సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, ఇఫ్టూ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు నిరసన తెలిపారు. అన్ని రంగాల కార్మికులు తమ హక్కుల రక్షణ కోసం నినదించారు.
భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్‌లో అన్ని సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎం. సాయిబాబు, ఇతర నాయకులు మాట్లాడుతూ కార్మిక చట్టాల రద్దు, సవరణ ప్రధాన ఉద్దేశం కార్మికుల హక్కులు లేకుండా చేయడమేనని అన్నారు. కొత్త దోపిడీ పద్ధతులకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతూ కార్మికులను బానిసలుగా చేసే చర్యలకు పాల్పడుతోందనీ, కరోనా పేరుతో కార్మికుల శ్రమను పెట్టుబడి దారులకు దోచిపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుందని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో లక్షలాది పరిశ్రమలు ఇప్పటికే మూతపడగా విదేశీ సంస్థలను దేశంలోకి తీసుకొచ్చేందుకు కార్మిక చట్టాలు రద్దు చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమైందన్నారు. కేంద్రం బాటలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పయనిస్తుందని విమర్శించారు. కరోనా సాకుతో పరిశ్రమల్లో చట్టాల అమలుకు నిరాకరిస్తున్న యాజమాన్యాలకు సహకరిస్తోందని విమర్శించారు. కార్మిక చట్టాల సవరణ, కుదింపు, పని, వేతన భద్రత, పనిగంటల పెంపు వంటి ప్రధాన సమస్యలను కార్మికులు సంఘటిత ఉద్యమాలతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు మందా నర్సింహారావు, బి.మధు, సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, నాయకులు యర్రగాని కష్ణయ్య, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో పలుచోట్ల ప్లకార్డులతో నిరసన తెలిపారు. మణుగూరులో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. పాల్వంచలో కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్‌లో విద్యుత్ కార్మిక సంఘాల నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా, మండల కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలు తీశారు. కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.