Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాట్సాప్.. ఈ పేరుతో పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ రోజులో కనీసం పదుల సంఖ్యలో వాట్సాప్‌ను చూస్తూనే ఉంటారు. బంధువులకు, స్నేహితులకు ఫొటోలు, వీడియోలు పంపడానికి, వచ్చిన వాటిని చూడడానికి, లేదా చాటింగ్ కోసం ఇలా ఏదోక దాని కోసం ఉపయోగిస్తూనే ఉంటాం. అయితే ఈ మధ్య కొన్ని రకాల మెసేజ్‌లు పంపిస్తే వాట్సాప్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని సాంకేతిక నిపుణుడు కనుగొన్నాడు.
- సాధారణంగా అందరికీ తెలిసిన విషయం.. వాట్సాప్ అంటే ప్రైవసీకి, సెక్యూరిటీకి పెట్టింది పేరు. అయితే వాట్సాప్‌లో ఈ మధ్య ఓ సెక్యూరిటీ సమస్య ఏర్పడింది. అదే జిఫ్ ఫైల్స్ ద్వారా ఫోన్‌లు హ్యాక్ అవ్వడం.
- ఈ బగ్ ద్వారా హ్యాకర్లు ఫోన్‌లలోని వాట్సాప్ చాట్‌లను చూడటం, ఫైల్స్‌ను చోరీ చేసే వీలు ఏర్పడుతుందని ఆ నిపుణుడు తెలిపారు. అయితే అన్ని రకాల జిఫ్ ఫైల్స్ ద్వారా సమస్య ఏర్పడదు.
- డబుల్-ఫ్రీ వల్నరబులిటీ అనే మాల్‌వేర్ ద్వారా మాత్రమే ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ యాప్ ద్వారా సష్టించిన జిఫ్‌పై క్లిక్ చేసినప్పుడు ఈ మాల్‌వేర్ ఫోన్‌లోకి వస్తుంది. ఇది ప్రధానంగా ఆండ్రాయిడ్ 8.1, ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టంలతో నడిచే ఫోన్లపై మాత్రమే ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
- మిగతా వెర్షన్‌లున్న ఫోన్లపై దీని ప్రభావం తక్కువగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే పాత వర్షెన్ ఉన్న ఫోన్‌ల వినియోగదారులు ప్రభావం చూపించదు అని అలసత్వం ప్రదర్శించకూడదని, వారి ఫోన్‌లకూ ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే ఈ తరహా సమస్య తలెత్తిందని తెలియగానే, వాట్సాప్ వెంటనే ఈ సమస్యను పరిష్కరించింది.
- కానీ వినియోగదారులు ఇకపై దీని బారిన పడకుండా ఉండాలంటే వాట్సాప్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సంస్థ సూచించింది. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయమై వాట్సాప్ అధికారులను సంప్రదించినప్పుడు ఎంతమంది ఈ సమస్యను ఎదుర్కొన్నారన్న విషయం వారికి కూడా తెలియదన్నారు. ఒకవేళ ఇబ్బందులు పడితే ఫిర్యాదులు అందేవనని, ప్రస్తుతానికి ఇలాంటివేమీ లేవని, అయినప్పటికీ వినియోగదారులు భద్రతను పాటించాలని వెల్లడించింది.
- వినియోగదారులు ఇలాంటి వైరస్‌ల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని సూచించింది. అందుకు చేయాల్సినది..
- ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్ ఏదైనాసరే ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలి.
- ప్రతి నెలా వచ్చే సెక్యూరిటీ ప్యాచ్ అప్ డేట్ చేయాలి.
- తెలియని వ్యక్తులు, నంబర్ల నుంచి వచ్చే మెయిల్స్ కానీ, మెసేజ్‌లలో కానీ అనుమానాస్పద లింకులు ఏవైనా ఉంటే వాటిని అస్సలు క్లిక్ చేయకూడదు.
- ఏ యాప్‌నైనా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే లింక్‌ల నుంచి కాకుండా గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌లను అస్సలు ఇన్ స్టాల్ చేయకూడదు.
వాట్సాప్ ఇలాంటి వైరస్‌లు యాప్‌ను ప్రభావితం చేయకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.