షావోమీ రెడ్‌మీ నోట్ 8, 8 ప్రోలను లాంచ్ చేసిన సందర్భంలోనే మన దేశంలో ఎంఐయూఐ 11ను కూడా అందిస్తున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు ఏయే ఫోన్‌లకు ఈ అప్‌డేట్ వర్తించనుందో తెలిపింది. దీనికోసం వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే అన్ని ఫోన్‌లకు ఒకేసారి కాకుండా విడతలవారీగా అందించనుంది. మొదటి విడతను ఈ నెల 22 నుంచి 31 వరకు రానుంది. ఇందులో పోకో ఎఫ్1, రెడ్ మీ కే20, రెడ్ మీ వై3, రెడ్ మీ 7, నోట్ 7, నోట్ 7ఎస్, నోట్ 7 ప్రోలున్నాయి. రెండో విడతను నవంబర్ 4 నుంచి నవంబర్ 12 వరకు అందించనుంది. అందులో రెడ్ మీ కే20 ప్రో, రెడ్ మీ 6, 6 ప్రో, 6ఏ, రెడ్ మీ 5, 5ఏ, నోట్ 5, 5 ప్రో, రెడ్ మీ నోట్ 4, రెడ్ మీ 4, రెడ్ మీ వై1, వై1 లైట్, వై2, ఎంఐ మిక్స్ 2, ఎంఐ మ్యాక్స్ 2లు ఉన్నాయి. మూడో విడతను నవంబర్ 13 నుంచి 29 వరకు రానుంది. ఇందులో రెడ్ మీ నోట్ 6 ప్రో, రెడ్ మీ 7ఏ, రెడ్ మీ 8, రెడ్ మీ 8ఏ, రెడ్ మీ నోట్ 8లు అందుకోనున్నాయి. నాలుగో విడతను కేవలం రెడ్ మీ నోట్ 8 ప్రోకి మాత్రమే డిసెంబర్ 18 నుంచి 26 మధ్య అందించనుంది. అయితే టెస్టింగ్ ప్రణాళికను బట్టి తేదీలు మారే అవకాశం ఉంది. ఏదిఏమైనా ఎంఐయూఐ 11లో ఎంఐ ఫైల్ షేరింగ్ ట్రాన్స్ ఫర్, డిజిటల్ వెల్ బీయింగ్, క్విక్ రిప్లైస్, పవర్ సేవింగ్ మోడ్, ఎంఐ వర్క్ అనే కొత్త ఫీచర్లతో చాలా ఫీచర్లు రానున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కావాలంటే కాస్త ఆగాల్సిందే..