ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆండ్రాయిడ్, కంప్యూటర్ తప్పనిసరి అయిపోయాయి. ఏ పని చేయాలన్నా వీటితోనే ముడిపడి ఉంటోంది. టెక్నాలజీ అంతలా మానవ జీవితాలలో భాగమై పోయింది. అయితే ఈ రెండింటినీ లింక్ చేస్తూ, మొబైల్‌తో పీసీని రిమోట్ ద్వారా కంట్రోల్ చేసే కొన్ని రకాల అప్లికేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో రిమోట్ మౌస్ ఒకటి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలకు ఈ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. https:// remotemouse.net/ అనే వెబ్‌సైట్ నుండి దీనికి సంబంధించిన సర్వర్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొదట పీసీలో ఇన్‌స్టాల్ చేసుకుని, తర్వాత ఫోన్‌లో దానికి సంబంధించిన క్లైంట్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇందులో ఫోన్, పీసీ ఒకే వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉంటే పీసీని నేరుగా మొబైల్ ఫోన్‌తో కంట్రోల్ చేసుకోవచ్చు. లెఫ్ట్, రైట్ క్లిక్, ఇతర ఆప్షన్లతో మీ కంప్యూటర్‌ను మొబైల్ ఫోన్‌తో ఈ అప్లికేషన్ ద్వారా నియంత్రించుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో బాగా పాపులర్ అయిన అప్లికేషన్ ఇది. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంను కూడా దీని ద్వారా కంట్రోల్ చేయవచ్చు. దీని పరిమాణం కేవలం 2ఎంబీలోనే ఉంటుంది. ఇందులో కీబోర్డ్, మౌస్, గేమ్‌ప్యాడ్ వంటి అనేక రకాల ఆప్షన్స్ లభిస్తాయి. ఇందులో పెయిడ్, ఫ్రీ వెర్షన్లు లభిస్తాయి. పెయిడ్ యాప్‌లో వాయిస్ కమాండ్స్, అలాగే అప్లికేషన్ కష్టమైజ్ చేసు కునే వెసులుబాటు, 90కి పైగా రిమోట్‌లతో పాటు అనేక అదనపు సదుపాయాలు లభిస్తాయి.