టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఒక్క చోట ఉండిపోయిందేమో అని అనిపించేలా చేశాయి స్మార్ట్‌ఫోన్‌లు.. మారుతున్న కాలంతో పాటు వ్యక్తుల ఆలోచనా విధానం మారుతూ వస్తోంది. ఏదైనా భావాన్ని వ్యక్తీకరించాలంటే అక్షరాలు టైప్ చేయడం కష్టమని భావించే స్థితికి చేరుకున్నారు. అలా వ్యక్తపరచాలనుకున్న భావానికి ప్రతిగా సింబల్స్‌ను పంపిస్తున్నారు. వాటితోనే అవతలి వారి భావాన్ని వెత్తుక్కోవాల్సిన పరిస్థితులు ఇపుడు సర్వసాధారణమయిపోయాయి. అసలు ఈ సింబల్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి.. వీటి వల్ల ఏర్పడే ప్రభావాల గురించి తెలుసుకుందాం..
ప్రపంచంలోని వ్యక్తులందరికీ అర్థమయ్యే భాష కనుగొనడం కష్టమే. అందుకే ప్రస్తుతం అందరికీ అర్థమయ్యేలా భావ వ్యక్తీకరణకు గుర్తులను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌తో పాటు సోషల్ మీడియాలో అపుడపుడు ఇలాంటి సింబల్స్ ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాం.. నవ్వు, ఏడుపు, కోపం, బాధ, సంతోషం, విచారం, అభినందనలు, ధన్యవాదాలు... ఇలా అనేక రకాల సింబల్స్ చాటింగ్‌లో వస్తూ ఉంటాయి. వాటినే ఎమోజీలు అంటారు. అయితే ఈ పదం తెలియకుండానే వాటిని పంపించే వారు చాలా మందే ఉన్నారు. అయితే ఎమోజీలు అందరికీ అర్థమయ్యే భాషగా, భాషావంతరాలను దాటిందనే చెప్పవచ్చు. అప్పటి పరిస్థితిలోని స్పందనకు ప్రతిగా భావాన్ని వ్యక్తీకరించేలా ఈ సింబల్స్ ఉపయోగిస్తుంటారు. అంతేకాదు ఇవి సమాచారాన్ని చాలా సూక్ష్మరూపంలో సులువుగా పంపేందుకు బాగానే ఉపయోగపడుతున్నాయి. దాదాపు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరూ ఏదో ఒక సందర్భంలో వీటిని ఉపయోగిస్తూనే ఉంటారు. పంపించే ఈ విధమైన సందేశాల ద్వారా రానురాను భాషను మర్చిపోతారేమో అనిపించేలా ఉపయోగించేవారు లేకపోలేదు. ఏదిఏమైనా ఎమోజీలు వచ్చాక స్పందనను చాలా సూటిగా స్పష్టంగా చెప్పే వీలవుతోందని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. అలా అని ప్రతి భావాన్ని వ్యక్తపరచగలమని మాత్రం కాదు. కానీ అక్షరాల కంటే ఇవే ఎక్కువగా క్లిక్ అయ్యాయి. అంతేకాదు.. ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఎమోజీలను తీసుకువస్తున్నాయి. ఫోన్‌లో వివిధ రకాలైన ఎమోజీలు వందల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. కావాల్సిన ఎమోజీ ఎక్కడ ఉందా అని వెతుక్వోవాల్సిన పని కూడా లేదు. సెర్చ్ బటన్‌లో సందర్భాన్ని టైప్ చేస్తే అందుకు ఉపయోగించే ఎమోజీలు దర్శనమిస్తాయి. అందులో పంపాలనుకునే దాన్ని పంపించేసుకోవచ్చు.
4 దశాబ్దాల క్రితమే : 1980ల దశకం ప్రారం భంలోనే ఎమోట్ ఐకాన్‌లు అందు బాటులోకి వచ్చాయి. కాకుంటే అపుడున్న టెక్నాలజీ పరంగా కేవలం కీబోర్డు ఆధారంగా బాధ కోపం వంటి వాటిని టైప్‌చేసే వెసులుబాటు వచ్చింది. అందులో ఎక్కువగా ఉపయోగించి నవి.. :) :( :-/ మాత్రమే.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత డొకొమో టెలికాం నెట్‌వర్క్ ఎమోజీలను సింబల్స్ రూపంలో తీసుకువచ్చింది. తర్వాత ఈ పద్ధతి అన్ని రకాల మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో, డెస్క్‌టాప్‌లలోనూ అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ సమయంలో భావాన్ని టైప్ చేస్తే అందుకు తగిన గుర్తు వచ్చేది. అయితే పురాతన కాలంలో మొబైల్ ఫోన్‌లు కాదు కదా కనీసం కరెంట్ కూడా లేని కాలంలోనే ఎవరికైనా ఏదైనా రహస్యంగా సందేశం పంపాలనుకుంటే గుర్తుల రూపంలో విషయం చెప్పేవారు. అంతేకాదు మార్గ మధ్యంలో తర్వాతి వారికి సంబంధిత ప్రదేశాల గురించి గానీ, అక్కడ నుంచి వేరే చోటుకు చేరే మార్గం లాంటివి ఏవైనా చెప్పాలనుకున్నా ఇలా గుర్తులనే ఉపయోగించేవారు. అలాంటివే తర్వాతి వారికి మార్గనిర్దే శకాలుగా నిలిచేవి. అయితే ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. సాంకేతికత అభివృద్ధి చెందింది. ఎంత దూరంలో ఉన్న వారికైనా సరే కమ్యూనికేట్ అవ్వడం సులభమైపోయింది. అయినా ప్రస్తుతం వీటి వాడకం ఎక్కువగానే ఉంది.
సూటిగా : ఇద్దరు వేర్వేరు భాషల గల వ్యక్తులు మెసేజ్‌ల రూపంలో సంభాషించుకుంటుంటే.. చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పినా భావం సరిగా అర్థం కాకపోవచ్చు. ఇలాంటపుడే ఎమోజీలు ఉపయోగపడతాయి. చెప్పాలనుకున్నది ఎమోజీ రూపంలో చెప్తే సూటిగా అర్థమవుతుంది. అంతేకాదు... ఏదైనా విషయాన్ని చెప్పి చివర్లో స్మైలీ, శాడ్, యాంగ్రీ ఏదైనా గుర్తు చేరిస్తే కూడా చెప్పాలనుకున్న విషయం ఏ భావంతో చెప్పారో కూడా అర్థమవుతుంది. అంతేకాదు చెప్పాలనుకున్న భావానికి సరిపోయేలా అనేక రకాల ఎమోజీలు ప్రస్తుతం అందుబాటులోకి ఉంటున్నాయి. అంతేకాదు ఎప్పటికప్పుడు కొత్తవి వచ్చి చేరుతున్నాయ. అయితే సహజంగా అన్ని భాషల్లో కొన్ని నిషిద్ధ పదాలుంటాయి. అవి ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా మారిపోతుటాయి. అలాంటి పదాలను మొబైల్ అప్లికేషన్‌లు, సోషల్ మీడియా సర్వీసులు కూడా నిషేధిస్తూ ఉంటాయి. ఇందుకు ఎమోజీలు ఏమీ మినహాయంపు కాదు. ఉదాహరణకు ఇన్‌స్టాగ్రామ్‌లో వంకాయ, మిడిల్ ఫింగర్ ఆకారంలో ఉండే ఎమోజీలను నిషేధించారు.
భాషపై ప్రభావం : ఎమోజీల వినియోగం పెరిగిపోవడంతో భావవ్యక్తీకరణ సులభమైన మాట నిజమే. అయితే ఇది భాషపై ప్రభావం చూసిస్తుందేమోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఇందుకు కారణం అక్షరాల రూపంలో భావాన్ని ఆయా భాషల్లో వ్యక్తీకరించుకోలేకపోవడమే. కష్టపడి టైప్ చేయడం ఇబ్బందిగా భావించి చాలా మంది ఎమోజీలను వాడడం మొదలుపెట్టారు. అంతేకాదు ఎమోజీలు పూర్తి స్థాయిలో మనుషుల భావాలను వ్యక్తీకరించలేవు. అవసరానికి మించి అతిగా వాడినా వక్తుల మధ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ వ్యక్తికైనా ఎన్ని భాషలు భాషలు మాట్లాడగలిగినా.. భావాన్ని వ్యక్తీకరించాలంటే మాతృభాషలోనే సూటిగా స్పష్టంగా చెప్పగలరు. అలా అని టెక్నాలజీని ఉపయోగించుకోవద్దని కాదు.. అత్యవసర సందర్భాలు, త్వరగా రిప్లై ఇవ్వాల్సిన సందర్భాలలో తప్ప మిగిలిన సందర్భాలలో అక్షరాల ద్వారానే భావాన్ని వ్యక్తీకరిస్తే భాషను కాపాడుకోవడంతో పాటు వ్యక్తుల సంబంధాలు నిలుపుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Authorization