చంద్రయాన్-2 తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన మరో కీలక ప్రయోగం కార్టోశాట్-3. నవంబర్ 27 బుధవారం ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగం అసలు ఎందుకు చేశారు? ఏయే ఉపగ్రహాలను పంపించారు? ఎటువంటి ప్రయోజనాలు రానున్నాయో తెలుసుకుందాం..
చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి మెట్టుపై నిలిచిపోయినా, ఆర్బిటర్ మాత్రం కక్ష్య చుట్టూ తిరుగుతోంది. ఆ తర్వాత మళ్ళీ సైనిక భద్రత కోసం పీఎస్‌ఎల్వీ-సీ47 రాకెట్‌ను ఇస్రో ప్రయోగించింది. మన దేశానికి పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్ దేశాలతో 15 వేల కి.మీ. సుదీర్ఘ సరిహద్దు ఉంది. గతంలో చైనా, పాక్‌ల సైనికులు భారత్ భూభాగంలోకి చొచ్చుకు వచ్చారు. గతేడాది చోటు చేసుకున్న యూరీ ఉగ్రదాడి ఘటనే ఇందుకు నిదర్శనం. సరిహద్దుల్లో ఏం జరుగుతుందో భద్రతా దళాలకు సమాచారం అందడానికి వీలుగా.. ప్రత్యేకంగా శాటిలైట్ బ్యాండ్ విడ్త్‌ను కేటాయించాలని దేశ రక్షణ వ్యవస్థ భావిస్తోంది. అందులో భాగంగానే దేశాన్ని కాపాడుకునేందుకు ఈ శాటిలైట్‌ను ప్రయోగించింది. ఈ నేపథ్యంలోనే ఇమేజింగ్ వ్యవస్థలున్న కార్టోశాట్-3ని ప్రయోగించింది. గతంలో పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులకు సహకరించిన రీశాట్ శ్రేణికి మించిన సామర్థ్యం ఈ ఉపగ్రహాలకు ఉన్నట్లు ఇస్రో తెలిపింది. మూడో తరం ఉపగ్రహంగా భావిస్తున్న కార్టోశాట్-3 25 సెం.మీ. హై రిజల్యూషన్‌తో ఫోటోలను తీయగలదు. సైనిక, ఉగ్రవాద స్థావరాలను మరింత స్పష్టంగా చూపగలదు.
ఏమేం ఉన్నాయి : పీఎస్‌ఎల్వీ-సీ47 రాకెట్ 14 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. కార్టోశాట్-3తో పాటూ అమెరికాకు చెందిన ఉపగ్రహాలను.. పీఎస్‌ఎల్వీ-సీ47 నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్ట నుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కార్టోశాట్-3ని ఇస్రో రూపొం దించింది. దీని జీవితకాలం ఐదేళ్లు కాగా.. ఈ ఉపగ్రహం బరువు 1625 కిలోలు.. తయారీకి రూ.350కోట్లు ఖర్చు అయ్యింది. పీఎస్‌ఎల్వీ-సీ47 రాకెట్ ద్వారా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ల్యాంచింగ్ కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
ఎందుకు..? : ఈ ఉపగ్రహ సేవలు ఉపయోగించుకోవడం వల్ల సరిహద్దుల్లో పొరుగు దేశాలకు చెందిన సైనికులు ఎంత మంది మోహరించారు? వారి ఆయుధ సంపత్తి ఎంత? అనే విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. ఉగ్రవాదులు చొరబడకుండా సమర్థవంతంగా తిప్పికొట్టవచ్చు. ఇప్పటివరకు సరిహద్దుల నిఘా, సమాచారం కోసం ఐబీ, రా వంటి నిఘా సంస్థలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాం. లడఖ్, సిక్కిం లాంటి ప్రాంతాల్లో సమాచారం చేరవేయడం కష్టం. అయితే శాటిలైట్ సేవలను ఉపయోగించుకుంటే.. శత్రువు ఏం చేస్తున్నాడో నిత్యం తెలుసు కోవచ్చు. మారుమూల ప్రాంతాల్లోనూ సమాచారాన్ని అందించొచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలపై బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్బీ అధికారులు ఇస్రో అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు.
వ్యత్యాసం : ఇప్పటికే మన నేవీ ప్రత్యేకంగా జీ-శాట్ 7 అనే ఉపగ్రహ సేవలను ఉపయోగించుకుంటోంది. ఇది హిందు మహాసముద్ర జలాల్లో 2వేల నాటికల్ మైళ్ల దూరాన్ని జల్లెడ పడుతోంది. మిలిటరీ నిఘా కోసం ఇటీవలే ప్రయోగించిన కార్టోశాట్-2 సిరీస్ కు చెందిన ఉపగ్రహాన్నీ ప్రయోగించారు. ఇది ఒక మీటరు కంటే తక్కువ రిజల్యూషన్‌తో చిత్రాలను తీసి పంపగలదు. సరిహద్దుల్లో నిఘా కోసం ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలు, రాత్రి వేళల్లోనూ చూడగలిగే థర్మల్ ఇమేజర్లు, నిఘా రాడార్లు, ఉనికిని గుర్తించే గ్రౌండ్ సెన్సార్లు, శక్తివంతమైన టెలీ స్కోపులను కూడా హోంశాఖ భద్రతా దళాలకు సమకూరుస్తోంది. అయితే ఐదేళ్ల కాల పరిమితితో రూపొందించిన కార్టోశాట్-3 దేశంలోకి చొరబడే ఉగ్రవాదులను పసిగట్టడంతో పాటు వారి కదలికలు, స్థావరాలపై ఓ కన్నేసి ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారం అందిస్తూ నిఘా నేత్రంలా పనిచేస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, తీర ప్రాంత వినియోగం గురించి కూడా ఇది సమాచారం అందజేస్తుంది. సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఇమేజింగ్ వ్యవస్థలున్న ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిం చారు. మూడో తరం ఉపగ్రహంగా భావిస్తున్న కార్టోశాట్-3 25 సెం.మీ. హై రిజల్యూషన్‌తో ఫోటోలను తీయగలదు. సైనిక, ఉగ్రవాద స్థావరాలను మరింత స్పష్టంగా చూపగలదు. రీశాట్ శ్రేణికి మించిన సామర్థ్యం ఈ ఉపగ్రహానికి ఉంది.
విజయవంతంగా కక్ష్యల్లోకి : పీఎస్‌ఎల్వీ బయలుదేరిన 166 సెకెన్ల లో తొలి దశ, 266 సెకెన్లలో రెండో దశ, ఎనిమిది నిమిషాల్లో మూడో దశను దాటుకుని చివరిదైన నాలుగో దశను విజయవం తంగా పూర్తి చేసింది. నిర్దేశిత కక్ష్యలోకి రాకెట్ చేరిన తర్వాత ఉపగ్రహాలు రాకెట్ నుంచి విడిపోయి నిర్దేశిత కక్ష్యలో చేరాయి. తర్వాత లాంచింగ్ కేంద్రం నుంచి బయలుదేరిన 26.51 నిమి షాల్లో కార్టోశాట్‌ను నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశ పెట్టారు. ప్రయోగం విజయవంతమైన తర్వాత కార్టోశాట్-3 నుంచి అంటార్కిటికాలోని ఇస్రో కేంద్రానికి సంకేతాలు అందుతాయి.
అనుబంధంగా : రీశాట్-2బీఆర్1, రీశాట్-2బీఆర్2 లను పీఎస్‌ఎల్వీ-సీ48, సీ49 ద్వారా డిసెంబరులో నింగిలోకి పంపనున్నారు. ఈ ఏడాదిలో మేలో రీశాట్-2బీ, ఏప్రిల్ 1న ఎలక్ట్రానిక్స్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ (ఎమిశాట్)ను ఇస్రో ప్రయోగించింది. ఈ ఉపగ్రహాలు శత్రు రాడార్ల కదలికలపై స్పష్టమైన సమాచారం చేరవేస్తాయి. ఇస్రో చరిత్రలో ఒకే ఏడాది ప్రయోగించిన అన్ని ఉపగ్రహాలు సైనిక ప్రయోజనం కోసం ఉద్దేశించినవి కావడం విశేషం. రీశాట్2బీఆర్1తో పాటు జపాన్‌కు చెందిన క్యూపీఎస్-ఎస్‌ఏఆర్ మైక్రోశాటిలైట్, పీఎస్‌ఎల్వీ-సీ48 ద్వారా, రీశాట్-2బీఆర్2తోపాటు లగ్జెంబర్ సంస్థ క్లేయిస్ స్పేస్ అభివద్ధి చేసిన నాలుగు ఉపగ్రహాలను నింగిలోకి పంపుతారు.
Authorization