ప్రస్తుత రోజుల్లో ప్రతి విషయంలో అందరూ ఆలోచించేది ఏ పనైనా త్వరగా పూర్తవ్వాలని.. బిల్ పేమెంట్స్, బ్యాంక్ ట్రాన్‌శాక్షన్‌లు ఏవైనా సరే.. అన్నీ త్వరగానే పూర్తవ్వాలని కోరుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌ల విషయంలోనూ అదే ఆలోచనలో ఉన్నారు. వస్తున్న ఆధునిక సాంకేతిక ఈ తరహాలోనే ఉంటోంది. ఫోన్ చేతిలో లేకపోతే.. క్షణం గడవదు అన్నట్టు ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. ఫోన్ చార్జింగ్ కోసం గంటలు గంటలు వేచి ఉండాల్సి వస్తుంది. త్వరగా చార్జింగ్ పూర్తయ్యేలా ఉంటే సమయం కలిసొస్తుందని వినియోగదారులు భావిస్తున్నట్టే.. కంపెనీలు సైతం ఈ తరహాలోనే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. అందుకు తగ్గట్టే బ్యాటరీల సామర్థ్యమూ పెరుగుతూ వస్తోంది. చార్జింగ్ పెట్టే సమయమూ తగ్గుతూ వస్తోంది. 35 నిమిషాల్లో పూర్తి చార్జింగ్, 17 నిమిషాల్లో పూర్తి చార్జింగ్ అంటూ ఈ మధ్య రియల్ మీ, రెడ్ మీ పోటాపోటీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రియల్ మీ విడుదల చేసిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్2 ప్రోతో 50ఔ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టెక్నాలజీ సాయంతో మీ ఫోన్ 35 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. ఇదే బాటలో ఒప్పో రెనో ఏస్ స్మార్ట్‌ఫోన్‌తో తో 65ఔ ఫాస్ట్ చార్జింగ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని దాటి రెడ్‌మీ 100w ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ప్రదర్శించింది. ఈ టెక్నాలజీ ద్వారా కేవలం 17 నిమిషాల్లోనే 4000 ఎంఏహెచ్ బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవుతుంది. వివో కూడా 120w ఫాస్ట్‌చార్జింగ్ టెక్నాలజీపై ఎప్పట్నుంచో కసరత్తు చేస్తోంది. వీటన్నింటినీ దాటుకుని ఒక్క నిమిషంలోనే మీ స్మార్ట్‌ఫోన్‌కు 80శాతం చార్జింగ్‌ను అందించే టెక్నాలజీపై చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హువాంగ్ యున్ హురు పని చేస్తున్నారు. ఈ టెక్నాలజీని పెకింగ్ యూనివర్సిటీలో జరిగిన గ్లోబల్ అల్యూమ్నీ ఫోరంలో ప్రదర్శించారు. అయితే ఈ టెక్నాలజీ మొట్టమొదట ఏ కంపెనీకి అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.