Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజకీయ పార్టీలు, ఇచ్చిన హామీలపై ప్రజలకు నమ్మకం చెరిగిపోతున్నది. ప్రతి ఎన్నికల్లో కేవలం ఓట్లు వేసే వారిగా మిగిలిపోతున్న బాధిత వర్గాలు కేవలం వినతిపత్రాలు సమర్పించి అమలు కోసం ఎదురుచూసే దుస్థితి నుంచి బయటపడాలని ఆశిస్తున్నాయి. గతంలో నల్లగొండ పార్లమెంటు ఎన్నికల్లో జలసాధన సమితి, ఇటీవల కాలంలో నిజామాబాద్ పసుపు రైతులు మూకుమ్మడిగా బరిలో దిగిన సంగతి తెలిసిందే. గెలుపోటములు పక్కన పెడితే కనీసం తమ సమస్యలు ప్రధాన ఎజెండాగా మారి కొంత ఉపశమనం అయినా దొరుకుతుందనే ఆశ ఆయా వర్గాల్లో నెలకొన్నది. తాజాగా నర్సులు కూడా పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఎన్‌ఓఏ), ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీఎన్‌ఏఐ), తెలంగాణ నర్సింగ్ సమితి (టీఎన్‌ఎస్) తరపున ఆయా సంఘాలు తమ అభ్యర్థులను త్వరలో జరగబోయే పట్టభద్రుల నియోజకవర్గాల పోటీల్లో నిలపబోతున్నారు. రెండింటిలో 80 వేల మంది వరకు నర్సింగ్ గ్రాడ్యుయేట్లు ఉంటారని భావిస్తుండగా, తొలిసారిగా పోటీ చేస్తున్న వారు ఏ మేరకు ప్రభావితం చేయగలుగుతారనేది వేచి చూడాలి.
- కొత్తూరు ప్రియకుమార్