Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది హైదరాబాద్ లోని రైల్వే వైద్యశాల. అక్కడికి బెజవాడ నుంచి ఒక యువకుడు పొద్దున్నే వచ్చాడు. జనరల్ అవుట్ పేషెంట్ విభాగంలో ఓ గంటసేపు నిలుచున్నాడు. తన వంతు రాగానే కాగితాలన్నీ తీసుకుని... వైద్యుడి వద్దకు వెళ్లాడు. వాటన్నింటినీ పరిశీలించి చూసిన డాక్టరుగారు... ఇది తన పరిధిలోకి రాదనీ, అందువల్ల గురువారం వచ్చి, ప్రత్యేక నిపుణుడి వద్ద చూయించుకోవాలంటూ సలహాఇచ్చారు. దీంతో ఉస్సూరుమంటూ చెట్టుకింద కూలబడ్డ ఆ యువకుడు... దీనంగా ముఖం వేలాడేసుకుంటూ ఇంటిదారి పట్టాడు. మూడు రోజులపాటు వేచి చూసిన అతడు... మళ్లీ గురువారం వచ్చి ప్రత్యేక వైద్యుడికి తన ఆరోగ్య సమస్యను వివరించాడు. అతడిని నింపాదిగా పరిశీలించిన సూపర్ స్పెషలిస్టు... సంబంధిత వ్యాధికి చికిత్సగానీ, అందుకవసరమైన పరీక్షా యంత్రాలు గానీ తమ వద్ద లేవని తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. అందువల్ల ఫలానా ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నానంటూ నగరంలోని ఓ పెద్ద కార్పొరేట్ ఆస్పత్రికి లెటర్ రాసి పంపారు. ఆ తర్వాత సదరు యువకుడు అద్దాలతో తళుకులీనుతున్న ఆ కార్పొరేట్ ఆస్పత్రి బాటపట్టాడు. ఇంత వరకూ బాగానే ఉన్నా... హైదరాబాద్‌లో అంత పెద్ద రైల్వే ఆస్పత్రిని నిర్మించి, దాని నిర్వహణ, మరమ్మతుల కోసం ఏటా కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం... అదే ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులు, సూపర్ స్పెషలిస్టులను ఎందుకు నియమించటం లేదు? వ్యాధి నిర్దారణ పరీక్షల మిషన్లను ఎందుకు కొనటం లేదనేది అర్థంగాని ప్రశ్నగా మిగిలిపోయింది. సూపర్ స్పెషలిస్టులు లేకపోవటం వల్ల రైల్వే ఉద్యోగుల వైద్యం కోసం కొన్ని వందల కోట్లను ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల కోసం ధారపోస్తున్నారని తెలిసింది. అంటే ట్రీట్‌మెంట్ నిర్వహణ ఖర్చును భరిస్తా.. కానీ నిర్వహణ బాధ్యతను మాత్రం నేను భుజానికెత్తుకోననే విధంగా సర్కారు వ్యవహరిస్తున్నదన్నమాట. ఇలాంటి ప్రభుత్వ విధానం వల్ల పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల పంట పండుతున్నది. ఈ అంశంపై రైల్వే ఆస్పత్రిలోనే పని చేస్తున్న మరో డాక్టర్ సాబ్‌ను అడగ్గా... 'అన్నో... ఈ కథని నువ్విప్పుడు జూస్తున్నవ్... గత పదేండ్ల నుంచి ఇదే కథ ఇక్కడ నడుస్తున్నది... మా దగ్గర గతంలో సూపర్ స్పెషలిస్టులందరూ ఉండేవారు. వాళ్లు రిటైరైన తర్వాత ఆ పోస్టుల్ని భర్తీ జెయ్యట్లే. దాంతో వచ్చిన రోగుల్ని వచ్చినట్టు కార్పొరేట్‌కు పంపుతున్నరు... మిషన్లను కూడా కొత్తయి కొనక చానా ఏండ్లయింది...' అంటూ అసలు విషయాన్ని బైటపెట్టారు.
- బి.వి.యన్.పద్మరాజు