Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ప్రతీ సంవత్సరం మే 12వ తేదీన 'అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని' నిర్వహించుకుంటాము. 12.5.1820న ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో జన్మించింది. 1853న లండన్‌లోని ఓ స్త్రీల ఆస్పత్రిలో సూపరిండెంట్‌గా చేరింది. 1854లో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవలు చేయడానికి నర్సుల బృందాన్ని వెంటబెట్టుకొని వెళ్ళింది. ఆమె సేవలు నర్సుల వృత్తికి మార్గదర్శక మైనాయని చెబుతూ చేతిలో వెలిగించిన లాంతరు పట్టుకునే ఒక స్త్రీ బొమ్మను నర్సుకు ప్రతీకగా పేర్కొంటున్నాయి చరిత్ర గ్రంథాలు. 1859లో 'నోట్స్ ఆన్ నర్సింగ్' అనే పుస్తకాన్ని ప్రచురించింది నైటింగేల్. ప్రపంచంలోనే మొదటి నర్సుల శిక్షణ కాలేజీని స్థాపించింది. ఈమెకు 'లేడీ విత్ ద లాంప్' అనే బిరుదును ప్రదానం చేశారు. ఈమె 13.8.1910న మరణించింది. 'ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్'వారు 1965 నుండి నైటింగేల్ జన్మదినమైన మే 12న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ''యూనిసెస్'' అనే బ్రిటన్‌లోని ఒక ప్రయివేటు సంస్థవారు ఈ దినోత్సవాన్ని మే 21వ తేదీన నిర్వహించాలని కోరుతున్నారు. మే 21 ఎలిజెబెత్ ఫ్రై అనే వైద్యురాలి పుట్టిన రోజు. ఈమె 'ఇన్‌స్టెట్యూషన్ ఆఫ్ నర్సింగ్ సిస్టర్స్' అనే సంస్థను స్థాపించింది. మదర్‌థెరిస్సా సైతం మనదేశమునకు వచ్చి అనాధల, అభాగ్యుల పాలిట కల్పవల్లిగా కుష్టురోగులకు సైతం సేవలందించింది. నర్సుగా తన జీవితాన్ని పేదలకు ధారబోసింది. తెలుపు రంగు దుస్తులు ధరించి, ఆప్యాయతగా మాట్లాడుతూ, రోగులను కంటికిరెప్పలా చూసుకుంటున్న నర్సుల సేవా నిరతి గొప్పది. ఓపికకు మారుపేరు నర్సులు. వైద్యులకు మించి రోగులను తమ కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తున్న నర్సులను గౌరవిద్దాం. వారితో స్నేహపూర్వకంగా, ప్రేమగా మాట్లాడుదాం. రోగుల పాలిట ప్రత్యక్ష దైవాలు నర్సులే అనే నినాదాన్ని నలువైపులా చాటుదాం.
-కెఎస్‌ఆర్., భూపాలపల్లి జయశంకర్‌జిల్లా.