Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మీరు జీవితంలో ఎవరినైనా ప్రేమించారా! ' అని మల్లిని పాత్రికేయులు ఒకసారి అడిగితే , అవును! నేను పర్వతాలని ప్రేమిస్తున్నాను అని ఆయన చిరునవ్వుతో సమాధాన మిచ్చాడు. ఆయన పర్వతారోహణే శ్వాసగా, జీవితశయంగా జీవించాడు. మల్లి మస్తాన్ బాబు కేవలం 172 రోజుల్లో ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఏడు అత్యున్నత శిఖరాలని అవలీలగా అధిరోహించి, ప్రపంచ రికార్డ్ సృష్టించి గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించాడు మల్లి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజనసంఘం గ్రామంలో 1974 సెప్టెంబర్ 3న ఒక సాధారణ గిరిజన కుటుంబంలో జన్మించిన మల్లి బాల్యంలో చురుకైన విద్యార్థిగా ఉండేవాడు. స్వగ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసిన మస్తాన్ బాబు కోరుకొండ సైనిక్ పాఠశాలలో పైతరగతులు చదివాడు. చిన్నప్పట్నుంచే మల్లికి కొండలెక్కడం అంటే మహా సరదా. సైనిక పాఠశాలలో చేరడమే ఆయన జీవితంలో కీలక మలుపు.
సైనిక పాఠశాలలో పూర్వ విద్యార్థి యం.ఉదరు భాస్కరరావు ఎవరెస్ట్ అధిరోహించే క్రమంలో మృత్యువాత పడటం, ఆయన విగ్రహాన్ని పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయడం తదితర సంఘటలన్నీ మల్లికి శిఖరారోహణపై ఆసక్తి కలిగింది. ఆయన కొంతకాలం సత్యం కంప్యూటర్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసి, తన లక్ష్య సాధన కోసం ఆ సంస్థ నుంచి తప్పుకొని, పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నాడు. హిమాలయ పర్వతాలలో ఉన్న పలు శిఖరాలని అధిరో హించాడు. 2006 జనవరి 19 న అంటార్కిటికా ఖండంలోని 4897 మీ టర్లు ఎత్తున్న 'విన్సన్ మాసిఫ్' శిఖరాన్ని అధిరోహించి తన శిఖర ప్రస్థా నాన్ని ప్రారంభించాడు. అదే ఏడాది మే 21న ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడం ద్వారా తన సీనియర్ విద్యార్థి కన్న కల నిజం చేశాడు. 2006 జూలై 10న ఉత్తర అమెరికాలోని 6194 మీటర్లున్న మౌంట్ మెకిన్లీ ( డెనాలి ) శిఖరాన్ని అధిరోహించడం ద్వారా ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. పాలకుల నుండి పెద్దగా ప్రోత్సాహం లేకపో యినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తన లక్ష్య సాధనని చేరుకున్నాడు. మల్లి బహుభాషా కోవిదుడు. గొప్ప పర్యావరణ ప్రేమికుడు, మంచి వక్త. హిమాలయ పర్వతాలలో పేరుకుపోతున్న వ్యర్థ పదార్థాల గురించి ఎప్పుడూ ఆందోళన చెందుతుండేవాడు. దేశ వ్యాప్తంగా పర్యటించి తన ప్రసంగాలతో యువతలో ఉత్తేజం నింపేవాడు. దురదుష్టవశాత్తూ 2015 మార్చిలో దక్షిణ అమెరికలోని ఆండీస్ పర్వతాలలో గల 6749 మీటర్ల ఎత్తుగల 'నెవాడో టైస్ క్రూసెస్ సర్ సవ్మిట్‌ని అధిరోహించి దిగే క్రమంలో తుఫాన్ తాకిడికి మల్లి మరణించాడు. పర్వతారోహణ అనేది సాహసంతో కూడుకొన్న క్రీడ. అందులో అనేక వ్యయ ప్రయాసాలు ఉంటాయి. 2016లో మస్తాన్ బాబు సోదరి దొరసానమ్మ ఆ శిఖరాన్ని అధిరోహించి మల్లి కలని సాకారం చేసింది. ఇటీవల తెలుగు రాష్ట్రాలలో గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్, కిలిమంజిరో వంటి శిఖరాలని అధిరోహిం చడం హర్షణీయం. ఆటలంటే క్రికెట్, చదువంటే ఇంజనీర్, మెడిసిన్ అనే అభిప్రాయం ఉన్న మన దేశంలో పాలకులు మరింత ప్రోత్సహిస్తే మస్తాన్ బాబు వంటి మట్టిలో మాణిక్యాలు మరి కొందరు వెలుగులోనికి వస్తారు.
- యం.రాంప్రదీప్
సెల్ : 9492712836