Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్యాగాలను మరిచి, ద్రోహులను వలచి తెలంగాణ సమాజాన్ని ''బాంచన్ దొరా! నీ కాళ్లు మొక్కుతా'' అనే గత కాల శిథిలాలకు తీసుకుపోవాలనుకోవడం మూర్ఖత్వం దొరా! చైతన్య, నారాయణ మేఘాలు కమ్ముకొని మైహౌం, రామోజీలతో గుబాళిస్తున్న గులాబీ పరిమళాలు ఎప్పటికి త్యాగాల తెలంగాణ చరిత్రను తాకలేవు దొరా! ''నువ్వు జై తెలంగాణ అన్నప్పటినుండి నీ వెంటే నడిచినం. నిన్ను ఆంధ్రోడని అంటుంటే నిందను తిప్పికొట్టి నిలబెట్టినం. రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నిన్ను అవమానిస్తే మేం అవమానభారంతో రగిలిపోయినం. నువ్వు ఉపఎన్నికలు తెస్తే నీ గెలుపు కోసం మేం చెమటోడ్చినం. లక్ష నాగళ్లతో రామోజీ ఫిలింసిటీని దున్నుతానంటే ఆంధ్ర పెత్తందారుల వెన్నులో వణుకు పుట్టించినవు అనుకున్నం. నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆంధ్ర వలస పాలకుల గుండెల్లో మేం అగ్గై మండినం. నిన్ను బతికించుకొనేందుకు మేం పెట్రోలు మంటల్లో కాలినం. జై తెలంగాణ అంటూ గులాబీ జెండెత్తినం- త్యాగాల బాటలో తెగించి పోరాడినం. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటే నీ కంటే సామాజిక వాది లేడనుకున్నం. తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానంటే నీలాంటి త్యాగి దొరకడనుకున్నం. మూడెకరాల భూమి ఇస్తానంటే దళితులకు నువ్వే పెద్దదిక్కనుకున్నం. కులసంఘ భవనాలు కట్టిస్తానంటే బడుగు వర్గాల ప్రతినిధివనుకున్నం. లక్ష ఉద్యోగాలు ఇస్తానంటే నిరుద్యోగుల ఆశాకిరణం అనుకున్నం. అవసరమైతే తల నరుకుంటా కానీ మాట తప్పను, మడమ తిప్పనంటే సత్యహరిచంద్రుడనుకున్నం. మా కాలికి ముళ్లు గుచ్చుకుంటే నీ పంటితో పీకుతానంటే అత్యంత ఆప్తుడనుకున్నం. జయశంకర్ సార్ కాళ్లకు దండం పెడితే గొప్ప సంస్కారవంతుడనుకున్నం. బంగారు తెలంగాణ చేస్తానంటే సంబరపడినం. బర్రెలు గొర్రెలిస్తుంటే పేదల పెన్నిధివనుకున్నాం దొరా! ఐదేండ్లకు నీ అసలు రూపం ఎరుకైంది దొరా! నాజీలకు పెద్దన్నవని, నిజాం నవాబుకు వారసుడవని తెలిసింది దొరా! తంతామన్నోళ్లను మంత్రులను చేస్తావని మేం కలగనలేదు దొరా! నమ్మినోళ్లను నట్టెట్ల ముంచి మోసాగాళ్లనే మోస్తావని మాకర్థమైంది దొరా! చీమలను తరిమేసి పాములను పెంచుతావని, కాకులను గొట్టి గద్దలకు పంచుతావని తెలిసింది దొరా!
ఆసరా ఫించన్లతో మా బతుకుల్లో ఆశలు రేపినవు దొరా! కళ్యాణ లక్ష్మితో మాకండ్లకు గంతలు కట్టినవు దొరా! మిషన్ భగీరథ, కాకతీయలతో మాచెవులు కుట్టినవు దొరా! రైతు బంధుతో రాబందులను ఎగదోసినవు దొరా! ప్రజా రవాణాపై పగపట్టినవు దొరా! తెలంగాణ మట్టి మనుషుల త్యాగాల చరిత్రను అపహాస్యం చేయబడితివి దొరా! తెలంగాణ ఉద్యమ త్యాగాలను యాది మరచి, చేసుకున్న బాసలన్నీ విడిచిపెట్టి ప్రజలపై పంతానికి దిగుతున్నవు. ఆర్టీసీ కార్మికులను రాచి రంపానబెట్టినవు. సమ్మెపై ఉక్కుపాదం మోపి నీ కంటే గొప్ప నియంత లేడని నిరూపించుకున్నవు దొరా! అరెస్టులు- నిర్బంధాలతో, కుట్రలు-కుతంత్రాలతో ప్రశ్నించే ప్రజా గొంతుకలను మూయిస్తున్నావు దొరా! గొంతులు మూయించినంత మాత్రాన ప్రశ్న మూగబోతుందా?! పోరాటం ఆగుతుందా దొరా?!! ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు చచ్చినా నీకు చీమ కుట్టలేదు దొరా! కనికరం లేని కరకు రాతి గుండె మీది దొరా! శబాష్ దొరా! ఇప్పటికైతే మీరెంత చెబుతే గంతే దొరా! మీరేది చెబితే గదే దొరా! కానీ మంచి మనసుతో ఒక మాట చెబుతా జర వినుకోండి దొరా! చరిత్ర సాక్ష్యం చెబుతుంది దొరా! కాల గమనంలో రాజులు రాజ్యాలే కనుమరుగైనయి, కోటగోడలు కూలిపోయినయి, నియంతల కలలు కల్లలుగానే మిగిలిపోయి శిధిలమైనయి. నేడు ఆ శిథిలాలపై ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలు జెండాలై, ఎజెండాలై రెపరెపలాడుతూ యథేచ్ఛగా ఎగురుతున్నాయి దొరా! వాటిని ఆపడం, అణచడం ఎవరి తరమూ గాదు. నీతరమూ అసలు గాదు దొరా! తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను ఆపటం ఎవరి తరమైంది దొరా? చరిత్రకు సాక్ష్యం ప్రజలే! చరిత్రకు ఆధ్యులు ప్రజలే! చరిత్ర నిర్మాతలు ప్రజలే! నువ్వో - నేనో కాదు దొరా! గిది తెలుసుకుంటే మంచిది దొరా! లేకుంటే ఆకాశానికి ఎత్తిన జనం, అధ్ణ పాతాళానికి తొక్కడం ఖాయం దొరా! ఇంకెంతో సమయం లేదు దొరా! అధికారం ఒక మత్తు, అదో గమ్మత్తు. అందులో పడి ఆగం కావద్దని తెలుసుకో దొరా! (తెలంగాణ సగటు మనిషి అంతరంగం)
- విశ్వ జంపాల
సెల్: 7793968907