Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
- వివిధ శాఖల అధికారులతో సమీక్ష
నవతెలంగాణ-తాడ్వాయి
మినీ మేడారం జాతరకు పకడ్భందీగా ఏర్పాట్లు చేయాలని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పీ చైర్మెన్ జగదీష్ కోరారు. మేడారంలోని ఐటీడీఏ గెస్ట్‌హౌజ్‌లో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన మినీ మేడారం జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి సత్యవతి గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి, జెడ్పీ చైర్మెన్ జగదీష్ మాట్లాడారు. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు జాతర జరగనున్న నేపథ్యంలో సందర్శకులు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా వసతులు కల్పించాలని సూచించారు.
నెల రోజుల్లో తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాగునీరు, వైద్యం, విద్యుత్, పారిశుధ్యం, రవాణా, ట్రాఫిక్, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇటీవల రెడ్డిగూడెంకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు జంపన్నవాగులో మృత్యువాత పడడం బాధాకరమన్నారు. ప్రజలు కాంక్షిస్తే చెక్‌డ్యామ్‌లు తీసేస్తామని స్పష్టం చేశారు. టాయిలెట్స్ వద్ద నిరంతరాయంగా నీటి సరఫరా ఉండాలని, అవసరమైనన్ని బోర్లు వేయాలని చెప్పారు. జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి జనం రానున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పారు. పలువురు సొంత వాహనాల్లో వచ్చే అవకాశం ఉన్న క్రమంలో రోడ్లను మరమ్మతు చేయాలని సూచించారు. కాటాపూర్ బీరెల్లీ బయ్యారం డబుల్ రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ డీఈ రఘువీర్‌కు చెప్పారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ హన్మంతు కే జండగే, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, ఏఎస్పీ సాయి చైతన్య, డీఆర్వో రమాదేవి, జెడ్పీ సీఈఓ ప్రసూనారాణి, డీఆర్డీఓ పారిజాతం, తహసీల్దార్ శ్రీనివాస్, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మెన్ రామ్మూర్తి, ఆత్మ చైర్మెన్ రమణయ్య, మేడారం ఈఓ రాజేందర్, పస్రా సీఐ శ్రీనివాస్, ఎస్సైలు వెంకటేశ్వర్‌రావు, రవీందర్, సర్పంచ్ చిడం బాబురావు, సిద్దబోయిన చిన్నక్క, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి చంద్రయ్య, మాజీ మండల అధ్యక్షురాలు ముండ్రాతి రాజశ్రీ, తదితరులు పాల్గొన్నారు.