Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్రమత్తత-పక్కా ప్రణాళిక 12 అంశాలపై దృష్టి
- ప్రతిరోజు క్లీనింగ్, శానిటేషన్
- ప్రభుత్వ మార్గదర్మకాలు విడుదల
- 23 నాటికే పాఠశాలలు సిద్దం
- నిత్యం 'ప్రయివేట్'ల్లో తనిఖీ
- హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
పాఠశాల ప్రారంభం సందర్భంగా విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం విడుదల చేసిన పక్కా ప్రణాళికతో ముందుకు పోవడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు అపరిశుభ్రంగానే ఉన్నాయి. ఈనెల 23 నాటికే శుభ్రం తయారు చేయనున్నారు. ప్రతిరోజు క్లీనింగ్, శానిటేషన్ చేయడంతోపాటు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక తరగతి గదిలో 20 మంది విద్యార్థులు మాత్రే కూర్చొనున్నారు. రావడానికి, పోవడానికి సైతం వేర్వేరుగా దారులను ఏర్పాటు చేస్తారు. ఎనిమిది నెలల తర్వాత తెరుచుకోనున్న నేపథ్యంలో పాఠశాలలను సిద్దం చేస్తున్నారు. సమస్యలు తీవ్రంగా ఉన్న పాఠశాలలు, హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి శుభ్రత పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4వేల 972 పాఠశాలలున్నాయి. అందులో ప్రాథమిక పాఠశాలలు 2 వేల 753 కాగా ప్రాథమికోన్నత పాఠశాలలు 788. ఉన్నత పాఠశాలలు 1431 ఉన్నాయి. అయితే 9, 10వ తరగతులు మాత్రమే ప్రారంభం కానున్నాయి. 10వ తరగతి విద్యార్ధులు సుమారు 80 వేల మంది ఉండగా తొమ్మిదో తరగతి విద్యార్ధులు అంతకంటే ఎక్కువ మందే ఉన్నారు. గతేడాది మార్చిలో పాఠశాలలను మూసివేయగా మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో పాఠశాలలు దుమ్ముపట్టి అపరిశుభ్రంగా తయారయ్యాయి. పరిసరాల్లో చెట్లు పెరిగాయి. వంటశాలలు పూర్తి అపరిశుభ్రతతో ఉన్నాయి. మరుగుదొడ్లు, మూత్రాశాలలను శుద్ధి చేయలేదు. ఫిజికల్ గ్రౌండ్స్, లైబ్రరీలు, లాబొరేటరీలు దుమ్ము పట్టి ఉన్నాయి. అయితే ఇటీవల ఉపాధ్యాయులు వెళ్తుండగా స్టాఫ్ రూమ్‌లను మాత్రమే శుభ్రం చేశారు. మిగతావి పూర్తి అపరిశుభ్రంగా ఉన్న పరిస్థితి నెలకొంది.
మూడు విభాగాలుగా మార్గదర్శకాలు
పిబ్రవరి ఒకటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మూడు విభాగాలుగా 18 నిబంధనలతో మార్గదర్శకాలు విడుదల చేశారు. అందులో ప్రధానంగా పాఠశాల ప్రాంతంతోపాటు తరగతి గదులను పూర్తిగా శానిటేషన్‌తో శుభ్రం చేయాలి. అయితే దీని బాధ్యత గ్రామ పంచాయతీలకు అప్పగించారు. గ్రామంలోని పారిశుధ్య కార్మికుల చేత ఈ పనులు చేయించాలి. ఇది సాధ్యమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇక ప్రతి విద్యార్థికీ రెండు మీటర్ల దూరం పాటించాలి. ఒక తరగతి గదిలో 20 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలి. స్టాఫ్, ఆఫీస్ రూమ్‌లోనూ భౌతికదూరం పాటించాలి. పాఠశాలకు, తరగతి గదిలోకి రావడానికి, వెళ్లడానికి ప్రత్యేక దారులు ఏర్పాటు చేయాలి. తాగునీటి సౌకర్యం కల్పించాలి, చేతులు శుభ్రం చేసుకొని నీరు తాగేలా ఏర్పాట్లు ఉండాలి. ఫిజికల్ గ్రౌండ్, లైబ్రరీలు, ల్యాబ్‌లను శుభ్రం చేయాలి, మెడికల్ ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేయాలి. స్థానిక పీహెచ్‌సీ వైద్యులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అనేక నిబంధనలు విడుదల చేశారు. అయితే వీటన్నిటినీ పాఠిస్తారా..? లేదా అన్న అనుమానాలున్నాయి. అయితే ఈ పనులను వివిధ విభాగాలకు అప్పగించారు. గ్రామ పంచాయితీ సిబ్బంది ప్రతిరోజు శుభ్రం చేయడమే సమస్యగా మారనుంది.
అపరిశుభ్రంగా పాఠశాలలు
ఉమ్మడి జిల్లాలో 1431 ఉన్నత పాఠశాలు ఉండగా 50-60 మినహా మిగతా పాఠశాలు అపరిశుభ్రంగానే ఉన్నాయి. మంత్రి ఎర్రబెల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలో 12 ఉన్నత పాఠశాలలుండగా చెన్నూరు మినహా అన్ని పాఠశాలల్లో చెట్లు పెరిగాయి. పాఠశాలను కనీసం శుభ్రం చేయలేదు. దీంతో చెత్తతో నిండిపోయాయి. ఒక్కో పాఠశాలను శుభ్రం చేయడానికి 4-5 రోజులు పట్టే అవకాశం ఉంది. పాలకుర్తిలోని దర్ధపల్లి పాఠశాల పూర్తి అపరిశుభ్రంగా ఉన్న పరిస్థితి. 90 శాతం పాఠశాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. వాచ్‌మెన్, స్వీపర్లు ఉన్నప్పటికీ శుభ్రం చేయడం లేదు. వంటశాలల పరిస్థితి మరీ అధ్వాహ్నం.
హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి
పాఠశాల కంటే హాస్టళ్లల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. కొంత కాలంగా విద్యార్థులు లేకపోవడంతో నిర్మానుష్యంగా తయారయ్యాయి. హాస్టళ్లను శుభ్రం చేయడం కష్టతరమైన పని. అయితే కస్తూర్బా గాంధీ పాఠశాలలు, రెసిడెన్సియల్ పాఠశాలలు, జ్యోతిరావుపూలే హాస్టళ్లు, గిరిజన హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులతోపాటు హాస్టళ్ల అధికారులతో జిల్లా కలెక్టర్లు సమావేశాలు నిర్వహించారు. సిబ్బంది ఉన్న చోట శుభ్రం చేయిస్తున్నారు. అయితే హాస్టల్ విద్యార్ధులకు కోవిడ్ టెస్టులు చేసే అవకాశాలున్నాయి. ఎక్కువ మంది ఒకే చోట ఉండే అవకాశాలు ఉండడంతో ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంది. దీంతో అధికారులు హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు.
నిత్యం ప్రయివేట్ పాఠశాలల తనిఖీ
ప్రయివేట్ పాఠశాలలు శుభ్రంగానే ఉండగా అధికారులు నిత్యం తనిఖీ చేయనున్నారు. ప్రతి తరగతి గదిలోనూ 20 మంది మాత్రమే కూర్చొవాల్సి ఉండగా నింబంధనలను పాటిస్తున్నారా..? అనే అంశాలను పరిశీలిస్తారు. ప్రయివేట్ పాఠశాలల్లోనే నర్సులు అందుబాటులో ఉండడం, ప్రతిరోజు శానిటేషన్ చేయడం, తదితర అంశాలను పరిశీలించనున్నారు. ఇలా పక్కా ప్రణాళికతో ఫిబ్రవరి నుంచి పాఠశాలు ప్రారంభం కానున్నాయి.