Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోళ్లపై అనుమానం
- కొన్నది 4.94 లక్షల మెట్రిక్ టన్నులే
- ఇప్పటికే 361 కేంద్రాలు మూసివేత
- యాసంగిలో వరిసాగే అత్యధికం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
రైతన్నకు యాసంగి గోస తప్పేటట్లు లేదు. ధాన్యం కొనుగోళ్లపై అనుమానాలు రేకెత్తు తున్నాయి. ఖరీఫ్‌లోనూ ప్రభుత్వం అనుకున్న మేరకు కొనుగోలు చేయలేదు. ఇప్పటికే 40 శాతానికిపైగా కొనుగోలు కేంద్రాలు ఎత్తివేశారు. యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు చేయడం కష్టమని మంత్రులే చెబుతున్నారు. ప్రభుత్వమే చేతులు ఎత్తేస్తే రైతుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఈ ఉడాది ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 50లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 7లక్షల65వేల ఎకరాల్లో సాగైంది. 12 లక్షల 42 వేల 549 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 4 లక్షల 94 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. గతేడాది యాసంగిలో 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. గతేడాది యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యానికి ఈ ఏడాది ఖరీఫ్‌లో కొనుగోలు చేసిన ధాన్యానికి చాలా తేడా ఉంది. దీనితో ఈ ఏడాది యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తారా..లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కొనుగోలు కేంద్రాలు ఎత్తేశారు
ఈ ఏడాది వర్షాకాలంలో 12 లక్షల 42 వేల 549 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం కోసం 978 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత మూడు మాసాలుగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికీ కొనుగోలు చేసింది మాత్రం 4 లక్షల 94 వేల మెట్రిక్ టన్నులే. ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో 361 ఎత్తేశారు. అంతకు ముందు ప్రభుత్వం సన్న దిగుబడి చేయాలని రైతులకు ఆంక్షలు పెట్టింది. కనీసం మద్దతు ధర లభిస్తుందని రైతులు
ఆశించారు. కానీ దొడ్డు ధాన్యం, సన్న ధాన్యాన్ని ఒకే ధరకు కొనుగోలు చేశారు. దీనితో రైతులు భారీగా నష్టపోయారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయకపోతే మరికొందరు రైతులకు న్యాయం జరిగేది. కానీ తీరుతో పలు గ్రామాల రైతులు ప్రయివేట్ వ్యాపారులకు అమ్ముకొని నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యాసంగిలో వరిసాగే అత్యధికం
వర్షాకాలంలో దిగుబడైన ధాన్యంలో 50 శాతం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయ లేదు. అయినా రైతులు యాసంగిలోనూ వరిపంటనే అత్యధికంగా సాగు చేస్తున్నారు. నీరు పుష్కలంగా ఉండడమే ఇందుకు కారణం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులు నిర్ణయించిన యాసంగి సాగు అంచనా 5 లక్షల 4 వేల 429 ఎకరాలు. అందులో వరి సాగు 2 లక్షల 81 వేల 607 ఎకరాలు. ఇతర పంటలు 2 లక్షల 22 వేల 822 ఎక రాలు. అంటే 60 శాతం వరిపంట సాగు చేస్తున్నారు. 80 శాతం నాట్లు పూర్త య్యాయి. వర్షా కాలంలోనే వరి సాగు చేసి ప్రభుత్వ నిర్లక్ష్యం వలన అతి తక్కువకు అమ్ము కొని నష్టపోయిన రైతన్న యాసంగిలోనూ నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. రైతులు ఇష్టం వచ్చిన పంటలు దిగుబడి చేయొచ్చని సీఎం కేసీఆర్ చెప్పడంతో వరిసాగుపై దృష్టి పెట్టిన రైతులు కొనుగోళ్లపై కిరికిరి పెడితే ఎలా అన్న విషయమై పునరాలోచనలో పడ్డారు.
కొనుగోళ్లపై అనుమానాలు
యాసంగి పంట కొనుగోళ్లపై రైతులకు ఇప్పటి నుంచే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గతేడాది ప్రభుత్వ సంస్థలైన పీఏసీఎస్, ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన సంఖ్యకు, ఈ ఏడాది వర్షాకాలంలో కొనుగోలు చేసిన పంటకు చాలా తేడా ఉంది. సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా తగ్గింది. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా యాసంగి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు. ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే యాసంగి రైతులు తీవ్రంగా నష్టపోవడం ఖాయం. వర్షాకాలం ధాన్యం లాగే రూ.1200-1400లకు క్వింటాలు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రభుత్వమే కొనుగోలు చేయాలి : సారంపల్లి వాసుదేవరెడ్డి
రైతు పండించిన అన్ని పంటటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అలిండియా కిసాన్ సభ జాతీయ నాయకుడు సారంపల్లి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం కార్పొరేట్ వ్యవసాయానికి అర్రులు చాస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతను పూర్తిగా విస్మరించే ప్రయత్నం చేస్తోంది. రైతు పండించిన చివరి గింజనూ కొనుగోలు చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకు కొనుగోలు చేయడం లేదు. కొనుగోళ్లను విస్మరిస్తే పోరాటాలు తప్పవు.