Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లారీ యజమానులతో కాంట్రాక్టర్ల కుమ్మక్కు
- ఇసుక రీచ్‌ల వద్ద లోడింగ్‌లో మోసాలు
- నామ మాత్రపు తనిఖీలు.. పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-భూపాలపల్లి
ఇసుక క్వారీల యజమానులు, కాంట్రాక్లర్ల దందా జోరుగా సాగుతోంది. అనుమతులు తక్కువ ఇసుకదందా ఎక్కువ అన్న చందంగా మారుతోంది. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారీతిన వ్యవహరిస్తూ రూ.లక్షల్లో సొమ్ముచేసుకుంటున్నారు. జేసీబీ బకెట్‌తో రోజుకు రూ.లక్ష అదనంగా దండుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్టు ఆరోపణలూ ఉన్నాయి. ఒక్కో ఇసుక క్వారీ వద్ద అదనంగా ఒక్క జేసీబీ బకెట్ ఇసుకను అక్రమంగా తోలుకుపోతున్న పరిస్థితి. దీనిని నియంత్రించాల్సిన కొందరు అధికారులు పట్టనట్టు వ్యవహరంచడం గమనార్హం. నామమాత్రపు తనిఖీలు చేపట్టి ఓవర్ లోడ్ ఇసుక లారీలను సీజ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇందుకు జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం లోని ఇసుక క్వారీల యజమానులే నిదర్శనం.
జిల్లా లోని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు ఒరిగిందేమీ లేకున్నా ఇసుకాసురులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. కాళేశ్వరం ప్రాంతంలో గతంలో 23 ఇసుక రీచ్‌లు ఉండగా ప్రస్తుతం 11 రీచ్‌లు నడుస్తున్నాయి. కాళేశ్వరం పరిధి పలుగుల వద్ద తొమ్మిది రీచ్‌లు, ముద్దులపల్లి వద్ద రెండు రీచ్‌లు, పూసలపల్లి వద్ద ఒకటి మొత్తం 11 ఇసుక రీచ్‌ల ద్వారా రోజుకు సుమారు 800కు పైగా లారీలు కొనసాగుతున్నాయి. ఇసుక కొనుగోలు చేయడం కోసం లారీ యజమానులు ప్రభుత్వానికి ఆన్లైన్లోనే డబ్బులు చెల్లించి ఇసుక క్వారీ వద్దకు వెళితే లోడ్ చేస్తారు. ఇదే అదునుగా కొందరు యజమానులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి ప్రభుత్వానికి ఆన్లైన్లో చెల్లించిన దానికంటే ఎక్కువ లోడ్ చేసుకుంటున్న పరిస్థితి. లోడ్ చేసే సమయంలో కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై జేసీబీ డ్రైవర్‌కు చెప్పి అదనంగా రెండు బకెట్‌ల ఇసుక లోడ్ చేసుకుంటున్న పరిస్థితి. ఒక బకెట్ సుమారు నాలుగున్నర టన్నుల ఇసుక ఉంటుంది. ఇలా ఒక్కో లారీ లోడ్‌లో అదనపు బకెట్‌కు రూ.1500 నుంచి రూ.3వేల వరకు ముడుపులందుకుంటున్నట్టు తెలిసింది. మహదేవ్‌పూర్ మండలం కుంట్లంలోని 3, పలుగుల 5, 6, 8 ,10, 11, 12 నెంబర్ల క్వారీల ఇసుకకు రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ ఉండడంతో ఇసుక దందా కొత్తపుంతలు తొక్కుతోంది. కాంట్రాక్టర్లు ఓవర్ లోడ్ ద్వారా వసూలు చేసిన డబ్బులో కొంత అధికార పార్టీ లీడర్లకు టీఎస్ ఎంబీసీ, మైనింగ్, రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్ పోర్ట్ ,డిపార్ట్మెంట్ ఆఫీసర్ల స్థాయిని బట్టి వాటాలు పంపుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. దీంతో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని తెలిసింది. గురువారం(4-3-2021) సాయంత్రం భూపాలపల్లి పట్టణంలోని మంజూరునగర్‌లో స్థానిక ఎస్సై ఉదరు కిరణ్ ఆధ్వర్యంలో తనిఖీ చేయగా అధిక లోడుతో వెళ్తున్న ఐదు ఇసుక లారీలు పట్టుబడ్డాయి. వాటిని సీజ్ చేసి సంబంధిత మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ కు అప్పగించారు. తనిఖీలు ఇలానే కొనసాగితే అక్రమ ఇసుక దందా, ఓవర్ లోడ్ దందాను నియంత్రించొచ్చని పలువరు పేర్కొంటున్నారు.
అధిక లోడు చేస్తే చర్యలు తప్పవు
కాలేశ్వరం ఇసుక క్వారీల్లో పరిమితికి మించి అధిక లోడు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇంతవరకు ఇసుక అధిక లోడు విషయం మా దష్టికి రాలేదు. నిత్యం వాహనాల తనిఖీ చేపడుతున్నాం.
- భూక్య నరహరి, కాళేశ్వరం ఎస్సై